27 లక్షల మొక్కలు నాటేందుకు సిద్ధం అవ్వండి
దిశ, వనపర్తి: హరితహారం మొక్కలు తొలగిస్తే.. వెయ్యి రూపాయల జరిమానా విధించాలని వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అధికారులను ఆదేశించారు. సోమవారం వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని నర్సింగయ్యపల్లి, గోపాల్‌పేట మండలం తాడిపత్రి గ్రామాల్లో ఏర్పాటు చేసిన నర్సరీలను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం ఈ సందర్భంగా మాట్లాడుతూ… జులై 1వ తేదీ నుంచి ప్రారంభం అయ్యే ఏడో విడత హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. నాటిన ప్రతీ మొక్కకు వెంటనే ట్రీ గార్డులు ఏర్పాటు […]
దిశ, వనపర్తి: హరితహారం మొక్కలు తొలగిస్తే.. వెయ్యి రూపాయల జరిమానా విధించాలని వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అధికారులను ఆదేశించారు. సోమవారం వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని నర్సింగయ్యపల్లి, గోపాల్‌పేట మండలం తాడిపత్రి గ్రామాల్లో ఏర్పాటు చేసిన నర్సరీలను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం ఈ సందర్భంగా మాట్లాడుతూ… జులై 1వ తేదీ నుంచి ప్రారంభం అయ్యే ఏడో విడత హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. నాటిన ప్రతీ మొక్కకు వెంటనే ట్రీ గార్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. మొక్కలు ఎవరైనా బలవంతంగా పీకేస్తే వారికి వెయ్యి రూపాయల జరిమానా విధించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఏడో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉండటంతో పాటు సర్వం సిద్ధం చేసుకోవాలని నర్సరీ నిర్వాహకులను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా 27 లక్షల మొక్కలు నాటేందుకు గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు సమిష్టిగా కృషి చేయాలన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో పారిశుధ్య పనులు, మొక్కలు నాటడం తదితర కార్యక్రమాల్లో ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, ఎంపీడీవో కరుణశ్రీ, ఉపాధి హామీ పథకం ఏపీఓ నరేందర్, మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు.