కేసీఆర్ సెటైర్లు నిజం చేస్తున్న కాంగ్రెస్ 'ఉత్తమ్'లు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఆరేళ్ళు దాటింది. కానీ కాంగ్రెస్ నేతలకు మాత్రం ఆ సోయి లేనట్లుంది. గాంధీ భవన్ లోని ఇందిరా భవన్‌లో ఇప్పటికీ ‘ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ’ అనే బోర్డే కనిపిస్తుంది. కానీ దాన్ని మార్చాలన్న స్పృహ కూడా ఉండదు. ముగ్గురు ఇన్‌ఛార్జిలు మారారు. అయినా ఆ పార్టీ తీరు మాత్రం మారలేదు. తెలంగాణ ఇచ్చింది తమ పార్టీ అంటూ గంభీర ప్రకటనలు చేసే ఆ పార్టీ నేతలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నామన్న భావన కూడా […]
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఆరేళ్ళు దాటింది. కానీ కాంగ్రెస్ నేతలకు మాత్రం ఆ సోయి లేనట్లుంది. గాంధీ భవన్ లోని ఇందిరా భవన్‌లో ఇప్పటికీ ‘ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ’ అనే బోర్డే కనిపిస్తుంది. కానీ దాన్ని మార్చాలన్న స్పృహ కూడా ఉండదు. ముగ్గురు ఇన్‌ఛార్జిలు మారారు. అయినా ఆ పార్టీ తీరు మాత్రం మారలేదు. తెలంగాణ ఇచ్చింది తమ పార్టీ అంటూ గంభీర ప్రకటనలు చేసే ఆ పార్టీ నేతలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నామన్న భావన కూడా లేనట్లుంది. కొత్త ఫ్లెక్సీ బ్యానర్ తయారుచేయించుకునేంత ఆర్థిక స్థోమత లేదనుకోవాలా లేక గాంధీభవన్ నిర్వహణ పట్ల నేతలకు ఉన్న చిత్తశుద్ధి అంతే అని అనుకోవాలో అంతుచిక్కదు. వీరు మారరు.. పార్టీ పేరుకు తగ్గ బ్యానర్‌ను కూడా పెట్టుకోలేనివారు ఇప్పుడు జీహెచ్ఎంసీ పీఠాన్ని దక్కించుకుంటారట!
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు సిద్ధం కావాలంటూ నగర నేతలకు, ఇన్‌ఛార్జిలకు హితబోధ చేయడానికి పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్కం ఠాగూర్ బుధవారం (నవంబరు 4) సమావేశాన్ని నిర్వహించారు. తమిళనాడుకు చెందిన వ్యక్తి కాబట్టి ఆయనకు తెలుగు అక్షరాలు తెలియవని అనుకుందాం. కానీ టీపీసీసీ చీఫ్‌గా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డికి కూడా పట్టకపోవడం ఆయన కమిట్‌మెంట్‌కు నిదర్శనం. మాట్లాడుతున్న వేదిక వెనక ‘ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ’ అనే ఫ్లెక్సీ బోర్డు దర్శనమిస్తోంది. కనీసం దాన్ని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అని కొత్త ఫ్లెక్సీని తయారుచేయించి పెట్టాలన్న స్పృహ కూడా లేకుండాపోయింది నేతలకు.
ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నేత శైలజానాధ్ మీడియా సమావేశాన్ని నిర్వహించిన సందర్భంగా ఏర్పాటు చేసుకున్న బ్యానర్‌ను తీయడం మర్చిపోయిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇప్పుడు జీహెచ్ఎంసీ సమావేశాన్ని నిర్వహించుకున్నారు. ఆంధ్ర కాంగ్రెస్ నేతలు ప్రెస్ మీట్ పెట్టడానికి ముందు బ్యానర్ మీద తీసుకున్న తెలంగాణ పీసీసీ చీఫ్‌కు లేదు. పీసీసీ చీఫ్‌కే సమయస్ఫూర్తి లేనప్పుడు ఇక ఆఫీసు సిబ్బందిని నిందించి ప్రయోజనం లేదు.
తెలంగాణ కాంగ్రెస్ నేతల నిర్లక్ష్యం ఇలా తగలబడితే ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్‌లు వేయకుండా ఉంటారా మరి! ఏ అంశాన్ని టేకప్ చేయాలో కూడా కాంగ్రెస్ నేతలకు తెలియదంటూ చాలా సందర్భాల్లో కేసీఆర్ ఎద్దేవా చేశారు. పార్టీ కార్యాలయాన్నే చక్కదిద్దుకోలేని ‘ఉత్తమ్’లు ఇలా వ్యవహరిస్తే జోక్‌లు, సెటైర్లు రాకుండా ఉంటాయా? సీఎం జోక్‌లు పేల్చినప్పుడు ఘాటుగా స్పందించే ఉత్తమ్ లాంటి నేతలు ఇప్పుడు ఇలాంటి కనీస జాగ్రత్తలు తీసుకుంటే సామాన్యుల నుంచి సెటైర్లు వచ్చి ఉండేవి కావు.