నిర్లక్ష్యానికి స్పష్టమైన అర్థం ఇదే!
దిశ ప్రతినిధి, ఖమ్మం : భద్రాచలం వద్ద గోదావరి నదిపై నిర్మిస్తున్న బ్రిడ్జి పనులు నత్తనడకన సాగుతున్నాయి. రూ.65 కోట్ల వ్యయంతో ఈ నిర్మాణం చేపడుతున్నారు. పనులు ప్రారంభమై ఆరేండ్లు గడుస్తున్నా వర్క్ అంతంత మాత్రంగానే కొనసాగుతోంది. పాత బ్రిడ్జి శిథిలావస్థకు చేరడంతో ప్రభుత్వం కొత్త బ్రిడ్జి నిర్మాణం చేపట్టింది. పనులు ఇలా నెమ్మదిగా కొనసాగితే ఇంకా మూడేండ్లయినా నిర్మాణం పూర్తి అయ్యే అవకాశాలు లేవు. భద్రాచలం వద్ద నిర్మిస్తున్న బ్రిడ్జి పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. ఆరంభమై […]
దిశ ప్రతినిధి, ఖమ్మం : భద్రాచలం వద్ద గోదావరి నదిపై నిర్మిస్తున్న బ్రిడ్జి పనులు నత్తనడకన సాగుతున్నాయి. రూ.65 కోట్ల వ్యయంతో ఈ నిర్మాణం చేపడుతున్నారు. పనులు ప్రారంభమై ఆరేండ్లు గడుస్తున్నా వర్క్ అంతంత మాత్రంగానే కొనసాగుతోంది. పాత బ్రిడ్జి శిథిలావస్థకు చేరడంతో ప్రభుత్వం కొత్త బ్రిడ్జి నిర్మాణం చేపట్టింది. పనులు ఇలా నెమ్మదిగా కొనసాగితే ఇంకా మూడేండ్లయినా నిర్మాణం పూర్తి అయ్యే అవకాశాలు లేవు.
భద్రాచలం వద్ద నిర్మిస్తున్న బ్రిడ్జి పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. ఆరంభమై ఆరేళ్లు గడుస్తున్నా.. పిల్లర్ల ఏర్పాటుకు ఇంకా పునాదులు తీసే పనులే సాగుతుండటం గమనార్హం. కరోనా వైరస్ ప్రబలుతున్న క్రమంలో కార్మికుల వారి స్వస్థలాలకు వెళ్లిపోయారు. దీంతో ప్రస్తుతం ఈ నిర్మాణ పనులు పూర్తిగా నిలిచిపోయాయి. పనులు జరుగుతున్న తీరు చూస్తుంటే మరో మూడేండ్లయినా నిర్మాణం పూర్తవుతుందా..? అనే సందేహం కలుగుతోంది. పాత బ్రిడ్జి శిథిలావస్థకు చేరుకుని ప్రమాదకరంగా మారడంతో ఈ బ్రిడ్జీ నిర్మాణానికి ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది. కానీ పనులు వేగంలో పాలకులు, అధికారులు చొరవ చూపడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు.
రూ.65 కోట్లతో..
దాదాపు రూ.65కోట్ల భారీ వ్యయంతో ఈ వంతెనను నిర్మిస్తున్నారు. 2014 చివరలో మొదలైన పనులు ఆగుతూ.. సాగుతున్నాయి. మొత్తం 36 పిల్లర్లతో వంతెన నిర్మాణం చేపట్టగా ఇప్పటి వరకు 30 వరకు పోల్స్ నిర్మాణం పూర్తయింది. పీఆర్ సైతం 30 వరకు పూర్తయింది. మరో నాలుగింటి నిర్మాణం చేపడుతున్నారు. ఐదు పిల్లర్ల మధ్య శ్లాబు వర్క్ సైతం పూర్తయింది. రెండు పిల్లర్లకు సంబంధించిన పునాది పనులు మాత్రం ఏడాదిగా కొనసాగుతూనే ఉన్నాయి. గోదావరి అడుగు భాగంలో బ్లాక్ స్టోన్ రావడంతో తొలగింపు ప్రయాసగా మారిందని కార్మికులు చెబుతున్నారు.
ప్రమాదకరంగా పాత బ్రిడ్జి
పక్కనే బ్రిడ్జీ ఉన్నందున బ్లాస్టింగ్‌కు అనుమతి లేకపోవడంతో మ్యానువల్‌గానే నల్లరాయి తొలగింపు పనులు చేపడుతున్నారు. దీని వల్లే పనుల్లో జాప్యం జరుగుతున్నట్టు సమాచారం. గోదావరి నది నడి మధ్యలో పిల్లర్ల తవ్వుతుండటం వల్ల నీటి ఊట కారణంగా పనుల నిర్వహణ కష్టతరంగా మారినట్టు తెలుస్తోంది. ఆ నీటిని మోటార్లతో తోడుతూ పనులు సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడి వరకు ఇబ్బందులు ఉన్నా… మిగతా పనుల విషయంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పాత బ్రిడ్జి ప్రమాదకరంగా మారిన నేపథ్యంలో నూతన బ్రిడ్జి నిర్మాణం ఎంత త్వరగా పూర్తి చేస్తే అంత మంచిదని స్థానికులు చెబుతున్నారు.