హైదరాబాద్‌కు రాకపోకలు బంద్ చేయండి: సీఎం

దిశ, న్యూస్ బ్యూరో: ‘హైదరాబాద్ నగరం, దానికి ఆనుకుని ఉన్న జిల్లాలు మినహా రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కరోనా వైరస్ పరిస్థితి అదుపులోనే ఉంది. ఆ జిల్లాల్లో వ్యాప్తి చాలా తక్కువగా ఉంది. కొత్తగా నమోదవుతున్న కేసులన్నీ హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోనే ఉన్నాయి. కాబట్టి అధికారులు హైదరాబాద్‌పై ఎక్కువ దృష్టి పెట్టాలి. వ్యాధి లక్షణాలు ఎవరికి కనిపించినా వెంటనే పరీక్షలు చేయండి. పాజిటివ్‌గా తేలినట్లయితే ఆ వ్యక్తి కలిసిన వారందరినీ క్వారంటైన్ చేయాలి. హైదరాబాద్‌లోని […]

Update: 2020-05-06 08:06 GMT

దిశ, న్యూస్ బ్యూరో: ‘హైదరాబాద్ నగరం, దానికి ఆనుకుని ఉన్న జిల్లాలు మినహా రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కరోనా వైరస్ పరిస్థితి అదుపులోనే ఉంది. ఆ జిల్లాల్లో వ్యాప్తి చాలా తక్కువగా ఉంది. కొత్తగా నమోదవుతున్న కేసులన్నీ హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోనే ఉన్నాయి. కాబట్టి అధికారులు హైదరాబాద్‌పై ఎక్కువ దృష్టి పెట్టాలి. వ్యాధి లక్షణాలు ఎవరికి కనిపించినా వెంటనే పరీక్షలు చేయండి. పాజిటివ్‌గా తేలినట్లయితే ఆ వ్యక్తి కలిసిన వారందరినీ క్వారంటైన్ చేయాలి. హైదరాబాద్‌లోని ప్రజలు బయటకు పోకుండా, బయటివారు హైదరాబాద్ నగరంలోనికి రాకుండా నియంత్రణ చర్యలు పకడ్బందీగా చేపట్టాలి. చురుకైన పోలీసు అధికారులు, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, ఐఏఎస్ అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమించాలి. మొత్తం హైదరాబాద్ నగరాన్నే చుట్టుముట్టాలి. వైరస్‌ను తుదముట్టించాలి’ అని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. వైరస్ వ్యాప్తి నివారణపై ప్రగతి భవన్‌లో బుధవారం ఉన్నతాధికారులతో సమీక్ష అనంతరం ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇప్పటిదాకా హైదరాబాద్ నగరంలో వైరస్ తీవ్రత ఎక్కువ ఉన్న ప్రాంతాలు మాత్రమే కంటైన్‌మెంట్ జోన్లుగా ఉన్నాయి. ఇప్పుడు నగరం, దానికి ఆనుకుని ఉన్న జిల్లాలన్నీ రాష్ట్రంలోని మిగతా ప్రాంతంతో ఐసొలేట్ కానున్నాయి. వైరస్ పీడ లేకుండా ఉన్న జిల్లాలు ప్రశాంతంగా ఉన్న సమయంలో హైదరాబాద్‌కు రాకపోకలు సాగిస్తే అక్కడ కూడా వైరస్ వ్యాప్తి జరుగుతుందన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్‌తో పాటు ఆనుకుని ఉన్న జిల్లాలకు మిగిలిన జిల్లాలతో సంబంధాలను కత్తిరించాలనుకున్నారు. ఆంక్షల సడలింపు నేపథ్యంలో వైరస్ ప్రభావం ప్రశాంతంగా ఉన్న జిల్లాలపై పడకుండా ఈ చర్యలు తీసుకున్నారు. అందులో భాగంగానే కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రత ఎక్కువగా ఉన్న హైదరాబాద్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో కట్టుదిట్టమైన నియంత్రణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

కర్నూలు, గుంటూరు జిల్లాలతో జాగ్రత్త..

హైదరాబాద్ నగరం నుంచి రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలకు వైరస్ సోకకుండా ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్న సీఎం కేసీఆర్ బైట నుంచి వైరస్‌ను మోసుకొచ్చేందుకు ఉన్న అవకాశాలను కూడా అధికారులతో సమీక్షించారు. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా గ్రామాలతో సరిహద్దులో కలిగిన మన రాష్ట్రంలోని గ్రామాల్లోకి వచ్చే వ్యక్తుల పట్ల, వాహనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అదే విధంగా గుంటూరు జిల్లాతో సరిహద్దు ఉన్న మన గ్రామాలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఆ రెండు జిల్లాల్లో వైరస్ ఎక్కువగా ఉన్నందున ఆంక్షల సడలింపుతో వైరస్ ఉన్న వ్యక్తులు వచ్చే అవకాశం ఉందన్న ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. సరుకును తీసుకొచ్చిన ఒక వాహనం డ్రైవర్ ద్వారా కొద్దిమందికి కరోనా లక్షణాలు వచ్చినట్లు ఇటీవల వార్తలు వచ్చిన నేపథ్యంలో అలాంటివి పునరావృతం కాకుండా పకడ్బందీగా వ్యవహరించాలని సీఎం భావిస్తున్నారు.

‘పక్క రాష్ట్రంలోని కర్నూలు పట్టణం, గుంటూరు జిల్లాల్లో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంది. వాటికి సరిహద్దుల్లోనే తెలంగాణ గ్రామాలున్నాయి. ఈ రెండు సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక అధికారులను నియమించి నియంత్రణ చర్యలు చేపట్టాలి. అటువారెవరూ ఇటువైపు రాకుండా, ఇటువైపువారెవరూ అటు పోకుండా నియంత్రించాలి. వైరస్ మన దగ్గర పుట్టింది కాదు. ఇతర ప్రాంతాల నుంచి వ్యాప్తి చెందేదే. కాబట్టి ప్రజల రాకపోకలను ఎంత కట్టుదిట్టంగా నియంత్రించగలిగితే వైరస్ వ్యాప్తిని అంత బాగా అరికట్టవచ్చు’ అని ముఖ్యమంత్రి ఈ సమావేశంలో అధికారులకు స్పష్టం చేశారు. మన రాష్ట్రానికి మహారాష్ట్ర, కర్నాటక, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల కంటే ఎక్కువగా భూభాగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతోనే ఉందని సీఎం మంగళవారం రాత్రి మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. ఆ వెంటనే ఆంధ్రప్రదేశ్‌తో సరిహద్దు ఉన్న గ్రామాలు అప్రమత్తంగా ఉండేలా ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.

tags : Telangana, Andhra Pradesh border, Kurnool, Guntur districts, Hyderabad, Seal

Tags:    

Similar News