పీఆర్సీ రిపోర్టు లీక్.. బలి పశువు ఎవరు?

దిశ, తెలంగాణ బ్యూరో: ఐదు నెలల నుంచి రగులుతున్న వివాదానికి పీఆర్సీ రూపంలో సమయం దొరుకుతోంది. ప్రభుత్వ ఉన్నతాధికారుల మధ్య విభేదాలు మళ్లీ బయట పడుతున్నాయి. సీఎం కేసీఆర్ దగ్గర మంచి మార్కులు కొట్టేసేందుకు ప్రభుత్వంలోని ఓ ఉన్నతాధికారి కొద్ది రోజులుగా చేస్తున్న ప్రయత్నాలకు ఇప్పుడు ఓ సందర్భం చిక్కింది. అది పీఆర్సీ నివేదిక రూపంలో చేతుల్లోకి వస్తోంది. అసలు వేతన సవరణ నివేదిక అంశంలో ఎవరిని బలి చేయాలనే అంశంపై ఉన్నతాధికారులు కన్నేశారు. దీంతో త్రిసభ్య […]

Update: 2021-01-29 11:14 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఐదు నెలల నుంచి రగులుతున్న వివాదానికి పీఆర్సీ రూపంలో సమయం దొరుకుతోంది. ప్రభుత్వ ఉన్నతాధికారుల మధ్య విభేదాలు మళ్లీ బయట పడుతున్నాయి. సీఎం కేసీఆర్ దగ్గర మంచి మార్కులు కొట్టేసేందుకు ప్రభుత్వంలోని ఓ ఉన్నతాధికారి కొద్ది రోజులుగా చేస్తున్న ప్రయత్నాలకు ఇప్పుడు ఓ సందర్భం చిక్కింది. అది పీఆర్సీ నివేదిక రూపంలో చేతుల్లోకి వస్తోంది. అసలు వేతన సవరణ నివేదిక అంశంలో ఎవరిని బలి చేయాలనే అంశంపై ఉన్నతాధికారులు కన్నేశారు. దీంతో త్రిసభ్య కమిటీలోని అధికారుల మధ్య జరుగుతున్న అధికార యుద్ధానికి ఎవరు బలి అవుతారనేది ఇప్పుడు సచివాలయంలో హాట్​టాపిక్‌గా మారింది.

లీకు లింకులెలా..?

వేతన సవరణ నివేదిక ఈ నెల 26నాడే బయటకు వచ్చినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. అంటే ఈ నెల 27న ఉదయం నుంచే సోషల్ మీడియాలో నివేదిక పీడీఎఫ్ కాపీలు మొత్తం చక్కర్లు కొట్టాయి. వాస్తవంగా ఉద్యోగ సంఘాలతో సమావేశమైన తర్వాతే నివేదికను ఇవ్వాలని సీఎం కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలిచ్చారు. అంతకు ముందే డిసెంబర్ 31న సీల్డ్ కవర్‌లో నివేదికను బిస్వాల్ కమిషన్ సీఎస్‌కు అందించిన విషయం తెలిసిందే. దీని అధ్యయనానికి సీఎస్ నేతృత్వంలో త్రిసభ్య కమిటీని నియమించారు. ఆర్థిక, జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శులు రామకృష్ణారావు, రజత్ కుమార్‌లతో కూడిన కమిటీ సమావేశమై, పీఆర్సీ రిపోర్టును అధ్యయనం చేసి, ఉద్యోగ సంఘాలతో చర్చించి, రాష్ట్రంలో ఎకానమీ పరిస్థితులను వివరించిన తర్వాత నివేదిక పత్రాలను స్వయంగా ఇవ్వాలని సీఎం సూచించారు.

