కోమటిరెడ్డికి హై కమాండ్ పిలుపు… ఆంతర్యమేంటి?

దిశ ప్రతినిధి, నల్లగొండ : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ బాధ్యతలు ఎవరికి అప్పగించాలనే విషయంపై ఎడతెగని ఉత్కంఠ నెలకొంది. వాస్తవానికి టీపీసీసీ చీఫ్ నియామకం ఎప్పుడో పూర్తి కావాల్సి ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల అది వాయిదా పడుతూ వస్తోంది. నిజానికి నాగార్జునసాగర్ ఉప ఎన్నిక కంటే ముందే కొత్త టీపీసీసీ చీఫ్ నియామకం జరగాల్సి ఉంది. కానీ ఉప ఎన్నికపై కొత్త టీపీసీసీ చీఫ్ ప్రభావం చూపుతుందనే ఉద్దేశంతో అప్పటికప్పుడు కొత్త టీపీసీసీ […]

Update: 2021-06-21 01:44 GMT

దిశ ప్రతినిధి, నల్లగొండ : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ బాధ్యతలు ఎవరికి అప్పగించాలనే విషయంపై ఎడతెగని ఉత్కంఠ నెలకొంది. వాస్తవానికి టీపీసీసీ చీఫ్ నియామకం ఎప్పుడో పూర్తి కావాల్సి ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల అది వాయిదా పడుతూ వస్తోంది. నిజానికి నాగార్జునసాగర్ ఉప ఎన్నిక కంటే ముందే కొత్త టీపీసీసీ చీఫ్ నియామకం జరగాల్సి ఉంది. కానీ ఉప ఎన్నికపై కొత్త టీపీసీసీ చీఫ్ ప్రభావం చూపుతుందనే ఉద్దేశంతో అప్పటికప్పుడు కొత్త టీపీసీసీ చీఫ్ నియామకాన్ని వాయిదా వేశారు.

కానీ గత వారం రోజులుగా కొత్త టీపీసీసీ అధ్యక్ష నియామకానికి సంబంధించిన వ్యవహారం తెరపైకి వచ్చింది. అందులో భాగంగానే టీపీసీసీ అధ్యక్ష రేసులో ఉన్న రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, భట్టి విక్రమార్క తదితర నేతలంతా ఢిల్లీలో మకాం వేశారు. రోజులు గడుస్తున్నా.. నియామక ప్రక్రియ పూర్తి కావడం లేదు. దీంతో ఢిల్లీకి వెళ్లిన నేతలు తిరిగి ఇంటి బాట పట్టారు. అయితే తాజాగా ఢిల్లీ నుంచి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డికి పిలుపు వచ్చింది. దీంతో హుటాహుటిన కోమటిరెడ్డి ఢిల్లీ బయలుదేరారు.

బుజ్జగింపు కోసమేనా..

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఢిల్లీ నుంచి పిలుపు రావడంతో ఆయనకే టీపీసీసీ అధ్యక్ష పదవి ఖాయం అయ్యిందనే ప్రచారానికి తెరలేపారు. ఢిల్లీ పెద్దలు అసలు కోమటిరెడ్డికి టీపీసీసీ ఇచ్చేందుకు పిలిచారా.. లేక బుజ్జగించేందుకు పిలిచారా.? అనేది తేలాల్సి ఉంది. ఇదిలా వుంటే.. టీపీసీసీ రేసులో ఉన్న నేతలంతా ఎవరికి వారు కొత్త బాధ్యతలు తమకే ఇస్తారంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో వారి వారి అనుచరగణం పోస్టులతో రాజకీయ వేడిని హీటేక్కిస్తున్నారు. ఒకవేళ కోమటిరెడ్డికి టీపీసీసీ ఇవ్వకపోతే కోమటిరెడ్డి బ్రదర్స్ కాంగ్రెస్‌లో కొనసాగుతారా.. లేదా పార్టీని వీడుతారా.. అన్న ప్రచారం లేకపోలేదు.

ఏ క్షణంలోనైనా కొత్త చీఫ్ ప్రకటన..

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ బాధ్యతలను స్వీకరించే నేత ఎవరనేది ఏ క్షణంలోనైనా ప్రకటించే అవకాశం లేకపోలేదు. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, కీలక నేతల నుంచి అధిష్టానం అభిప్రాయాలను సేకరించి నివేదికను తీసుకుంది. దీంతో కొత్తగా టీపీసీసీ బాధ్యతలను ఎవరికి అప్పగించాలనే విషయం ఇప్పటికే డిసైడ్ అయినట్టు సమాచారం. కానీ ఎవరికి ఇస్తే లాభం..? ఏ మేరకు నష్టం ఉంటుందనే దానిపై అధిష్టానం సమాలోచనలు చేస్తోంది. అందులో భాగంగానే పార్టీ నేతలను ఢిల్లీకి పిలిచి బుజ్జగిస్తున్నట్టు సమాచారం.

 

 

Tags:    

Similar News