మరోకోణం: హుజూరాబాద్‌లో గెలుపు ఎవరిది?

దిశ, వెబ్‌డెస్క్: హుజూరాబాద్ నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. ఏప్రిల్ 30న అప్పటి మంత్రి ఈటల రాజేందర్‌పై భూకబ్జా ఆరోపణలు అధికార మీడియాలో రావడం, ఆ వెంటనే ఆయనను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడం, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఆయన ప్రకటించడంతోనే అక్కడ ఆట మొదలైంది. మొదట కొత్త పార్టీ పెట్టే ఆలోచన ఉందని ప్రకటించినా, చివరకు ఈటల బీజేపీలో చేరడంతో అనిశ్చితి తొలగింది. అక్కడ జరిగే ఉపఎన్నికలో ప్రధాన పోటీ టీఆర్ఎస్, బీజేపీల మధ్యనే ఉంటుందని […]

Update: 2021-07-17 20:44 GMT

దిశ, వెబ్‌డెస్క్: హుజూరాబాద్ నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. ఏప్రిల్ 30న అప్పటి మంత్రి ఈటల రాజేందర్‌పై భూకబ్జా ఆరోపణలు అధికార మీడియాలో రావడం, ఆ వెంటనే ఆయనను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడం, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఆయన ప్రకటించడంతోనే అక్కడ ఆట మొదలైంది. మొదట కొత్త పార్టీ పెట్టే ఆలోచన ఉందని ప్రకటించినా, చివరకు ఈటల బీజేపీలో చేరడంతో అనిశ్చితి తొలగింది. అక్కడ జరిగే ఉపఎన్నికలో ప్రధాన పోటీ టీఆర్ఎస్, బీజేపీల మధ్యనే ఉంటుందని తేలిపోయింది. ఆ ప్రకారం ఇరుపార్టీలూ ప్రచారం ప్రారంభించాయి. ఈటలకు అనుచరులుగా, మద్దతుదారులుగా ఉన్నవారిని తమ వైపు నయానో భయానో ఆకర్షించే వ్యూహాన్ని గులాబీ నేతలు అనుసరిస్తే, కమలనాథులతో కలిసి ఈటల తన కేంపెయిన్‌ను ప్రారంభించారు. ఇంతలోనే కాంగ్రెస్ అధిష్ఠానం టీపీసీసీ అధ్యక్షునిగా ఫైర్‌బ్రాండ్ లీడర్ రేవంత్‌రెడ్డి పేరును ప్రకటించింది. అంతే.. రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. కాంగ్రెస్ సీన్‌‌లో‌కి వచ్చింది. రేవంత్‌కున్న డైనమిజం, మాస్అప్పీల్ కారణంగా ముఖాముఖి పోటీ కాస్తా త్రిముఖపోటీగా మారిపోయింది.

