జగన్, విజయసాయిరెడ్డి మధ్య కోల్డ్‌వార్.. వైసీపీలో ప్రకంపనలు
దిశ, ఏపీ బ్యూరో: కాలం ఎప్పటికప్పుడు కొత్త సవాళ్లను విసురుతుంది. అధిగమించి ముందుకు సాగడంలో ఐక్యత దెబ్బతినకూడదు. అక్కడే విజ్ఞత గొప్పతనం బయటపడుతుంది. ప్రస్తుతం వైసీపీ కోర్‌కమిటీలో విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఒక్కప్పుడు నంబర్ టూగా సీఎం జగన్ తర్వాత తానై నడిపించిన ఎంపీ విజయసాయి రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం వైపు కన్నెత్తి చూడడం లేదు. సీఎం జగన్ బాబాయి వైవీ సుబ్బారెడ్డి అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు కేవలం సజ్జల రామకృష్ణారెడ్డి చక్రం తిప్పుతున్నట్లు కనిపిస్తోంది. […]
దిశ, ఏపీ బ్యూరో: కాలం ఎప్పటికప్పుడు కొత్త సవాళ్లను విసురుతుంది. అధిగమించి ముందుకు సాగడంలో ఐక్యత దెబ్బతినకూడదు. అక్కడే విజ్ఞత గొప్పతనం బయటపడుతుంది. ప్రస్తుతం వైసీపీ కోర్‌కమిటీలో విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఒక్కప్పుడు నంబర్ టూగా సీఎం జగన్ తర్వాత తానై నడిపించిన ఎంపీ విజయసాయి రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం వైపు కన్నెత్తి చూడడం లేదు. సీఎం జగన్ బాబాయి వైవీ సుబ్బారెడ్డి అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు కేవలం సజ్జల రామకృష్ణారెడ్డి చక్రం తిప్పుతున్నట్లు కనిపిస్తోంది. ఎన్నికలకు ముందు ఈ ముగ్గురు పార్టీకి కళ్లూ, చెవులే కాదు.. పార్టీని విజయతీరాలకు తీసుకెళ్లడంలో ఎవరి శైలిలో వాళ్లు శ్రమించారు. పార్టీ యంత్రాంగాన్ని ఏకతాటిపై నడిపించడంలోనూ అద్భుత పనితీరును కనబరిచారు. అధికారానికి వచ్చిన తొలి ఏడాది వరకూ సీఎం జగన్ ప్రతీ అడుగుకు ముందు బాబాయి వైవీ సుబ్బారెడ్డితో సమాలోచనలు సాగేవి. ఇప్పుడు అవేవీ లేవు. సీఎం జగన్ తీసుకునే ప్రతీ నిర్ణయం వెనుకాముందూ వీళ్లిద్దరూ చాలా దూరంగా జరిగారు. ఈ పరిణామాలు అధికార వైసీపీలో ఎక్కడకు తీసుకెళ్తాయోనని పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశమైంది.
ఎంపీ విజయసాయిరెడ్డిని కొద్ది రోజులుగా సీఎం జగన్ దూరంగా పెట్టినట్లు తెలుస్తోంది. ఆయన కూడా తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం వైపు కన్నెత్తి చూడడం లేదు. సీఎం జగన్ రెండేళ్ల పాలన పూర్తి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల్లోనూ విజయసాయిరెడ్డి కనిపించలేదు. ప్రతి చిన్న విషయానికి హడావుడి చేసే విజయసాయిరెడ్డి ఎందుకిలా మౌనవ్రతం పట్టారనేది అంతుచిక్కని ప్రశ్నే. ప్రస్తుతం ఆయన విశాఖపట్నానికే పరిమితమయ్యారు. ఇక్కడ కూడా ఏదో ప్రొటోకాల్ వరకే పరిమితం. గతంలో మాదిరిగా అంతా తానై కనిపించడం లేదు. విశాఖలో ఏం జరిగినా అంతా విజయసాయిరెడ్డి కనుసన్నల్లోనే నడిచేది. ఇప్పుడా పరిస్థితి లేదు. ఇటీవల యాస్ తుపానుపై జరిగిన సమీక్షల్లో విజయసాయిరెడ్డి ఎక్కడా కనిపించలేదు. సీఎస్ ఆధిత్యనాథ్ రెండు రోజులు విశాఖలో ఉండి పర్యవేక్షించారు. కిందటేడు ఎల్జీ పాలిమర్స్ నుంచి గ్యాస్ లీకైన సమయంలోనూ సీఎం జగన్ విజయసాయిరెడ్డిని పక్కన పెట్టారు.
