టీఆర్ఎస్ vs బీజేపీ.. రోడ్డెక్కిన రగడ

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: నిర్మల్‌లో భూ ఆక్రమణలపై బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య సవాల్, ప్రతి సవాల్‌కు దారి తీసింది. ఇప్పటి వరకు ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు ప్రెస్‌మీట్లలోనే చేసుకోగా.. తాజాగా రగడ కాస్తా రోడ్డెక్కింది. భూ ఆక్రమణలపై ఇరువర్గాల రచ్చ.. గురువారం శీవాజీ చౌక్‌కు చేరింది. గులాబీశ్రేణులు ముందుగానే అక్కడికి చేరుకోగా.. బీజేపీ నాయకులకు పోలీసులు అడ్డుపడ్డారు. ఇరుపార్టీల నాయకులను వేర్వేరు పోలీస్‌ స్టేషన్లకు తరలించారు. దీంతో భూఆక్రమణల రగడ జిల్లాలో చర్చనీయాంశంగా […]

Update: 2021-07-01 11:00 GMT

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: నిర్మల్‌లో భూ ఆక్రమణలపై బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య సవాల్, ప్రతి సవాల్‌కు దారి తీసింది. ఇప్పటి వరకు ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు ప్రెస్‌మీట్లలోనే చేసుకోగా.. తాజాగా రగడ కాస్తా రోడ్డెక్కింది. భూ ఆక్రమణలపై ఇరువర్గాల రచ్చ.. గురువారం శీవాజీ చౌక్‌కు చేరింది. గులాబీశ్రేణులు ముందుగానే అక్కడికి చేరుకోగా.. బీజేపీ నాయకులకు పోలీసులు అడ్డుపడ్డారు. ఇరుపార్టీల నాయకులను వేర్వేరు పోలీస్‌ స్టేషన్లకు తరలించారు. దీంతో భూఆక్రమణల రగడ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

ఇటీవల ఆర్టీసీ మాజీ చైర్మన్‌ గోనె ప్రకాశ్‌రావు నిర్మల్లో ప్రెస్‌మీట్‌ పెట్టి.. మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఆయన బంధువులు భూ ఆక్రమణలు చేశారని విమర్శించారు. తమ లబ్ధి కోసమే నిషేధిత భూముల్లో సమీకృత కలెక్టరేట్‌ కట్టిస్తున్నారన్నారు. నిర్మల్లోని గొలుసుకట్టు చెరువుల కబ్జాపై బెంగళూర్‌లోని గ్రీన్‌ ట్రిబ్యునల్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. దీంతో స్పందించిన మంత్రి అల్లోల తనపై అవాస్తవ ఆరోపణలు చేయొద్దని, తన 35ఏళ్ల రాజకీయంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నామని, తన జీవితం గురించి ప్రజలకు తెలుసునన్నారు. మరుసటి రోజు సోషల్‌ మీడియాలో మంత్రి పేరుతో ఉన్న అకౌంట్‌లో తనపై ఆరోపణల్లో నిజం లేదని, ఆధారాలుంటే నిరూపించండి.. అంటూ ఆయన సవాల్‌ చేసినట్లు పోస్టు పెట్టారు. ఈ సవాల్ స్వీకరిస్తున్నట్లు బీజేపీ సీనియర్ నాయకులు రావుల రాంనాథ్, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ అప్పాల గణేశ్‌ పేర్కొన్నారు. మంత్రి వర్గీయుల భూఆక్రమణలను శివాజీ చౌక్‌లో సర్వే నంబర్లతో సహా నిరూపిస్తామని, లేనిపక్షంలో రాజకీయాల నుంచి తప్పుకుంటానని గణేశ్‌ సవాల్‌ చేశారు. దీంతో మున్సిపల్‌ చైర్మన్‌ గండ్రత్‌ ఈశ్వర్, పార్టీ పట్టణాధ్యక్షుడు మారుగొండ రాము ప్రెస్మీట్‌ పెట్టారు. మంత్రిపై బీజేపీ నాయకులు చేసిన ఆరోపణలను ఖండిస్తున్నామన్నారు. ఆధారాలు ఉంటే గురువారం స్థానిక శివాజీ చౌక్‌కు రావాలని, ఎవరు ఆక్రమణలకు పాల్పడ్డారో అక్కడే తేల్చుకుందామని ప్రతి సవాల్‌ విసిరారు.

గురువారం జిల్లా కేంద్రంలో హైడ్రామా నడిచింది. బీజేపీ నాయకులు తమ పార్టీ ఆఫీస్‌లో ముందుగా ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. తమ సవాల్‌ను మంత్రి స్వీకరించలేదని, పార్టీ నాయకులతో మాట్లాడిస్తున్నారని విమర్శించారు. ఇదేక్రమంలో టీఆర్‌ఎస్‌ శ్రేణులు శివాజీచౌక్‌కు చేరుకున్నాయని తెలియడంతో బీజేపీ నాయకులు కూడా అక్కడికి వెళ్లేందుకు బయలుదేరారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారిని గాంధీ మార్కెట్‌ వద్ద అడ్డుకున్నారు. దీంతో వాళ్లు అక్కడే బైఠాయించి మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో కాసేపు పోలీసులతో వాగ్వాదం నెలకొంది. చివరకు పోలీసులు వారందరినీ బలవంతంగా బస్సులో ఎక్కించి పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. శివాజీచౌక్‌లో టీఆర్‌ఎస్‌ నాయకులు బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అసత్య ఆరోపణలు చేసినందునే వాళ్లు ఇక్కడి రాలేదని ఎద్దేవా చేశారు. అనంతరం వారిని కూడా పోలీసులు రూరల్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. జిల్లాకేంద్రంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి హయాంలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేకనే బీజేపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారని మున్సిపల్‌ చైర్మన్‌ గండ్రత్‌ ఈశ్వర్, టీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు మారుగొండ రాము అన్నారు. తాము మంత్రికి సవాలు విసిరితే, ఆయన తన పార్టీ నాయకులతో మాట్లాడిస్తూ, వ్యక్తిగత ఆరోపణలకు దిగుతూ అసలు అంశాన్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ నాయకులు రావుల రాంనాథ్, అప్పాల గణేశ్‌చక్రవర్తి ఆరోపించారు.

Tags:    

Similar News