ఆశలన్నీ యాసంగిపైనే..
దిశ, తెలంగాణ బ్యూరో: రానున్న యాసంగి సీజన్‌లో సుమారు 65 లక్షల ఎకరాల్లో పంటలు పండించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 50 లక్షల ఎకరాల్లో వరి, 15 లక్షల ఎకరాల్లో ఇతర పంటలు సాగుచేయాలని రైతులకు సూచించింది. నిర్ణీత పంటల సాగు విధానాన్ని వానాకాలంలో పకడ్బందీగా పాటించారని, యాసంగిలోనూ ఇదే ఒరవడిని కొనసాగించాలని సీఎం కేసీఆర్ కోరారు. ఏ కొత్త విధానమైనా ఒక్క రోజుతో లేదా ఒక్క ప్రయత్నంతో అలవాటు కాదని, నిరంతర ప్రక్రియ ద్వారానే అలవడుతుందని […]
దిశ, తెలంగాణ బ్యూరో: రానున్న యాసంగి సీజన్‌లో సుమారు 65 లక్షల ఎకరాల్లో పంటలు పండించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 50 లక్షల ఎకరాల్లో వరి, 15 లక్షల ఎకరాల్లో ఇతర పంటలు సాగుచేయాలని రైతులకు సూచించింది. నిర్ణీత పంటల సాగు విధానాన్ని వానాకాలంలో పకడ్బందీగా పాటించారని, యాసంగిలోనూ ఇదే ఒరవడిని కొనసాగించాలని సీఎం కేసీఆర్ కోరారు. ఏ కొత్త విధానమైనా ఒక్క రోజుతో లేదా ఒక్క ప్రయత్నంతో అలవాటు కాదని, నిరంతర ప్రక్రియ ద్వారానే అలవడుతుందని అన్నారు. రైతులకు కూడా ఈ విధానం ద్వారా వారికే లాభం జరుగుతుందనే విషయాన్ని ఒకటికి నాలుగుసార్లు అర్థం చేయిస్తే అవగాహన, చైతన్యం పెరుగుతాయన్నారు. యాసంగి సీజన్‌కు సంబంధించి ప్రగతి భవన్‌లో గురువారం వివిధ శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు.
ఎరువులు, విత్తనాలు సిద్ధం
యాసంగి సీజన్ కోసం వచ్చిన ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు చర్చించారు. వ్యవసాయాధికారులు సూచించిన మేరకు రైతులు పంటలను సాగు చేయాలని, తద్వారా మంచి ధర పొందాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. క్లస్టర్లు, మండలాలు, జిల్లాలవారీగా పంట సాగు లెక్కలతో కార్డులు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. పంటలకు అవసరమయ్యే విత్తనాలను, ఎరువులను కూడా సిద్దంగానే ఉంచామని సీఎం చెప్పారు. సీజన్‌లో విత్తనాలు వేయడం ముగియగానే, మరో సీజన్‌లో ఏ పంటలు వేయాలనే విషయంలో వ్యవసాయ శాఖ కార్యాచరణ ప్రారంభించాలన్నారు. రైతుబంధు సమితులు కూడా క్రియాశీల పాత్ర పోషించాలని సూచించారు. దసరానాటికి చాలావరకు రైతు వేదికల నిర్మాణం పూర్తవుతుందని, వాటి ద్వారా రైతులను సంఘటితపరిచి, సమన్వయపరచడం సులభం అవుతుందని పేర్కొన్నారు.
మక్కల సాగు వద్దే వద్దు
మక్కల ధర, మార్కెట్ విషయంలో అనిశ్చితి నెలకొన్నందున ఆ పంట సాగు చేయకపోవడమే శ్రేయస్కరమని అధికారులు అభిప్రాయపడ్డారు. మక్కల సాగు వద్దనే విషయాన్ని రైతులకు స్పష్టం చేయడం ఉత్తమమని వివరించారు. ప్రస్తుతం క్వింటాల్‌కు రూ. 900 మించి ధర వచ్చే అవకాశమే లేదని అధికారులు చెబుతున్నందున, ఆ ప్రకారం రైతులే నిర్ణయం తీసుకోవాలని సీఎం కోరారు. ఎంత ధర వస్తే అంతకే అమ్ముకుంటామనుకునే రైతులు మాత్రమే ఆ పంటలు సాగు చేసుకోవచ్చన్నారు.
పత్తి సాగులో దేశంలోనే రెండో స్థానం..
నిర్ణీత పంటల సాగు విధానం అమలు చేసిన ఫలితంగా పత్తిసాగులో తెలంగాణ దేశంలోనే రెండవ స్థానంలో నిలిచిందని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రస్తుత వానాకాలంలో దేశవ్యాప్తంగా మొత్తం 3.19 కోట్ల ఎకరాల మేర పత్తి పంట సాగవుతూ ఉందని, ఇందులో 1.40 కోట్ల ఎకరాలతో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉండగా, 60.52 లక్షల ఎకరాల్లో తెలంగాణ రెండవ స్థానంలో ఉందని వివరించారు. 56.29 లక్షల సాగుతో గుజరాత్ మూడవ రాష్ట్రంలో, 18 లక్షల ఎకరాలతో హర్యానా నాలుగవ స్థానంలో ఉన్నాయన్నారు. గతేడాది వరకు పత్తి సాగులో మహారాష్ట్ర, గుజరాత్ తర్వాత తెలంగాణ మూడో స్థానంలో ఉండేదని గుర్తుచేశారు. సమీక్షలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి, సీఎంవో అధికారులు స్మితా సభర్వాల్, ప్రియాంక వర్గీస్, అగ్రికల్చర్ యూనివర్సిటీ వీసీ ప్రవీణ్ రావు, ఉద్యానవనశాఖ ఎండీ వెంకట్రామ్ రెడ్డి, జేడీ శోభారాణి తదితరులు పాల్గొన్నారు.
యాసంగి పంటల సాగు ఇలా..
వరి: 50 లక్షల ఎకరాలు
శనగ: 4.50 లక్షల ఎకరాలు
వేరుశనగ: 4.00 లక్షల ఎకరాలు
మిరప + కూరగాయలు: 2.00 లక్షల ఎకరాలు
జొన్న: 1.00 లక్ష ఎకరాలు
నువ్వులు: 1.00 లక్ష ఎకరాలు
పెసర్లు: 60 వేల ఎకరాలు
మినుములు: 50 వేల ఎకరాలు
పొద్దు తిరుగుడు: 40 వేల ఎకరాలు
ఆవాలు-కుసుమలు-సజ్జలు: 70 వేల ఎకరాలు