ఆ ఐదు రాష్ట్రాల్లో కరోనా కేసులు పైపైకి

న్యూఢిల్లీ: దేశంలో కేవలం మహారాష్ట్రనే కాదు, మరో నాలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కరోనా కేసులు పెరుగుతుండటంతో అప్రమత్తమైన మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మళ్లీ లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ పెరుగుదల ఇతర రాష్ట్రాల్లోనూ కనిపిస్తున్నదని కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. మహారాష్ట్రతోపాటు కేరళ, పంజాబ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గడ్‌లను హెచ్చరించింది. మహారాష్ట్ర తరహాలోనే పంజాబ్‌లోనూ కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం మీడియాకు తెలిపింది. […]

Update: 2021-02-20 05:37 GMT

న్యూఢిల్లీ: దేశంలో కేవలం మహారాష్ట్రనే కాదు, మరో నాలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కరోనా కేసులు పెరుగుతుండటంతో అప్రమత్తమైన మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మళ్లీ లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ పెరుగుదల ఇతర రాష్ట్రాల్లోనూ కనిపిస్తున్నదని కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. మహారాష్ట్రతోపాటు కేరళ, పంజాబ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గడ్‌లను హెచ్చరించింది.

మహారాష్ట్ర తరహాలోనే పంజాబ్‌లోనూ కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం మీడియాకు తెలిపింది. శుక్రవారం నాటికి అత్యధిక కేసులు మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయని వివరించింది. గడిచిన 24 గంటల్లో 6112 కొత్త కేసులు మహారాష్ట్రలో రిపోర్ట్ అయ్యాయని వెల్లడించింది. కేరళలో 4505 కేసులు నమోదయ్యాయని పేర్కొంది. పంజాబ్‌లో 383 కేసులు, ఛత్తీస్‌గడ్‌లో 259 కేసులు, మధ్యప్రదేశ్‌లో 297 కేసులు వెలుగు చూశాయని తెలిపింది. మొత్తంగా శనివారం ఉదయానికి దేశంలో 13993 కొత్త కేసులు నమోదయ్యాయని, దీంతో దేశంలోని మొత్తం కేసుల సంఖ్య 1,09,77,387 కేసులు నమోదు అయ్యాయని వివరించింది.

టీకా వేసుకోండి: కేంద్ర ఆరోగ్య మంత్రి

దేశంలో మొత్తం 1,07,15,304 మందికి టీకా వేసినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం ఉదయం వెల్లడించింది. అయితే, చాలా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు నిర్దేశించుకున్న స్థాయిలో టీకా పంపిణీ చేపట్టలేకపోతున్నాయి. ఫ్రంట్‌లైన్ వర్కర్లకు టీకా పంపిణీకి పెట్టుకున్న టార్గెట్‌లో 50శాతమూ సాధించని రాష్ట్రాలున్నాయి. తమిళనాడు, ఢిల్లీ, పంజాబ్ సహా పలురాష్ట్రాలు 50శాతం టార్గెట్‌నూ రీచ్ కాలేవు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ టీకా వేసుకోవాల్సిందిగా హెల్త్‌కేర్, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు విజ్ఞప్తి చేశారు. షెడ్యూల్‌కు అనుగుణంగా టీకా వేసుకోవాల్సిందిగా అభ్యర్థించారు. కరోనా టీకాలు సురక్షితమని, ఇప్పటివరకు టీకా కారణంగా ఎవరూ మరణించలేదని స్పష్టం చేశారు.

20లోపు ఒక్క డోసైనా వేసుకోవాలి

కరోనా టీకా పంపిణీ కార్యక్రమంలో భాగంగా రెండు డోసులు వేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం నిర్దేశించిన వర్గాల్లోనూ ఇప్పటికి ఇంకా ఒక్కడోసూ వేసుకోనివారున్నారు. ఈ నెల 20లోపు నిర్దేశిత హెల్త్‌కేర్ వర్కర్లకు మొదటి డోసు పంపిణీ పూర్తి చేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. అనంతరం రెండో డోసు పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవాలని తెలిపింది. వచ్చే నెల 6 లోపు ఫ్రంట్‌లైన్ వర్కర్లందరికీ తొలి డోసు పంపిణీ పూర్తి చేసుకోవాలని, రెండో డోసు పంపిణీ కార్యక్రమాన్నీ వెంటనే ప్రారంభించాలని ఆదేశించింది.

Tags:    

Similar News