ఈ ఉపఎన్నికపై అందరి కంటే ముందు అప్రమత్తమైంది సీఎం కేసీఆర్. ఈటలను మంత్రివర్గం నుంచి తొలగించిన రోజు నుంచే ఆయన హుజూరాబాద్‌పై దృష్టి పెట్టారు. ఈటలకు అక్కడున్న పట్టు, ప్రజాదరణ మిగతా ఎవరి కంటే కూడా ఆయనకే ఎక్కువ తెలుసు. అధికార పార్టీ నుంచి బయటకు గెంటివేత జరిగింది కనుక సహజంగానే ప్రజల సానుభూతి పవనాలు కూడా రాజేందర్ వైపే ఉంటాయని భావించారు. ఈటల కనుక గెలిస్తే ఆ ప్రభావం వచ్చే శాసనసభ ఎన్నికలపై కూడా ఉంటుందని అంచనా వేసారు. ఆరు నూరైనా టీఆర్ఎస్‌ అభ్యర్థిని గెలిపించేందుకు పకడ్బందీ వ్యూహాన్ని రచిస్తున్నారు. గెలుపు గుర్రం అన్వేషణలో రెండు డజన్ల సంఖ్యలో నేతల పేర్లను పరిశీలించి, వారిపై ఇంటెలిజెన్స్ వర్గాలతో సర్వేలు జరిపించారు. ట్రబుల్ షూటర్ హరీశ్‌రావును రంగంలోకి దించారు. సిద్దిపేట సమీపంలోని రంగనాయక్‌సాగర్ గెస్ట్ హౌజ్ కేంద్రంగా ‘ఆపరేషన్ హుజూరాబాద్’ కొనసాగుతున్నది. జిల్లా మంత్రి గంగుల కమలాకర్, వీరవిధేయుడు ఎమ్మెల్సీ లక్ష్మణ్‌రావు ఆధ్వర్యంలో పల్లెపల్లెనా ఈటల వ్యతిరేక ప్రచారం కొనసాగుతున్నది. ఇప్పటికే మండలానికో మంత్రిని లేదా ఎమ్మెల్యేను, గ్రామానికో నేతను అన్నట్టుగా ఇన్‌చార్జిలను నియమించారు. ప్రతి యాభై లేదా వంద మంది ఓటర్లకు ఒక పోల్ మేనేజ్‌మెంట్ పర్సన్‌ను కేటాయించాలని కూడా భావిస్తున్నట్లుగా సమాచారం. ఖర్చుకు ఏమాత్రం వెనుకాడవద్దని అధినేత నుంచి ఆదేశాలు వచ్చాయని ఓ టీఆర్ఎస్ నేత చెప్పారు. ఈ ఎన్నికలో డబ్బు ముందు నడుస్తుందని, తాము వెనుక నడుస్తామని ఆయన కామెంట్ చేసారంటే గెలువడం ఆ పార్టీకి ఎంత ముఖ్యమో అర్థం చేసుకోవచ్చు.

ఈటల కూడా ఏమాత్రం వెనుకబడలేదు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినప్పటి నుంచి ఆయన హుజూరాబాద్‌లోనే మకాం వేసారు. నియోజకవర్గంలోని పల్లెపల్లెనా ఉన్న తన మద్దతుదారులను కూడగడుతున్నారు. ప్రలోభాలకు ఆశపడి వాళ్లు టీఆర్ఎస్ వైపు వెళ్లకుండా జాగ్రత్త పడుతున్నారు. ఎన్నో కష్టనష్టాలకోర్చి కేసీఆర్ పక్కన నిలబడి ఉద్యమం చేసి తెలంగాణ సాధిస్తే, ఇప్పుడు తనకు అధినేత అన్యాయం చేసారంటూ ప్రజల సానుభూతిని పొందడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రగతిభవన్ కాస్తా ఇప్పుడు దొరలగడీగా మారిందని, కేసీఆర్ వెనకటి మనిషి కాదని, చాలా మారిపోయారని ఆరోపణలు గుప్పిస్తున్నారు. బీజేపీతో కలిసి కొన్ని ప్రెస్ మీట్లు, కార్యకర్తల సమావేశాలు నిర్వహించినప్పటికీ, ఆ పార్టీకి అంటీముట్టనట్టుగానే ఉంటున్నారు. జై శ్రీరాం.. జై బీజేపీ.. వంటి నినాదాల జోలికి వెళ్లకుండా ప్రచారం నిర్వహిస్తున్నారు. కమలదళం కూడా పరిస్థితిని అర్థం చేసుకుని వ్యవహరిస్తున్నది.

