రాకాసి గుప్పిట్లో రాజధాని…
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కరాళనృత్యం చేస్తున్నది. రాజధానిలో నాలుగో దశగా పేర్కొంటున్న కరోనా వైరస్ విజృంభణ ధాటికి ఆస్పత్రుల్లో బెడ్లన్నీ నిండిపోయాయి. ఒక్కరోజులోనే కరోనా పాజిటివిటీ రేటు 24 శాతం నుంచి 30 శాతానికి పెరిగింది. శనివారం ఢిల్లీలో 24 వేల(24,375 కేసులు) కరోనా కేసులు నమోదైన నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై సమీక్షించారు. ఢిల్లీలో ప్రస్తుతం ఐసీయూ బెడ్లు వంద కంటే తక్కువగా ఉన్నాయంటే వైరస్ […]
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కరాళనృత్యం చేస్తున్నది. రాజధానిలో నాలుగో దశగా పేర్కొంటున్న కరోనా వైరస్ విజృంభణ ధాటికి ఆస్పత్రుల్లో బెడ్లన్నీ నిండిపోయాయి. ఒక్కరోజులోనే కరోనా పాజిటివిటీ రేటు 24 శాతం నుంచి 30 శాతానికి పెరిగింది. శనివారం ఢిల్లీలో 24 వేల(24,375 కేసులు) కరోనా కేసులు నమోదైన నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై సమీక్షించారు. ఢిల్లీలో ప్రస్తుతం ఐసీయూ బెడ్లు వంద కంటే తక్కువగా ఉన్నాయంటే వైరస్ తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఈ మేరకు కేజ్రీవాల్.. ఢిల్లీలో కొవిడ్ విజృంభణతో బెడ్లు లేక బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనీ, కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న ఆస్పత్రులలోని 7 వేల బెడ్లను కరోనా పేషెంట్లకు కేటాయించాలని ప్రధానిని లేఖ ద్వారా కోరారు. పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని, అయినా దీనిని అదిగమించేందుకు అవకాశాలున్నాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం తెలిపారు.
మా వంతు కృషి చేస్తున్నాం. ఆదుకోండి..
కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ‘ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే ఆస్పత్రులలో 10 వేల బెడ్స్ ఉన్నాయి. ఇందులో 1,800 బెడ్స్ మాత్రమే కరోనా పేషెంట్లకు కేటాయించారు. ప్రస్తుతం ఉన్న ఆందోళనకర పరిస్థితుల దృష్ట్యా వీటిలో మరో 7 వేల బెడ్లను కొవిడ్ బాధితుల కోసం రిజర్వ్ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాం’ అని తెలిపారు. ఢిల్లీలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులలో ఆక్సిజన్ కొరత ఆందోళనకరంగా ఉందని, దానిని తక్షణమే అందించాలని సీఎం కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇదే విషయమై కేంద్ర వైద్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్దన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోనూ మాట్లాడినట్టు సీఎం వెల్లడించారు. ఢిల్లీలో ఒక్కరోజే 24 వేలకు పైగా కేసులు నమోదవ్వడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అయితే వైరస్ కట్టడికి తమ వంతు కృషి చేస్తున్నామని, ఇదే సమయంలో కేంద్ర సాయం కూడా కావాలని ఆయన మోడీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.
యుద్ధ ప్రాతిపదికన మరో 6 వేల బెడ్లు సిద్ధం
కొవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులన్నీ కిక్కిరిసిపోతున్న నేపథ్యంలో మరో 6 వేల బెడ్లను యుద్ధ ప్రాతిపదికన సిద్ధం చేస్తున్నామని కేజ్రీవాల్ తెలిపారు. మరో రెండు మూడు రోజుల్లో అవి అందుబాటులోకి వస్తాయని సీఎం చెప్పారు. యమునా స్పోర్ట్స్ కేర్ కాంప్లెక్స్, కామన్వెల్త్ గేమ్ విలేజ్, రాధా స్వామి సత్సంగ్ లనూ కొవిడ్ కేర్ సెంటర్‌లుగా మార్చుతున్నామని వివరించారు. వీటితో పాటు షకుర్ బస్తీ, ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్లలో రైల్వే కోచ్‌లను కొవిడ్ కేర్ సెంటర్లుగా మార్చాలని ఢిల్లీ సీఎస్ విజయ్ కుమార్ దేవ్.. రైల్వే బోర్డు ఛైర్మెన్ సునీత్ శర్మను కోరారు.