టీఎంయూలో ‘పెత్తనం’ రగడ
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ మజ్దూరు యూనియన్ (టీఎంయూ) వివాదాల్లోకి వచ్చింది. సమ్మె టైంలో జేఏసీ నేతగా వ్యవహరించిన టీఎంయూ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి ప్రభుత్వాగ్రహానికి గురైన విషయం తెలిసిందే. అప్పటినుంచి ఆయనపై ఆర్టీసీ యాజమాన్యంతో ఒత్తిళ్లు తెస్తూనే ఉన్నారు. ఉద్యోగం నుంచి తీసేస్తున్నట్లు నోటీసులు కూడా ఇచ్చారు. ఈ సమయంలో యూనియన్ వివాదం మళ్లీ బయటకు వచ్చింది. టీఎంయూ వ్యవస్థాపక అధ్యక్షుడిని తానేనంటూ చెప్పుకొచ్చిన థామస్‌రెడ్డి.. అశ్వత్థామరెడ్డిని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. కానీ అసలైన టీఎంయూ […]
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ మజ్దూరు యూనియన్ (టీఎంయూ) వివాదాల్లోకి వచ్చింది. సమ్మె టైంలో జేఏసీ నేతగా వ్యవహరించిన టీఎంయూ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి ప్రభుత్వాగ్రహానికి గురైన విషయం తెలిసిందే. అప్పటినుంచి ఆయనపై ఆర్టీసీ యాజమాన్యంతో ఒత్తిళ్లు తెస్తూనే ఉన్నారు. ఉద్యోగం నుంచి తీసేస్తున్నట్లు నోటీసులు కూడా ఇచ్చారు. ఈ సమయంలో యూనియన్ వివాదం మళ్లీ బయటకు వచ్చింది. టీఎంయూ వ్యవస్థాపక అధ్యక్షుడిని తానేనంటూ చెప్పుకొచ్చిన థామస్‌రెడ్డి.. అశ్వత్థామరెడ్డిని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. కానీ అసలైన టీఎంయూ మాదేనని, కార్మికుల సంక్షేమం కోసం పోరాటం చేస్తున్నామని, థామస్‌రెడ్డిని ఎప్పుడో బహిష్కరించామని, సమ్మె తర్వాత రాజీనామా చేశాడని అశ్వత్థామరెడ్డి ప్రకటించారు.
గౌరవాధ్యక్ష స్థానంలో ఎవరూ లేరు
ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలోనే యూనియన్లన్నీ రద్దు చేసినట్లు సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో కొన్నిరోజుల పాటు ఆర్టీసీలో యూనియన్ల అంశమే లేదు. టీఎంయూలో కీలకంగా ఉన్న అశ్వత్థామరెడ్డి, థామస్‌రెడ్డి బహిరంగ విమర్శలకు దిగారు. టీఎంయూ తమదంటే తమదేననంటూ రచ్చకెక్కారు. థామస్‌రెడ్డి ఏనాడో రాజీనామా చేశాడని, సభ్యుడిగా యూనియన్ వ్యతిరేక కార్యాకలపాలకు పాల్పడుతుంటూ బహిష్కరించామని అశ్వత్థామరెడ్డి చెప్పుతుంటే… అసలు అశ్వత్థామరెడ్డినే తొలగించామని థామస్‌రెడ్డి ఆరోపణలకు దిగారు. దీంతో గతనెల 31న టీఎంయూ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని అశ్వత్థామరెడ్డి నిర్వహించారు. కానీ అంతకు ముందు కూడా థామస్‌రెడ్డి సమావేశం ఏర్పాటు చేశారు. ఇలా ఒకే యూనియన్‌లో రెండు వర్గాలు విభేదాలకెక్కాయి.
ఇదే సమయంలో టీఎంయూ గౌరవాధ్యక్షురాలిగా ఎమ్మెల్సీ కవితను ఎన్నుకునేందుకు థామస్‌రెడ్డి వర్గం నిర్ణయం తీసుకుంది. ఈ యూనియన్‌కు గతంలో గౌరవాధ్యక్షుడిగా మంత్రి హరీష్‌రావు ఉన్నారు. కానీ యూనియన్ల రద్దు తర్వాత మళ్లీ జీవం పోసుకోలేదు. కానీ ఇప్పుడు ఎమ్మెల్సీ కవితను ఎన్నుకుంటామని లీక్ చేశారు. కానీ అశ్వత్థామరెడ్డి వర్గం మాత్రం దీన్ని కొట్టిపారేస్తోంది. యూనియన్‌కు గౌరవాధ్యక్ష స్థానం ఎవరికీ లేదని చెప్పుతున్నారు. అంతేకాకుండా ఈ నెల 7న కేంద్ర సంఘం ఎన్నికలను నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. టీఎంయూలో అసలైన వర్గం తమదేనని, ఈనెల 7న ఎన్నికలు నిర్వహిస్తున్నామని ప్రచారం కూడా చేస్తున్నారు.
ప్రస్తుతం ఆర్టీసీలో వేతనాల వ్యవహారం చర్చగా మారింది. వేతనాలు పెంచేందుకు అవకాశాలు పరిశీలించాలని సీఎం కేసీఆర్ చెప్తే…అధికారులు మాత్రం సాధ్యం కాదని నివేదించారు. ప్రస్తుతం ఆర్టీసీ అష్టకష్టాల్లో కూరుకుపోతోంది. ఒక్కోనెల వేతనాల కోసమే ఎదురుచూడాల్సిన పరిస్థితి. ఇప్పుడు అత్యవసరంగా 1300 బస్సులు కొనాల్సి ఉంది. కానీ ఆర్టీసీ యాజమాన్యం చేతిలో చిల్లిగవ్వ లేదు. సీసీఎస్ నిధులనే జమ చేసేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఈ సమయంలో వేతనాలు పెంపు సాహాసోపేతమేనంటున్నారు. కానీ దీనిపై టీఎంయూ అశ్వత్థామరెడ్డి వర్గం మాత్రం అనుకూలంగా మల్చుకోవాలని భావిస్తోంది. ఈనెల 7న కేంద్ర కమిటీ ఎన్నికల తర్వాత ఆర్టీసీ యాజమాన్యంపై ఒత్తిడి తీసుకురావాలని చూస్తోంది.