కేవలం రెండు వారాల్లోనే ఇవ్వాలని సూచించినా.. పలు కారణాలు చూపిస్తూ ఈ నెలాఖరు వరకు లాక్కొచ్చారు. అయినా ఒక్కసారి కూడా త్రిసభ్య కమిటీ సమావేశం కాలేదు. ఈ పరిస్థితుల్లో ఈ నెల 26న సాయంత్రమే నివేదిక పీడీఎఫ్ రూపంలో బయటకు వచ్చింది. ఎలా వచ్చిందనేది ప్రశ్నార్థకమే. కానీ మరుసటి రోజు ఉదయం నుంచే సోషల్​ మీడియాలో తేలింది. అంటే త్రిసభ్య కమిటీ అధికారికంగా బయటకు ఇవ్వకున్నా.. పీఆర్సీ రిపోర్టు విడుదలైంది. త్రిసభ్య కమిటీలో నుంచే నివేదికను బయటకు ఇచ్చారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.

మరోవైపు రహస్యంగా దాచిన నివేదిక ఎలా బయటకు వచ్చిందనే అంశంపై సీఎం కేసీఆర్ సైతం అగ్గిమండారు. అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. ఎలా బయటకు వచ్చిందంటూ ప్రశ్నించారు. దీనికి ముందుగా సీఎస్ నుంచే సమాధానం ఇవ్వాల్సి ఉన్నా.. దాట వేసినట్లు చెబుతున్నారు. వాస్తవానికి ముందుగా ఉద్యోగ సంఘాలతో చర్చించిన తర్వాత పీఆర్సీ నివేదికను బయటకు ఇస్తే ఫిట్‌మెంట్ అంశంలో ఇంత రాద్ధాంతం ఉండేది కాదని ప్రభుత్వం భావించింది. కానీ అనధికారికంగానే నివేదిక బయట పడింది. త్రిసభ్య కమిటీ ఆధీనంలో.. సీల్డ్​ కవర్‌లో దాచిన నివేదిక ఎలా లీకయిందనే విషయాన్ని తేల్చేందుకు ఉన్నతస్థాయి వర్గాలే రంగంలోకి దిగాయి.

ఎవరిని బలి చేద్దాం…?

ఇక ప్రభుత్వంలోని సీనియర్ ఉన్నతాధికారుల మధ్య కొద్దికాలంగా వివాదాలు నెలకొన్నాయి. కొంతమంది అధికారుల మధ్య పొసగడం లేదు. ఓ ఉన్నతాధికారిపై ఏకంగా తిరుగుబాటు చేస్తున్నట్లు జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఒక వర్గం.. ఓ అధికారికి కోటరీగా ఉండి కాపాడుకుంటోందనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇదెలా ఉన్నా.. పీఆర్సీ కోసం సీఎం కేసీఆర్ అనధికారికంగా నియమించిన త్రిసభ్య కమిటీలో లుకలుకలున్నట్లు ఉద్యోగ వర్గాల్లో కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ త్రిసభ్య కమిటీకి ముందే.. కీలకశాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ సీనియర్ అధికారిపై ఓ ఉన్నతాధికారి గుర్రుగా ఉన్నారని సమాచారం.

దాదాపు ఇటీవల కాలంలో ఐదు నెలల నుంచి ఇద్దరి మధ్య విభేదాలు నడుస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. కానీ రెండు వర్గాలు సీఎం కేసీఆర్‌కు సన్నిహితంగా ఉంటుండంతో.. సమయం కోసం ఎదురు చూస్తున్నారని ఐఏఎస్​వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. ఈ సమయంలో పీఆర్సీ నివేదిక లీక్​అయిన ఉదంతాన్ని సదరు ఉన్నతాధికారి.. కొద్దిరోజులుగా అంతర్గత విభేదాలతో ఉన్న సీనియర్ అధికారిపై వేసేందుకు పక్కా ప్లాన్​వేసినట్లు తెలుస్తోంది. సదరు శాఖ నుంచే ఈ నివేదిక లీక్ అయిందని, ఉద్దేశపూర్వకంగానే బయటకు ఇచ్చినట్లు ఓ ఉన్నతాధికారి.. కొంతమంది ప్రభుత్వవర్గాలకు ఉప్పందించారని చెబుతున్నారు. అయితే సదరు అధికారి కూడా సీఎంకు దగ్గరగా ఉంటుండంతో.. ప్రభుత్వవర్గాలు కూడా బయటకు చెప్పకుండా రహస్య ప్రచారానికి దిగినట్లు తెలుస్తోంది.