రేవంత్‌రెడ్డి ఫ్యాక్టర్ కాంగ్రెస్‌లో ఒక ఊపు తెచ్చినప్పటికీ, హుజూరాబాద్‌కు సంబంధించి ఆ పార్టీ పరిస్థితి ఎంతమాత్రం ఆశాజనకంగా లేదు. గత ఎన్నికల్లో 61వేలకు పైచిలుకు ఓట్లు సాధించి ఈటలకు (1,04,840 ఓట్లు వచ్చాయి) గట్టి పోటీ ఇచ్చిన పాడి కౌశిక్‌రెడ్డి వ్యవహారం ఆ పార్టీకి తలనొప్పిగా పరిణమించింది. ఈటలపై తీవ్ర వ్యక్తిగత ఆరోపణలు గుప్పిస్తూ వచ్చిన కౌశిక్, మొదటినుంచీ అనుమానాస్పదంగానే వ్యవహరించారు. అధికార పార్టీతో కుమ్మక్కు అయిన చందంగానే మాట్లాడారు. ఓ వైపు పీసీసీ ఈటలకు సానుభూతిని ప్రకటిస్తే, కౌశిక్ మాత్రం అధిష్ఠానాన్ని లెక్కచేయకుండా దాడి చేయడం పైననే కేంద్రీకరించారు. ఓ ప్రైవేటు ఫంక్షన్‌లో కేటీఆర్‌తో గుసగుసలాడడం కూడా ఆయన వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీ టిక్కెట్ ఆశిస్తున్నారనే వార్తలకు ఊతం ఇచ్చింది. టీఆర్ఎస్ అభ్యర్థిని తానేనని, ఎంత డబ్బు ఖర్చయినా సరే.. గ్రామస్థాయి నేతలను మనవైపు తిప్పుకోవాలంటూ ఆయన మాట్లాడిన రెండు ఆడియో క్లిప్పులు ఇటీవల వైరల్ అయ్యాయి. ఫలితంగా కౌశిక్ పరిస్థితి ఇప్పుడు రెంటికి చెడ్డ రేవడిలా మారింది. కాంగ్రెస్ పార్టీ ఈటలకు సమఉజ్జీగా నిలబడగలిగిన మరో అభ్యర్థి కోసం అన్వేషణలో పడింది. సొంతింటిని చక్కబెట్టుకోవడంలోనే తలమునకలైన రేవంత్, ఇంకా హుజూరాబాద్‌పై దృష్టి పెట్టనేలేదు.

మొత్తం నాలుగు మండలాలు, 2 లక్షల 29వేల పైచిలుకు ఓటర్లున్న హుజూరాబాద్ నియోజకవర్గం రూపురేఖలు 2009 పునర్విభజనలో పూర్తిగా మారిపోయాయి. పాత హుజూరాబాద్ సెగ్మెంట్ నుంచి ఒక్క హుజూరాబాద్ మండలమే ఉండిపోగా, కమలాపూర్ సెగ్మెంట్ నుంచి కమలాపూర్, వీణవంక, జమ్మికుంట(ఇల్లందకుంట కూడా) మండలాలు కొత్తగా వచ్చి చేరాయి. పాత, కొత్త నియోజకవర్గాల పల్లెల్లో ప్రధానంగా రెడ్డి సామాజికవర్గానిదే ఆధిపత్యమని చెప్పవచ్చు. 1962లో ఏర్పడిన నుంచీ ఇక్కడ రెడ్డి అభ్యర్థులే విజయం సాధించారు. ముద్దసాని దామోదర్‌రెడ్డి నాలుగుసార్లు, కే వీ నారాయణరెడ్డి, పరిపాటి జనార్దన్‌రెడ్డి రెండేసిసార్లు, మాదాడి రామచంద్రారెడ్డి ఒకసారి ఇక్కడ విజయం సాధించారు. రెడ్డీల ఆధిపత్యానికి బ్రేక్ వేస్తూ 2004లో తొలిసారిగా ఈటల టీఆర్ఎస్ నుంచి పోటీచేసి గెలిచి బీసీల ఢంకా మోగించారు. ఓటర్ల లెక్కలు చూస్తే, (2018 జాబితా ప్రకారం) ఈ నియోజకవర్గంలో బీసీలు 64శాతం, ఎస్సీలు 20శాతం, ఓసీలు 10శాతం ఎస్టీలు 2శాతం, ఇతరులు 4శాతం ఉన్నారు. కులాల వారీగా, మాల మాదిగలు 45వేలు, కాపులు 29వేలు, పద్మశాలీలు 28వేలు, గౌడ, ముదిరాజ్‌లు 26 వేల చొప్పున, గొల్లకుర్మలు 25వేలు, రెడ్డీలు 22వేలు, ముస్లింలు 12వేలు, ఎస్టీలు 6500 ఓటర్లున్నారు. 1962 నుంచి 1985 వరకూ రెండుసార్లు కాంగ్రెస్, రెండుసార్లు స్వతంత్రులు, ఒకసారి జనతా పార్టీ ఇక్కడ గెలిచింది. 1985లో మొదలైన తెలుగుదేశం హవా ఇరవైయేళ్లు కొనసాగగా, 2004 నుంచీ గులాబీ జెండా రెపరెపలాడుతున్నది. కాంగ్రెస్ రెండవస్థానంలో కొనసాగుతున్నది. మొదటినుంచీ బీజేపీ ఉనికి ఇక్కడ నామమాత్రంగానే ఉండింది. 2018 డిసెంబర్‌లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఆ పార్టీకి కేవలం 1683 ఓట్లు వచ్చి డిపాజిట్ గల్లంతయింది. అయితే, జాతీయస్థాయిలో మోడీ వేవ్ కొనసాగిన 2019 మే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీచేసిన బండి సంజయ్‌కు ఈ సెగ్మెంట్‌లో 35వేల ఓట్లు వచ్చాయి.

