మొదటి డోసు ఎప్పుడేస్తరో..? ఫస్ట్ డోస్‌పై నెలకొన్న గందరగోళం..
దిశ, జగిత్యాల : కొవిడ్ వ్యాక్సినేషన్‌లో భాగంగా కొనసాగుతున్న టీకా కార్యక్రమంలో ఇప్పుడు రెండవ డోసుకే పరిమితం చేయడం వల్ల ప్రజలలో నిరసన వ్యక్తం అవుతోంది. ఈ విషయంలో వైద్య ఆరోగ్య శాఖ కూడా ఎలాంటి ప్రకటన విడుదల చేయకపోవడంతో మొదటి డోసు తీసుకోలేని చాలా మంది ఆందోళన చెందుతున్నారు. వ్యాక్సిన్ నిలువల కొరత కారణంగా టీకా పంపిణీలో రెండవ డోసు మాత్రమే ఇస్తున్నారు. చాలా మందిలో ఉన్న అనారోగ్య సమస్యలు, అపోహలు, ఇతర కారణాల చేత […]
దిశ, జగిత్యాల : కొవిడ్ వ్యాక్సినేషన్‌లో భాగంగా కొనసాగుతున్న టీకా కార్యక్రమంలో ఇప్పుడు రెండవ డోసుకే పరిమితం చేయడం వల్ల ప్రజలలో నిరసన వ్యక్తం అవుతోంది. ఈ విషయంలో వైద్య ఆరోగ్య శాఖ కూడా ఎలాంటి ప్రకటన విడుదల చేయకపోవడంతో మొదటి డోసు తీసుకోలేని చాలా మంది ఆందోళన చెందుతున్నారు. వ్యాక్సిన్ నిలువల కొరత కారణంగా టీకా పంపిణీలో రెండవ డోసు మాత్రమే ఇస్తున్నారు. చాలా మందిలో ఉన్న అనారోగ్య సమస్యలు, అపోహలు, ఇతర కారణాల చేత చాలా వరకు కొవిడ్ వ్యాక్సిన్ వేసుకోలేదు. కానీ ఇప్పుడు కొవిడ్ కేసులు పెరగడం, మరోపక్క థర్డ్ వేవ్ గుబులుతో మొదటి డోసు వేసుకునేందుకు చాలా మంది ముందుకు వస్తున్నారు.
మొదటి డోసు గురించి ఊసే లేకపోవడంతో టీకా వేసుకునేందుకు తమకు తెలిసిన వారిని వాకబు చేస్తూ మొదటి డోసు ఎప్పుడు ప్రారంభిస్తారని ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ విషయంలో వైద్య ఆరోగ్య శాఖ కూడా స్పందించడంతో ఇప్పట్లో మొదటి డోసు వాక్సిన్ పంపిణీకి చాలా సమయమే పట్టేలా ఉందని భావిస్తున్నారు. ఒక పక్క థర్డ్ వేవ్ ప్రచారం జోరందుకున్న నేపథ్యంలో ప్రజలంతా భయభ్రాంతులకు గురి అవుతున్నారు. కనీసం మొదటి డోస్ అన్న తమను కాపాడుతుందని ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. అయితే ఉత్పత్తి తగ్గి కొరత ఏర్పడిన కారణంగా ఇంకా కూడా రెండవ డోసునే కొనసాగించడం వల్ల థర్డ్ వేవ్ విజృంభన ప్రచారం పై చాలామంది ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు కొన్ని సెంటర్లలోనైన మొదటి డోస్ టీకా పంపిణీ కార్యక్రమాన్ని వెంటనే ప్రారంభించాలని ప్రజలు కోరుతున్నారు.
కరోనా విజృంభణ…
కేసులు తగ్గుతున్నాయని భావిస్తున్నప్పటికీ, అక్కడక్కడా పెరుగుతున్న కొవిడ్ కేసులు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలో వెనుగుమట్ల గ్రామంలో కేసులు పెరగడంతో మంగళవారం నుండి 15 రోజుల పాటు సెల్ఫ్ లాక్ డౌన్ ప్రకటించుకున్నారు. ఇక్కడ 24 గంటల్లో 35 పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. ఇటీవలే వెల్గటూర్ మండలంలోని ఎండపల్లి, మద్దుట్లపల్లెలలో కూడా జూలై 15 నుండి ఆగస్టు 1 వరకు 15 రోజులు సెల్ఫ్ లాక్ డౌన్ విధించుకున్నారు. అలాగే పలు పల్లెల్లో సెల్ఫ్ లాక్ డౌన్ విధిస్తున్నారు. ప్రజలు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా కొవిడ్ నిబంధనలు పాటించకపోవడం వల్లే తరచూ కేసులు పెరగడానికి కారణమని, ఇలానే కొనసాగితే మరిన్ని కేసులు పెరిగే అవకాశం ఉందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
కరోనా పరీక్షా కేంద్రాన్ని మార్చాలని కలెక్టర్ కు వినతి.
జగిత్యాల పట్టణంలోని 11వ వార్డ్ పరిధిలోని గాంధీనగర్‌లో గల ప్రభుత్వ పాఠశాలలో ఇటీవల ఏర్పాటు చేసిన కరోనా పరీక్షా కేంద్రాన్ని మార్చాలని ఆ వార్డు ప్రజలు జిల్లా కలెక్టర్ రవి కి మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. జనావాస ప్రాంతాల్లో కరోనా పరీక్షా కేంద్రం ఏర్పాటు చేయడం వల్ల భయం భయంగా గడుపుతున్నామని, పాఠశాల చుట్టూ 20 కుటుంబాలు చిన్న పిల్లలతో కలిసి నివసిస్తున్నాయని, కరోనా నిర్ధారణ కోసం వచ్చే వారితో ఆ ప్రాంతంలో కరోనా సోకే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాన్ని ఇక్కడి నుండి మార్చాలని వినతి పత్రంలో కోరారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు పెద్ధి నర్సయ్య, తాళ్లూరి నర్సయ్య, గడ్డల శ్రీకాంత్, తిరునగరి వెంకట దాస్, పెద్ది దీపు, గడ్డల శ్రీనివాస్ పాల్గొన్నారు.