ఎన్నికల కోడ్ ‘అడ్డు’ మంత్రమేనా..?

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫిట్​మెంట్ ప్రకటన ఇప్పుడు రాజకీయపరమైన చర్చకు దారి తీస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ సాకుతో పీఆర్సీ ప్రకటన వాయిదా వేసినట్టేనని స్పష్టమవుతోంది. అయితే ప్రభుత్వం తరుపున కొత్త ప్రచారానికి తెరలేపారు. ఈ నెల 12న (శుక్రవారం) ఫిట్​మెంట్​ను సీఎం కేసీఆర్ ప్రకటించేందుకు సిద్ధమయ్యారని, కానీ అంతలోనే ఎన్నికల కోడ్​ వచ్చిందంటూ అధికారవర్గాలు ప్రచారానికి దిగుతున్నాయి. కానీ ఉద్యోగవర్గాలు మాత్రం దీన్ని కొట్టిపారేస్తున్నాయి. ఉద్దేశపూర్వకంగానే ఫిట్​మెంట్​ను వాయిదా వేశారని చెబుతున్నారు. […]

Update: 2021-02-12 10:11 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫిట్​మెంట్ ప్రకటన ఇప్పుడు రాజకీయపరమైన చర్చకు దారి తీస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ సాకుతో పీఆర్సీ ప్రకటన వాయిదా వేసినట్టేనని స్పష్టమవుతోంది. అయితే ప్రభుత్వం తరుపున కొత్త ప్రచారానికి తెరలేపారు. ఈ నెల 12న (శుక్రవారం) ఫిట్​మెంట్​ను సీఎం కేసీఆర్ ప్రకటించేందుకు సిద్ధమయ్యారని, కానీ అంతలోనే ఎన్నికల కోడ్​ వచ్చిందంటూ అధికారవర్గాలు ప్రచారానికి దిగుతున్నాయి. కానీ ఉద్యోగవర్గాలు మాత్రం దీన్ని కొట్టిపారేస్తున్నాయి. ఉద్దేశపూర్వకంగానే ఫిట్​మెంట్​ను వాయిదా వేశారని చెబుతున్నారు. అయితే ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదని, ఫిట్​మెంట్ ప్రకటనకు కోడ్ అడ్డు మంత్రం కాదంటూ సూచిస్తున్నారు. దీనికి పలు సందర్భాలను ఉదహరిస్తున్నారు.

1999, 2013 సంఘటనలు గుర్తు లేదా..?

చంద్రబాబు హయాంలో జరిగిన ఇలాంటి సంఘటననే ఉద్యోగులు ఇప్పుడు తెరపైకి తీసుకువస్తున్నారు. 1999 ఆగస్టులో అసెంబ్లీ ఎన్నికల కోడ్ ఉన్నా.. పీఆర్సీని ప్రకటించారు. అప్పుడు కూడా 1998 నుంచి మొదలైన నివేదిక 1999లో పూర్తి చేశారు. అదే సమయంలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. కానీ ఉద్యోగ వర్గాల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వెల్లడైంది. ప్రభుత్వానికి నోటీసు జారీ చేశారు. ఉద్యోగ సంఘాల నుంచి వ్యతిరేకత పెరుగుతుండటంతో అప్పుడు సీఎం చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ప్రత్యేక అనుమతి తీసుకుని 25 శాతం ఫిట్​మెంట్ ప్రకటించారు. 2013లో కూడా ఎన్నికల నేపథ్యంలో కిరణ్​కుమార్​రెడ్డి డీఏ ప్రకటించారు. దీనికి కూడా కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి తీసుకున్నారు.

నిర్లక్ష్యమా.. పట్టు లేకనా..?

పీఆర్సీ అంశంలో ఇప్పుడు చాలా అంశాలపై విస్తృత చర్చ సాగుతోంది. ఉద్యోగ వర్గాలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని, ఉద్యోగులతో అవసరం లేదన్నట్టుగా వ్యవహరిస్తుందనే విమర్శలు వస్తున్నాయి. ఉద్యోగవర్గాలను వేరు చేసి నిర్వీర్యం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఉద్యోగ సంఘాలు కూడా ప్రభుత్వంపై పట్టు కోల్పోతున్నాయని, ప్రభుత్వాన్ని డిమాండ్​ చేసే పరిస్థితి లేదంటున్నారు. గతంలో ప్రభుత్వం ఇలా ఆలస్యం చేస్తే సమ్మె నోటీసులు ఇచ్చి, యుద్ధానికి దిగిన ఉద్యోగ సంఘాలు… ఇప్పుడు మాత్రం కారణాలేమైనా సన్నగిల్లాయని, ప్రభుత్వం ముందు కనీసం గొంతెత్తి మాట్లాడే పరిస్థితి కూడా లేదంటున్నారు.

ప్రత్యేక పర్మిషన్​తో ఇప్పించుకునేందుకు వ్యూహం..!

ఇదిలా ఉండగా ఉద్యోగ సంఘాల జేఏసీ వ్యూహం మార్చినట్లు తెలుస్తోంది. ఉద్యోగ వర్గాల నుంచి వ్యతిరేకత పెరుగుతుండటంతో ఫిట్​మెంట్​పై పలు నిర్ణయాలు తీసుకుంటున్నట్లు సమాచారం. దీనిలో భాగంగా సీఎ సోమేష్​ కుమార్​కు జేఏసీ చైర్మన్ మామిళ్ల రాజేందర్ శుక్రవారం ఫిట్​మెంట్పై చర్చించినట్లు చెబుతున్నారు. ఫిట్​మెంట్​ను ఈసీ ప్రత్యేక అనుమతితో ప్రకటించుకోవచ్చని, ఇది ఆన్​గోయింగ్​ పథకంగా భావించి ఫిట్​మెంట్​ ప్రకటించాలని, దీనికి లేఖ రాయాలని ఒత్తిడి తీసుకువస్తున్నట్లు జేఏసీ చైర్మన్, టీఎన్జీఓ అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ పేర్కొంటున్నారు. ఎన్నికలతో సంబంధం లేకుండా ఫిట్​మెంట్​ను తెచ్చుకుంటామని, కచ్చితంగా బిశ్వాల్​కమిషన్ సూచనలతో సంబంధం లేకుండా మెరుగైన ఫిట్​మెంట్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News