ఇక్కడి పల్లెల్లో నక్సలైటు ఉద్యమ ప్రభావం ఎక్కువ ఉంటుంది. గతంలో పీపుల్స్ వార్ మిలిటెంట్లుగా పనిచేసిన పలువురు ఇప్పుడు ఆయా గ్రామాల్లో స్థానిక ప్రజాప్రతినిధులుగానో, మాజీ ప్రజాప్రతినిధులుగానో కొనసాగుతున్నారు. అలాంటివారి అండతోనే 1985 నుంచి టీడీపీ, 2004 నుంచి టీఆర్ఎస్ ఎన్నికల్లో గెలుస్తూ వస్తున్నాయి. ఈ వర్గం అండ రాబోయే ఉపఎన్నికలో ఎవరికి ఉంటుందన్నది చాలా కీలకం. కేసీఆర్ బర్రె అయితే, ఈటల గొర్రె.. అని, ఇద్దరూ దోపిడిదారులేనంటూ ఆ మధ్య మావోయిస్టు పార్టీ పేరుతో వచ్చిన ప్రకటన ఈటల క్యాంపునకు పెద్దదెబ్బే. అది ఇంటెలిజెన్స్ విభాగం సృష్టి అని, మావోయిస్టులు ఎలాంటి ప్రకటనా విడుదల చేయలేదని ఈటల స్పష్టం చేసినప్పటికీ అది ప్రజల్లోకి ఎంత వెళ్లిందో చెప్పలేం. ఈ వర్గం అండదండలు చివరకు ఎవరికి లభిస్తాయో వేచిచూడాలి.

ప్రస్తుతానికైతే, ఈటలకే విజయావకాశాలు ఎక్కువ ఉన్నాయని నియోజకవర్గ ప్రజలను పలకరించిన ఎవరికైనా అర్థమవుతుంది. నిఘా వర్గాలు సహా పలువురు నిర్వహించిన సర్వేలు కూడా ఈ విషయాన్నే ధృవీకరిస్తున్నాయి. అయితే, టీఆర్ఎస్ ఎవరిని నిలబెడుతుంది? కాంగ్రెస్ అభ్యర్థిగా ఎవరుంటారు? సామాజిక సమీకరణాలు ఎలా వుంటాయి? డబ్బు ప్రభావం ఓటర్లపై ఎంత వుంటుంది? ఈటలపై సానుభూతి పవనాలు ఏ మేరకు పనిచేస్తాయి? కేసీఆర్ వ్యూహాలు ఫలిస్తాయా? లేదంటే ఇరువురి అమీతుమీలో కాంగ్రెస్ లాభపడుతుందా? ఈ ప్రశ్నలన్నింటికీ కాలమే సమాధానం చెప్పగలదు. ఒక్కటి మాత్రం నిజం.. ఇప్పుడు హుజూరాబాద్‌లో విజేతగా నిలబడే పార్టీదే రేపటి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పైచేయి అవుతుందనడంలో ఏమాత్రం సందేహం ఉండబోదు. – డి.మార్కండేయ

Tags:    

Similar News