సచివాలయం ఇంటీరియర్ డిజైన్‌‌పై సీఎం సూచనలు

దిశ, న్యూస్‌బ్యూరో: కొత్త సచివాలయం నిర్మాణంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్‌లో మంగళవారం సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే సచివాలయం బైట రూపాన్ని మీడియాకు విడుదల చేసిన ప్రభుత్వం ఆరు అంతస్తుల్లో కొలువుదీరే మంత్రులు, కార్యదర్శుల కార్యాలయాలు ఎలా ఉంటాయో సస్పెన్స్‌లో పెట్టింది. ఇప్పుడు దానిపైన సచివాలయం డిజైన్ చేసిన ఆర్కిటెక్టులతో పాటు రోడ్లు భవనాల శాఖ అధికారులు, ప్రధాన కార్యదర్శి, వివిధ విభాగాల అధికారులతో చర్చించారు. ప్రతీ అంతస్తులో ఒక సమావేశ మందిరం, క్యాటరింగ్, డైనింగ్ […]

Update: 2020-07-21 12:19 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: కొత్త సచివాలయం నిర్మాణంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్‌లో మంగళవారం సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే సచివాలయం బైట రూపాన్ని మీడియాకు విడుదల చేసిన ప్రభుత్వం ఆరు అంతస్తుల్లో కొలువుదీరే మంత్రులు, కార్యదర్శుల కార్యాలయాలు ఎలా ఉంటాయో సస్పెన్స్‌లో పెట్టింది. ఇప్పుడు దానిపైన సచివాలయం డిజైన్ చేసిన ఆర్కిటెక్టులతో పాటు రోడ్లు భవనాల శాఖ అధికారులు, ప్రధాన కార్యదర్శి, వివిధ విభాగాల అధికారులతో చర్చించారు. ప్రతీ అంతస్తులో ఒక సమావేశ మందిరం, క్యాటరింగ్, డైనింగ్ గదులు ఉండాలని అధికారులకు నొక్కిచెప్పారు.

తెలంగాణ సచివాలయ కొత్త భవనం హుందాగా, సౌకర్యవంతంగా ఉండేలా నిర్మించాలని సంబంధిత అధికారులను, ఇంజనీర్లను ముఖ్యమంత్రి ఆదేశించారు. బాహ్యరూపం ఆకర్షణీయంగా, హుందాగా ఉండడమే కాక లోపల కూడా అన్ని సౌకర్యాలూ కలిగి పనిచేసుకోవడానికి పూర్తి అనుకూలంగా ఉండేలా తీర్చిదిద్దాలని సూచించారు. చెన్నయ్ నుంచి వచ్చిన ఆర్కిటెక్టులు తీసుకొచ్చిన డిజైన్లను లోతుగా పరిశీలించి చర్చించారు. త్రీ-డీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌ను కూడా చూశారు. ఆ డైజన్లలో చేయాల్సిన మార్పులు చేర్పులను కూడా ఆర్కిటెక్టులకు వివరించారు.

భవనం లోపల ఉండాల్సిన కార్యాలయాలు, గదులు, సమావేశ మందిరాలు తదితరాలపై కూడా సీఎం పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కార్యదర్శులు, సలహాదారులు వారి సిబ్బంది పనిచేయడానికి అనుగుణంగా కార్యాలయాలుండాలని చెప్పారు. ప్రతీ అంతస్తులో ఒక డైనింగ్ హాలు, సమావేశ మందిరం ఉండాలని చెప్పారు. సచివాలయానికి నిత్యం వివిధ అవసరాల కోసం వచ్చే వివిధ శాఖల అధికారులు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రభుత్వ సిబ్బంది, వివిధ సమావేశాల కోసం వచ్చే ఆహ్వానితులు, ప్రముఖులు, సందర్శకులు… ఇలాంటి అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకుని వారికి తగిన తీరులో ప్రత్యేక వెయిటింగ్ హాళ్లు కూడా ఉండాలని సూచించారు.

సచివాలయంలో రోజువారీ జరిగే పనులు, ఎంతమంది సిబ్బంది పనిచేస్తుంటారు, ఎంతమంది సందర్శకులు వస్తూ ఉంటారు తదితర విషయాలను పరిగణలోకి తీసుకుని నిర్మాణాలు, ఇంటీరియర్ డిజైన్‌ను రూపొందించాలని ఆదేశించారు.

పది నెలల్లో కొలువుదీరనున్న కొత్త సచివాలయం?

ప్రస్తుతం ముగింపుకు వచ్చిన పాత భవనాల కూల్చివేత పనులను రెండు రోజుల్లోనే పూర్తిచేసి శ్రావణ శుక్రవారం రోజునే చదునుచేసే పనులను ప్రారంభించాలని అధికారులను సీఎం ఆదేశించినట్లు తెలిసింది. చదునుచేసే పనులు కూడా కొత్త సచివాలయం నిర్మాణంలో భాగమనే ఉద్దేశంతో ఇది అనుకున్న సమయానికి ప్రారంభం కావాల్సిందిగా నొక్కిచెప్పినట్లు సమాచారం. కొత్త సచివాలయంలో ప్రతీ అంశంలో వాస్తు పక్కాగా ఉండాలని సూచించినట్లు తెలిసింది. రానున్న పది నెలల కాలంలోనే కొత్త సచివాలయం నిర్మాణం మొత్తం పూర్తయ్యి వినియోగంలోకి వచ్చేలా లోతుగా చర్చించినట్లు తెలిసింది. వచ్చే ఏడాది రాష్ట్ర అవతరణ ఉత్సవం లేదా పంద్రాగస్టు కల్లా ప్రారంభోత్సవం జరిగేలా నిర్మాణాన్ని వేగంగా చేపట్టాల్సిందిగా సూచించినట్లు తెలిసింది.

ఇప్పటికే సచివాలయ భవనాల్లో డీ, ఎల్, జే బ్లాకులు తప్ప మిగిలినవన్నీ దాదాపుగా నేలమట్టమయ్యాయి. దాదాపు 40% మాత్రమే కూల్చివేత పనులు మిగిలినందున ఈ రెండు రోజుల్లోనే ఆ ప్రక్రియను పూర్తి చేసి ఇక పాత ఆనవాళ్ళు లేకుండా చేయాలన్నది సీఎం ఆలోచన. దాని ప్రకారమే కూల్చివేసిన సిబ్బందితోనే చదునుచేసే పనులను కూడా చేయించే బాధ్యతను అధికారులకు అప్పజెప్పారు.

కొత్త సచివాలయ భవనం నిర్మాణంపై ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్షలో రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంతరెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, ఆర్థిక శాఖ ముఖ్య రామకృష్ణ, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, సీఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు, ఆర్కిటెక్టులు ఆస్కార్, పొన్ని తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News