పోతిరెడ్డి పాడు ముమ్మాటికీ అక్రమమే.. కృష్ణా వాటర్ @50 : 50 : కేసీఆర్
దిశ, తెలంగాణ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు చట్టవ్యతిరేకమైనదని, దానికి ఒక్క చుక్క నీటి కేటాయింపులు కూడా లేవని, దీన్ని తెలంగాణ ప్రభుత్వం గుర్తించడంలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ నొక్కిచెప్పారు. ఈ కాలువ ద్వారా నీటిని ఎత్తిపోయడానికి ఇప్పుడు ఆ రాష్ట్రం నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కూడా ముమ్మాటికీ అక్రమ ప్రాజెక్టేనని వ్యాఖ్యానించారు. ఆ రాష్ట్రానికి గతంలో బచావత్ ట్రిబ్యునల్ ‘ఎన్ బ్లాక్‘ (గంపగుత్త)గా కేటాయించిన వాటా మేరకే నికర జలాలను […]
దిశ, తెలంగాణ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు చట్టవ్యతిరేకమైనదని, దానికి ఒక్క చుక్క నీటి కేటాయింపులు కూడా లేవని, దీన్ని తెలంగాణ ప్రభుత్వం గుర్తించడంలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ నొక్కిచెప్పారు. ఈ కాలువ ద్వారా నీటిని ఎత్తిపోయడానికి ఇప్పుడు ఆ రాష్ట్రం నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కూడా ముమ్మాటికీ అక్రమ ప్రాజెక్టేనని వ్యాఖ్యానించారు. ఆ రాష్ట్రానికి గతంలో బచావత్ ట్రిబ్యునల్ ‘ఎన్ బ్లాక్‘ (గంపగుత్త)గా కేటాయించిన వాటా మేరకే నికర జలాలను ప్రాజెక్టులకు వాడుకోవాలన్నారు. పోతిరెడ్డిపాడుకు ఎట్టి పరిస్థితుల్లో నీటిని అనుమతించబోమని తేల్చి చెప్పారు. ప్రస్తుతం రెండు రాష్ట్రాల మధ్య 66:34 నిష్పత్తి (ఏపీ 66%, తెలంగాణ 34%)లో తాత్కాలికంగా కొనసాగుతున్న ఫార్ములాను తిరస్కరిస్తున్నామని, ఈ సంవత్సరం నుంచి దాన్ని ఫిఫ్టీ ఫిఫ్టీ (50:50) నిష్పత్తిలో నీటి పంపకాలు జరగాలని నొక్కిచెప్పారు. సాగునీటి పారుదల, విద్యుత్ విభాగాల అధికారులతో ప్రగతి భవన్‌లో శనివారం సాయంత్రం సుదీర్ఘంగా జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు పలు తీర్మానాలకు ఆమోదం లభించింది.
రాష్ట్ర మంత్రివర్గం గతంలో తీసుకున్న నిర్ణయం మేరకు జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతర ప్రాజెక్టుల్లో నీటి లభ్యత ఉన్నంతకాలం పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తిని కొనసాగించాలని ఈ సమావేశం తీర్మానించింది. విద్యుత్ ఉత్పత్తిని ఆపాలని చెప్పే హక్కు కృష్ణా నది యాజమాన్య బోర్డుకు లేదని, ఈ అంశంలో జోక్యం చేసుకునే ప్రశ్నే ఉత్పన్నం కాదని స్పష్టంచేసింది. జల విద్యుత్ అంశానికి సంబంధించి ఇరు రాష్ట్రాల మధ్య ఎలాంటి ఒప్పందాలు, నిబంధనలు లేవని నొక్కిచెప్పింది. ఈ నెల 9వ తేదీన కృష్ణా బోర్డు తలపెట్టిన త్రిసభ్య సమావేశాన్ని రద్దు చేయాలని, దానికి బదులుగా ఈ నెల 20 తర్వాత పూర్తి స్థాయి సమావేశాన్ని నిర్వహించాలని ఈ సమావేశం తీర్మానం చేసింది. ఈ మేరకు బోర్డుకు లేఖ రాయాలని నిర్ణయించింది.
కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కులను కాపాడుకోడానికి, రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలను పరిరక్షించడానికి ప్రభుత్వం రాజీలేని పోరాటం చేస్తుందని, ఎంతవరకైనా తెగిస్తుందని ఈ సమావేశం స్పష్టం చేసింది. నికర జలాలను దౌర్జన్యంగా వాడుకుంటామంటే తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోబోరని ఈ సమావేశంలో ముఖ్యమంత్రి నొక్కిచెప్పారు. బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ఏర్పాటయ్యి 17 సంవత్సరాలు కావస్తున్నా తెలంగాణకు కృష్ణా జలాల్లో నీటి వాటాను నిర్ధారించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు న్యాయమైన నీటి వాటా కోసం అవసరమైతే కేంద్రంతోనూ కొట్లాడుతామని నొక్కిచెప్పారు. బేసిన్ అవసరాలు పూర్తిగా తీరిన తర్వాత మాత్రమే అదనపు నీటిని బేసిన్ వెలుపలి ప్రాంతాలకు తరలించుకోవచ్చన్నది సహజ న్యాయమని, కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం దీన్ని విస్మరించి అనుమతి లేని అక్రమ ప్రాజెక్టులకు తరలిస్తూ ఉన్నదని ఈ సమావేశం తీర్మానించింది.
ఈ సమావేశంలో ఆమోదం పొందిన కొన్ని తీర్మానాలు :
*పోతిరెడ్డిపాడు చట్ట వ్యతిరేక ప్రాజెక్టు. దీన్ని అంగీకరించం. రాయలసీమ ఎత్తిపోతల పథకం కూడా అక్రమమైనదే.
*పర్యావరణ అనుమతులు లేకుండానే రాయలసీమ ఎత్తిపోతల పనులను ఏపీ చేపట్టింది. ఎన్జీటీ స్టే ఉత్తర్వులు కూడా ఇచ్చింది. ఉల్లంఘించినందుకు ఏపీ ప్రధాన కార్యదర్శిని జైల్లో పెడతామని హెచ్చరించింది. అయినా సర్వే పేరుతో నిర్మాణాలు చేపట్టింది.
*ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు పోతిరెడ్డిపాడుకు వరద జలాలను మాత్రమే వాడుకుంటామని అసెంబ్లీలో, అసెంబ్లీ బయట ప్రకటించారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌కు కూడా ఆనాడు అదే విషయం చెప్పారు. నేడు ఏపీ ప్రభుత్వం మాట మార్చింది. పోతిరెడ్డిపాడు పేరుతో తెలంగాణ నీటి హక్కులను కాలరాస్తున్నది. దీన్ని తెలంగాణ ప్రజలు సహించబోరు.
*బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం నికర జలాల కేటాయింపులున్న ప్రాజెక్టులకు మాత్రమే ఏపీ కృష్ణా జలాలను వాడుకోవాలి.
*పోతిరెడ్డిపాడుకు ఎట్టి పరిస్థితుల్లో నీటిని అనుమతించబోము. రాయలసీమ ఎత్తిపోతల అక్రమ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నాం. కేఆర్ఎంబీ సమావేశంలో మా వాదనలను వినిపిస్తాం.
*హక్కు ప్రకారం లభించిన వాటా మేరకు నీటిని వాడుకోడానికి తెలంగాణ అభ్యంతరం చెప్పదు. కానీ కేటాయింపులు లేకుండా దౌర్జన్యంగా నికర జలాలను వాడుకుంటామంటే ఊరుకోదు. మిగులు జలాలు ఉంటే మాత్రమే బేసిన్ వెలుపలికి తరలించుకోవచ్చు.
*ఈ నెల 9న కేఆర్ఎంబీ నిర్వహించనున్న త్రిసభ్య సమావేశాన్ని రద్దు చేయాలి. జూలై 20 తర్వాత పూర్తిస్థాయి బోర్డు సమావేశాన్ని నిర్వహించాలి. తెలంగాణ అంశాలను ఎజెండాలో చేర్చాలి. ఈ అంశాలను బోర్డుకు వెంటనే తెలియజేస్తాం.
