కొవిడ్ తెచ్చుకుంటే.. రూ.50 వేల క్యాష్ బ్యాక్

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా ప్రపంచాన్ని ఎంతగా వణికిస్తోందో వేరే చెప్పనక్కర్లేదు. బయటకెళ్లాంటేనే జనం జంకుతున్నారు. ప్రభుత్వాలు కూడా కరోనా కట్టడికి కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్ల నగరాలు, పట్టణాలకే పరిమితమైన కరోనా కేసులు.. ఇప్పుడు గ్రామాల్లోనూ పెరుగుతున్నాయి. కేరళలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా కరోనా వ్యాప్తి తగ్గడం లేదు. ఇలాంటి తరుణంలో.. ప్రజలు షాపింగ్ చేయడానికి వెనకడుగు వేస్తున్నారు. దీంతో కస్టమర్లను ఆకట్టుకునేందుకు కేరళలోని ఓ ఎలక్ట్రానిక్ షాప్ యజమాని వినూత్న రీతిలో యాడ్ ఇచ్చి.. […]

Update: 2020-08-19 02:58 GMT

దిశ, వెబ్‌డెస్క్ :
కరోనా ప్రపంచాన్ని ఎంతగా వణికిస్తోందో వేరే చెప్పనక్కర్లేదు. బయటకెళ్లాంటేనే జనం జంకుతున్నారు. ప్రభుత్వాలు కూడా కరోనా కట్టడికి కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్ల నగరాలు, పట్టణాలకే పరిమితమైన కరోనా కేసులు.. ఇప్పుడు గ్రామాల్లోనూ పెరుగుతున్నాయి. కేరళలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా కరోనా వ్యాప్తి తగ్గడం లేదు. ఇలాంటి తరుణంలో.. ప్రజలు షాపింగ్ చేయడానికి వెనకడుగు వేస్తున్నారు. దీంతో కస్టమర్లను ఆకట్టుకునేందుకు కేరళలోని ఓ ఎలక్ట్రానిక్ షాప్ యజమాని వినూత్న రీతిలో యాడ్ ఇచ్చి.. విమర్శలు ఎదుర్కొన్నాడు. అంతేకాదు, అతనిపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం యోచిస్తోంది.

షాపింగ్ చేసిన 24 గంటల్లో కరోనా పాజిటివ్ వస్తే.. రూ. 50 వేల క్యాష్ బ్యాక్ ఇస్తామంటూ కేరళలోని ఓ ఎలక్ట్రానిక్ షాప్ యజమాని ఇచ్చిన యాడ్ వివాదాస్పదంగా మారింది. ఆగస్టు 15 నుంచి ఆగస్టు 30 వరకు ఈ ఆఫర్ ఉంటుందని వెల్లడించాడు. ఈ యాడ్ చూసి అటు జనాలు, ఇటు ప్రభుత్వ అధికారులు ఆశ్చర్యపోయారు. డిజిటల్, ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాల్లో ఇచ్చిన ఈ యాడ్‌పై కేరళ అధికారులు సీరియస్ అయ్యారు. కేరళలో ఒక పెద్ద షాపులోకి 20 మందిని మించి అనుమతించరాదనే రూల్ అమల్లో ఉంది. ఈ క్రమంలోనే కొట్టాయంకు చెందిన ఓ లాయర్ ఈ యాడ్‌పై స్పందించారు. నేరుగా సీఎం పినరయి విజయన్‌కు లేఖ రాశారు. వెంటనే స్పందించిన సీఎం కార్యాలయం.. ఈ ఇష్యూపై పలు ఆదేశాలు జారీ చేసింది. పోలీసులు దుకాణం మూసేయాలని సూచించడంతో పాటు యజమానిపై దర్యాప్తు ప్రారంభించారు. ఆ షాపు యజమానిపై ఐపీసీ సెక్షన్ 269, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2020, సెక్షన్ 89 కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019, హెల్త్ నార్మ్స్ కేరళ మున్సిపాలిటీ యాక్ట్ ప్రకారం పలు కేసులు ఆయనపై పెట్టారు.

కేరళలో ఆగస్టు 17న 1725 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసుల సంఖ్య ఇదే. అంతేకాదు, ఇప్పటివరకు కేరళలో 169 మంది కొవిడ్ వల్ల చనిపోయారు.

Tags:    

Similar News