హైదరాబాద్‌ను ఇస్తాంబుల్ చేసి చూపిస్తాం: సీఎం కేసీఆర్
దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ నగరాన్ని ఇస్తాంబుల్ లాగా తీర్చిదిద్దుతామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. నగరాన్ని గొప్పగా తీర్చిదిద్దుకుంటే రాష్ట్రం ప్రతిష్ఠ పెరుగుతోందని, హైదరాబాద్ పాత నగరాన్ని ఇస్తాంబుల్ చేస్తామనడంలో తప్పు లేదని, ఇస్తాంబుల్‌గా కావాలని కోరుకోవద్దా? ఇది కూడా అనుకోవద్దా? కలలు కనొద్దా? అని సీఎం ప్రతిపక్షాలను ప్రశ్నించారు. అసెంబ్లీలో పల్లె, పట్టణ ప్రగతిపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా సీఎం మాట్లాడారు. హైదరాబాద్‌ను ఇస్తాంబుల్‌గా బరాబర్ చేసి చూపిస్తామని, దానిపై వక్రీకరణలు చేయడం దుర్మార్గమన్నారు. […]
దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ నగరాన్ని ఇస్తాంబుల్ లాగా తీర్చిదిద్దుతామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. నగరాన్ని గొప్పగా తీర్చిదిద్దుకుంటే రాష్ట్రం ప్రతిష్ఠ పెరుగుతోందని, హైదరాబాద్ పాత నగరాన్ని ఇస్తాంబుల్ చేస్తామనడంలో తప్పు లేదని, ఇస్తాంబుల్‌గా కావాలని కోరుకోవద్దా? ఇది కూడా అనుకోవద్దా? కలలు కనొద్దా? అని సీఎం ప్రతిపక్షాలను ప్రశ్నించారు. అసెంబ్లీలో పల్లె, పట్టణ ప్రగతిపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా సీఎం మాట్లాడారు. హైదరాబాద్‌ను ఇస్తాంబుల్‌గా బరాబర్ చేసి చూపిస్తామని, దానిపై వక్రీకరణలు చేయడం దుర్మార్గమన్నారు. కరీంనగర్‌ను డల్లాస్ చేస్తామని చెప్పలేదని, రోప్ వే బ్రిడ్జి కావాలని మంత్రి గంగుల కమలాకర్ అడిగితే కరీంనగర్ పక్కనే నది, కాలువలు అందంగా ఉంటాయని, వాటిని సుందరంగా తీర్చిదిద్దుకుంటే కరీంనగర్ డల్లాస్‌గా కనిపిస్తుందని చెప్పానని సీఎం వివరించారు. అలా చెప్పడం తప్పా? అని ప్రశ్నించారు.
హైదరాబాద్‌లో డ్రైనేజీ వ్యవస్థను కాంగ్రెస్ నాశనం చేసిందని, అప్పుడు చేసిన తప్పులను సవరించలేక చచ్చిపోతున్నామని, నగరంలో డ్రైనేజీ వ్యవస్థను రూపుదిద్దేందుకు రూ. 15 వేల కోట్లు కావాలని అధికారులు చెప్పారని, ఇది ఒక రోజులో అయ్యే పని కాదని, దశలవారీగా డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని మున్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. హైదరాబాద్ అనేది ఇంటర్నేషనల్ సిటీ అని, అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులున్నాయని, అనేక కాన్ఫరెన్స్‌లు జరుగుతుంటాయన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై కేంద్రానికి నివేదిక ఇచ్చామన్నారు.
శివారులకు రూ. 1200 కోట్లు
పెరుగుతున్న హైదరాబాద్ అవసరాలకు అనుగుణంగా రూ.1,200 కోట్లతో నగర శివారు ప్రాంతాల అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. ఇక్కడ పేదవారికి రూ.1 నల్లా కనెక్షన్ ఇస్తున్నామని, రూ.5,378 కోట్లతో ఇంటింటికీ తాగునీరు అందిస్తున్నామని, భవిష్యత్తులో 24 గంటల పాటు నీళ్లు అందించేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. పట్టణాల్లో చెరువులను కూడా అభివృద్ధి చేస్తున్నామని, పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు పెంచి సకాలంలో చెల్లిస్తున్నామన్నారు.