*ఇప్పటివరకూ ఏపీ, తెలంగాణ మధ్య అమలవుతున్న 66:34 నిష్పత్తిని వ్యతిరేకిస్తున్నాం. ఈ ఏడాది నుంచే 50:50 ఫార్ములాలో నీటి పంపకాలు జరగాలి. మొత్తం 811 టీఎంసీలలో తెలంగాణ వాటాగా 405.5 టీఎంసీల కేటాయింపులు ఉండాలి. ఆ ప్రకారమే వినియోగించుకుంటాం.
*జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల్లో నీటి లభ్యత ఉన్నంతవరకూ పూర్తిస్థాయి విద్యుత్ ఉత్పత్తి చేస్తాం.
*విద్యుత్ ఉత్పత్తి విషయంలో కేఆర్ఎంబీకి ఎలాంటి హక్కు లేదు. విద్యుత్ ఉత్పత్తిని ఆపాలని చెప్పే అధికారంలేదు. జోక్యం చేసుకోజాలదు.
*పులిచింతలలో విద్యుత్ ఉత్పత్తి కారణంగా కృష్ణా జలాలు సముద్రంలోకి వృథాగా వెళ్తున్నాయనే ఏపీ వాదన ఒక దుష్ప్రచారం. ప్రకాశం బ్యారేజీ ద్వారా ఏపీ తన అవసరాలకు అనుగుణంగా వాడుకోవచ్చు.
*పట్టిసీమ నుంచి గోదావరి నీటిని ఎత్తిపోయడానికి వినియోగించే విద్యుత్ ఖర్చులను తగ్గించుకోవాలని ఏపీకి సూచన.
*జూరాల కుడి, ఎడమ కాల్వల ద్వారా నీటిని విడుదల చేసి చెరువులు, కుంటలను నింపాలని తెలంగాణ సాగునీటిపారుదల శాఖ అధికారులకు ఆదేశం.
*సమ్మక్క బ్యారేజీ సహా సీతమ్మ సాగర్ ప్రాజెక్టులను ఇరిగేషన్, హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టులుగా పిలవాలి.
*శ్రీశైలం డ్యామ్ మీద తెలంగాణ భూభాగంలోకి గుర్తింపు కార్డులు ఉన్న విద్యుత్ ఉద్యోగులను మాత్రమే అనుమతించాలి. ఇతరులకు ప్రవేశం ఉండదు. శ్రీశైలం సహా కృష్ణా నదిపై ప్రాజెక్టుల దగ్గర పూర్తిస్థాయి రక్షణ చర్యలు తీసుకోవాలి.
*కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కులను కాపాడుకోడానికి, రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలను కాపాడుకోడానికి రాజీలేని పోరాటం.
*కృష్ణా, గోదావరి నదులపై రానున్న కాలంలో రెండు పంటలూ పండించుకునేలా కొత్త ప్రాజెక్టులను నిర్మించుకోవాలి.
*ట్రిబ్యునల్ చేసిన కేటాయింపుల ప్రకారం సాగు అవసరాలకు, విద్యుత్ ఉత్పత్తి కోసం తప్పకుండా వినియోగించుకుంటాం.
*ఎవరి అభిప్రాయాలనూ తెలంగాణ పట్టించుకోదు.
*ట్రిబ్యునళ్ళు, కేఆర్ఎంబీ బోర్డు ముందు వాదనలను వినిపించడంతో పాటు న్యాయస్థానాల్లో, ప్రజా క్షేత్రంలో తెలంగాణ తన గొంతు వినిపిస్తుంది.
*తెలంగాణ టెర్రయిన్ పరిస్థితుల కారణంగా సాగు అవసరాలతో పాటు విద్యుత్ ఉత్పత్తి కోసం కూడా నీరు అవసరం.
*కాళేశ్వరం అవసరాల కోసం మహారాష్ట్రతో పరస్పర సహకార ధోరణిని అవలంబించాం. ఏపీ విషయంలోనూ ఇదే తీరులో స్నేహ హస్తం అందించాం. కానీ అక్కడి ప్రభుత్వం పెడచెవిన పెట్టింది.