గులాబీ నేతల మధ్య అంతర్యుద్ధం..?
దిశ, ఆదిలాబాద్: రాష్ట్ర డెయిరీ డెవలెప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ లోక భూమారెడ్డి, ఆదిలాబాద్ జిల్లా బోథ్ శాసన సభ్యుడు రాథోడ్ బాపురావుల నడుమ తీవ్రస్థాయి విభేదాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోన్నది. కొన్నాళ్లుగా వీరిద్దరి నడుమ ఉన్న విభేదాలు అంతర్గతంగా ఉన్నప్పటికీ… శనివారం బోథ్ ఎమ్మెల్యే బాపు రావు చేసిన వ్యాఖ్యలు గులాబీ పార్టీలో తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. ఒక సమయంలో రాష్ట్ర స్థాయి నేతగా ఉంటూ… ఎమ్మెల్యేనైన తనను కులం పేరుతో వ్యాఖ్యానిస్తాడంటూ పరోక్షంగా బాపురావు, […]
దిశ, ఆదిలాబాద్: రాష్ట్ర డెయిరీ డెవలెప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ లోక భూమారెడ్డి, ఆదిలాబాద్ జిల్లా బోథ్ శాసన సభ్యుడు రాథోడ్ బాపురావుల నడుమ తీవ్రస్థాయి విభేదాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోన్నది. కొన్నాళ్లుగా వీరిద్దరి నడుమ ఉన్న విభేదాలు అంతర్గతంగా ఉన్నప్పటికీ… శనివారం బోథ్ ఎమ్మెల్యే బాపు రావు చేసిన వ్యాఖ్యలు గులాబీ పార్టీలో తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. ఒక సమయంలో రాష్ట్ర స్థాయి నేతగా ఉంటూ… ఎమ్మెల్యేనైన తనను కులం పేరుతో వ్యాఖ్యానిస్తాడంటూ పరోక్షంగా బాపురావు, భూమా రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి.
అప్పట్లో ఇద్దరూ ఒక్కటే…
అధికార టీఆర్ఎస్ పార్టీలో ఉద్యమ సమయంలో భూమారెడ్డి, లోక బాపురావులు ఇద్దరూ కలిసి పాల్గొన్నారు. 2014 ఎన్నికల సమయంలో బోథ్ నియోజకవర్గం నుంచి టికెట్ ఇప్పించే విషయంలో బాపురావుకు లోక భూమారెడ్డి పూర్తిస్థాయిలో సహకరించారని ప్రచారం ఉంది. ఆ తరువాత బోథ్ నియోజకవర్గంలో అన్ని వ్యవహారాల్లో భూమారెడ్డి తలదూర్చడంపై బాపూరావు వర్గం జీర్ణించుకోలేకపోయింది. ఆ తర్వాతి క్రమంలో ఇద్దరి నడుమ తీవ్ర విభేదాలు పొడచూపుతూ వస్తున్నాయి. బోథ్ నియోజకవర్గం ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గం కావడంతో భూమా రెడ్డి కూడా అదే నియోజకవర్గ వాసి కావడం వల్ల, ఒక రాష్ట్రస్థాయి నేతగా తన ఆధిపత్యం చాటే యత్నాలు చేస్తారని పార్టీ వర్గాల్లో ప్రచారం ఉంది.
తాజా వ్యాఖ్యలతో కలకలం…
ఎమ్మెల్యే బాపురావు శనివారం తాజాగా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. దీంతో అధికార పార్టీలో అభిప్రాయ బేధాలు బయటపడ్డాయి. అభివృద్ధి పనుల విషయంలో సొంత పార్టీ నేతలు అడ్డుపడటంపై బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అసంతృప్తి వ్యక్తం చేశారు. పరోక్షంగా ఆయన రాష్ట్ర డెయిరీ చైర్మన్ లోక భూమారెడ్డిపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేయడం అధికార పార్టీలో కలకలం సృష్టిస్తోన్నది. శనివారం తలమడుగు మండలం కజ్జర్ల గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర డైరీ చైర్మన్ లోకభూమరెడ్డిని ఉద్దేశించి… ఒక రాష్ట్ర నాయకుడు ఎమ్మెల్యే పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. అంతే కాకుండా బట్టిసవర్గం నుంచి కజ్జర్ల గ్రామానికి పోయే రోడ్డు మరమ్మత్తు పనులను ఆయనే అడ్డుకున్నారని ఆరోపించారు. అంతే కాకుండా కులం పేరుతో పిలుస్తారని మండిపడ్డారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళతామని స్పష్టం చేశారు.