విజయవాడ నుంచి జగన్‌తో పాటు ప్రత్యేక హెలికాప్టర్‌లో విశాఖ వచ్చేందుకు విజయసాయి ప్రయత్నించారు. సీఎం జగన్ ఆయన్ని కిందకు దించి వైద్యశాఖ మంత్రి అళ్లనానిని తనతో పాటు తీసుకెళ్లారు. ఈ ఘటన అప్పట్లో సంచలనమైంది. అప్పటినుంచి ఇప్పటిదాకా గ్యాప్ మరింత పెరుగుతూ వచ్చింది. జగన్ తనను దూరం పెట్టడం వల్లే విజయసాయి తాడేపల్లి రావడం లేదని తెలుస్తోంది. గృహ నిర్మాణ ప్రాజెక్టులకు సంబంధించి ఇటీవల ఈడీ దాఖలు చేసిన ఓ చార్జిషీట్లో సీఎం జగన్‌తో పాటు వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్, ఇందూ గ్రూపు వ్యవస్థాపకులు శ్యాంప్రసాద్‌రెడ్డి నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో ఎంపీ విజయసాయిరెడ్డి పేరు లేకపోవడం విశేషం. కేంద్రంతో లాబీయింగ్ నడిపి చార్జిషీట్లో పేరు లేకుండా చేసుకున్నారనేది పార్టీ శ్రేణుల మధ్య చర్చనీయాంశమైంది.
మరోవైపు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగుస్తుంది. తర్వాత ఆయన్ని అదే పదవిలో కొనసాగిస్తారా? లేదా? అనేది ఇంకా స్పష్టత రాలేదు. ఆయన తొలి నుంచి ఎంపీగా ఉండాలని కోరుకుంటున్నారు. ఎన్నికలకు ముందు అనూహ్యంగా ఒంగోలు ఎంపీ బరి నుంచి పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది. పార్టీ అధికారానికి వచ్చిన తొలినాళ్లలోనే సుబ్బారెడ్డికి టీటీడీ చైర్మన్ బాధ్యతలు అప్పగించారు. గతేడాది రాజ్యసభకు వెళ్లాలని సుబ్బారెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు. ఆ సమయంలో పరిమల్ నత్వానీ, అయోధ్య రామిరెడ్డితో పాటు పిల్లి సుభాష్, మోపిదేవి వెంకట రమణకు సీఎం అవకాశమిచ్చారు. ఒకానొక దశలో మనసు నొచ్చుకున్న వైవీ సుబ్బారెడ్డి కొద్దిరోజులు విదేశాల్లో గడిపి వచ్చారు. సీఎం జగన్ కుటుంబంలో ఒకరుగా ఉన్న సుబ్బారెడ్డి ఒంగోలు ఎంపీగా ప్రజా నాయకుడయ్యారు. అక్కడ నుంచి ఆయన ప్రత్యక్ష రాజకీయాలనే కోరుకుంటున్నారు. ప్రజాక్షేత్రంలోనే కొనసాగాలనేది ఆయన అభీష్టం. అది సాధ్యం కావడం లేదు. ప్రస్తుతం సుబ్బారెడ్డి సీఎంతో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. టీటీడీ చైర్మన్పదవీ కాలం రెండేళ్లు పూర్తయ్యాక ఎక్కువ సమయం తెలంగాణలో షర్మిల పార్టీ బలోపేతానికి వెచ్చిస్తారనే టాక్ వినిపిస్తోంది. ఈ పరిణామాలన్నీ పార్టీని ఎటుతీసుకెళ్తాయోనని నాయకులు, కార్యకర్తల్లో ఆందోళన రేకెత్తిస్తోంది.