చాటుగా ప్రచారం

దీనిపై త్రిసభ్య కమిటీలోని ఓ ఉన్నతాధికారి పలువురు అధికారులతో పాటుగా ఒకరిద్దరు మంత్రులకు కూడా ఇదే విషయాన్ని గుసగుసగా చేరవేసినట్లు సమాచారం. ఒక శాఖ నుంచే ఈ నివేదికను బయటకు ఇచ్చారని, అది కచ్చితంగా అధికారి వైఫల్యమేనని, లేకుంటే అధికారి పాత్ర కూడా ఉండి ఉంటుందనే అనుమానాలను చెప్పి చెప్పకుండానే వివరించినట్లు తెలుస్తోంది. పక్కా ప్లాన్‌గా దీన్ని కొట్టిపారేస్తున్నట్లు చెబుతూనే సీఎంకు, ప్రభుత్వ పెద్దలకు చెప్పే విధంగా సదరు అధికారిని ప్రధాన కారణంగా చూపిస్తూ చాటు ప్రచారానికి దిగినట్లు ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు పీఆర్సీ నివేదిక బయటకు రావడంపై అధికారులు కేసు కూడా ఫైల్ చేసేందుకు సిద్ధమయ్యారు. సీఎం కేసీఆర్ దీనిపై చాలా సీరియస్‌గా ఉండటంతో… ప్రభుత్వ కార్యాలయం నుంచి ఫైల్​బయటకు లీక్ అయిన కోణంలో కేసు పెట్టాలని భావించారు. కానీ సచివాలయం నుంచే ఈ నివేదిక లీక్​అయిందని, దీనిపై రహస్య విచారణ చేయాలని నిఘా వర్గాలకు చెప్పినట్లు సమాచారం.

ఇరికిస్తారా..?

ఇక ఈ లీకు వ్యవహారంలో ఓ ఉన్నతాధికారి బిగుస్తున్న ఉచ్చు ఎవరి మెడకు పడుతుందనేది ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. కొద్ది నెలలుగా కొంతమంది సీనియర్లతో అంతర్గత విభేదాలు సాగుతున్న నేపథ్యంలో కావాలనే కొందరిని ఇరుకున పెట్టే ప్లాన్ వేస్తున్నారని ఉద్యోగ సంఘాలు బహిరంగంగానే చెబుతున్నాయి. కచ్చితంగా ఓ సీనియర్ అధికారిని ఇరికించేందుకు చూస్తున్నారని, ఒకవేళ అక్కడ వ్యూహం బెడిసి కొడితే సచివాలయంలోని ఓ ప్రధాన శాఖలోని కిందిస్థాయిని ఇరికించాలని, దీంతో సదరు అధికారి కూడా చిక్కుకుంటారనే ప్లాన్‌తో ఉన్నట్లు ఉద్యోగులు చర్చించుకుంటున్నారు.

పీఆర్సీ అంశంలో ఉద్యోగ వర్గాల నుంచి ధిక్కార స్వరాలను వినిపిస్తుండగా.. ఇప్పుడు ఉన్నతాధికారుల మధ్య కూడా విభేదాలకు దారి తీస్తోంది. అధికారికంగా ఇవ్వకుండానే బయటకు లీక్ చేశారనే కారణాన్ని చూపిస్తూ సీనియర్ అధికారులను ఇరికించే ప్రయత్నాలు చేస్తున్నారంటున్నారు. ఇది ఇప్పుడు త్రిసభ్య కమిటీలోని అధికారుల పనితీరుపై అనుమానాలు కల్గించేలా మొదలైంది. దీనిపై ఎవరిని బలి చేస్తారనేది వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News