ప్యాకేజ్ ఇవ్వనందుకే ఓడిపోయాం: రేవంత్ రెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో : గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి మీడియానే కారణమంటూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీభవన్లో శుక్రవారం మీడియాతో మాట్లాడిన రేవంత్ మీడియా రంగాన్ని టార్గెట్ చేశారు. గ్రేటర్‌లో కాంగ్రెస్ ఓటమికి మీడియానే కారణమని, ఎన్నికల్లో మీడియా బాధ్యతాయుతమైన పాత్ర పోషించలేదని ధ్వజమెత్తారు. ఈ ఎన్నికల్లో మీడియా ఏకపక్షంగా వ్యవహరించిందని, కాంగ్రెస్ ఓటమికి ఓటర్లు కారణం కాదని మీడియానే కారణం అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్, బీజేపీలు […]
దిశ, తెలంగాణ బ్యూరో : గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి మీడియానే కారణమంటూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీభవన్లో శుక్రవారం మీడియాతో మాట్లాడిన రేవంత్ మీడియా రంగాన్ని టార్గెట్ చేశారు. గ్రేటర్‌లో కాంగ్రెస్ ఓటమికి మీడియానే కారణమని, ఎన్నికల్లో మీడియా బాధ్యతాయుతమైన పాత్ర పోషించలేదని ధ్వజమెత్తారు.
ఈ ఎన్నికల్లో మీడియా ఏకపక్షంగా వ్యవహరించిందని, కాంగ్రెస్ ఓటమికి ఓటర్లు కారణం కాదని మీడియానే కారణం అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్, బీజేపీలు మీడియాను ప్యాకేజీలతో మ్యానేజ్ చేశాయని, తెలంగాణలో ప్రతి రాజకీయ పార్టీ ఒక చానెల్ పెట్టాల్సిన అవసరం ఏర్పడిందని, దీంతో ప్రజాస్వామ్యం మీద నమ్మకం పోతుందని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. 2016లో 10.4 శాతం ఓట్లు వచ్చినా ఎక్కడా చూపించలేదని, మొత్తం బీజేపీ భజన చేశారన్నారు. అయినప్పటికీ గతంలో కంటే మెరుగైన ఫలితాలు సాధించామని, కాంగ్రెస్ ఓటుబ్యాంకు 4 శాతం పెరిగిందన్నారు.
కాంగ్రెస్ను చంపేందుకు మీడియా సుపారీ తీసుకుందని, కానీ చంపుతోంది కాంగ్రెస్ను కాదని ప్రజాస్వామ్యాన్ని అంటూ రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు తీసుకుని హత్య చేసే విధంగా మీడియా తయారైందని మండిపడ్డారు. అందుకే మీడియా ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఆకురౌడీ వంటి టీఆర్ఎస్ పోయి ఇప్పుడు పెద్ద రౌడీలాంటి బీజేపీ దిగారని రేవంత్‌రెడ్డి విమర్శించారు. మెయిన్ స్ట్రీమ్ మీడియా విపరీతపోకడలతో ప్రజాస్వామ్యం ఘోరంగా దెబ్బతిందన్నారు.
కనీసం ఇప్పటికైనా విశ్లేషణ చేసుకుని ప్రతిపక్ష పార్టీకి తగిన గౌరవం, ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఇక గ్రేటర్ ఎన్నికల్లో ప్రధాని నుంచి ముఖ్యమంత్రి వరకు ప్రచారం చేశారని, కేంద్రం నుంచి బీజేపీ అగ్రనేతలు దేశం నలుమూలల నుంచి వచ్చి ప్రచారం చేశారన్నారు. టీఆర్ఎస్ తరుఫున మంత్రులు గల్లీల్లో కూడా తిరగారన్నారు. మత విద్వేషాలు, రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారన్నారు. ఇంత కష్టకాలంలో కాంగ్రెస్ జెండా మోసిన కార్యకర్తలకు రుణపడి ఉంటామని రేవంత్‌రెడ్డి తెలిపారు.