పోతిరెడ్డిపాడు జీఓ ఏకపక్షం: సీఎం కేసీఆర్
దిశ, న్యూస్ బ్యూరో: ‘దిశ’ కథనం… తెలంగాణ ప్రభుత్వంలో కదలిక తెచ్చింది. పోతిరెడ్డిపాడు నుంచి ఏపీ సీఎం జగన్ జలదోపిడీ చేయడానికి ప్రయత్నిస్తున్నారని ‘దిశ’ సోమవారం ప్రచురించిన కథనంపై తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్ రావు స్పందించారు. “శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణా నీటిని లిఫ్టు చేస్తూ కొత్త ఎత్తిపోతల పథకం నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయించడం తీవ్ర అభ్యంతరకరం. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టానికి విరుద్ధం. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు […]
దిశ, న్యూస్ బ్యూరో:
‘దిశ’ కథనం… తెలంగాణ ప్రభుత్వంలో కదలిక తెచ్చింది. పోతిరెడ్డిపాడు నుంచి ఏపీ సీఎం జగన్ జలదోపిడీ చేయడానికి ప్రయత్నిస్తున్నారని ‘దిశ’ సోమవారం ప్రచురించిన కథనంపై తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్ రావు స్పందించారు. “శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణా నీటిని లిఫ్టు చేస్తూ కొత్త ఎత్తిపోతల పథకం నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయించడం తీవ్ర అభ్యంతరకరం. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టానికి విరుద్ధం. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర భంగకరమైనది. ఈ ప్రాజెక్టును అడ్డుకోవడానికి న్యాయ పోరాటం చేస్తాం. ఇందుకోసం రాజీలేని పోరాటం చేస్తాం” అని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణలోకానీ, ఆంధ్రప్రదేశ్‌లోకానీ కొత్త నీటి పారుదల ప్రాజెక్టు నిర్మాణం చేపడితే అపెక్స్ కమిటీ అనుమతి తీసుకోవడం తప్పనిసరి అని, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అపెక్స్ కమిటీ ఆమోదం తీసుకోకుండానే ఈ నిర్ణయానికి ఒడిగట్టిందని వ్యాఖ్యానించారు. శ్రీశైలం ప్రాజెక్టు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన ఉమ్మడి ప్రాజెక్టు అని, ఇందులోని నీటిని రెండు రాష్ట్రాలూ వాడుకోవాల్సి ఉంటుందని, కానీ తెలంగాణ రాష్ట్రాన్ని కనీసం సంప్రదించకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీశైలం ప్రాజెక్టులోని నీటిని లిఫ్టు చేయాలని నిర్ణయించి, జీవో జారీ చేయడం తీవ్ర అభ్యంతకరమని కేసీఆర్ వ్యాఖ్యానించారు. కృష్ణా నీటిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరలించుకుపోతే ఉమ్మడి పాలమూరు, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు సాగు, తాగునీటి సమస్య ఏర్పడుతుందని, అందుకే ఈ ప్రాజెక్టు నిర్మాణం జరగకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ వెంటనే కృష్ణా నదీయాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)లో ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్‌లో సోమవారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. మంత్రులు ఈటల రాజేందర్, మహమూద్ అలీ, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, జగదీష్‌రెడ్డి, పువ్వాడ అజయ్, రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, నీటి పారుదల సలహాదారు ఎస్కే జోషీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, ఇంజనీర్-ఇన్-చీఫ్ (ఈఎన్సీ) మురళీధర్, అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, అదనపు ఏజీ రాంచందర్ రావు, లీగల్ కన్సల్టెంట్ రవీందర్ రావు, రిటైర్డ్ ఇంజనీర్లు శ్యాం ప్రసాద్ రెడ్డి, చంద్రమౌళి, సీఎంవో కార్యదర్శి స్మితా సభర్వాల్, ఓఎస్డీ శ్రీధర్ దేశ్‌పాండే, నీటి పారుదల శాఖ సీనియర్ ఇంజనీర్లు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన కొత్త ప్రాజెక్టుపై విస్తృతంగా చర్చించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టదలచిన ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు భంగకరం కాబట్టి, దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై వెంటనే కృష్ణా వాటర్ మేనేజ్‌మెంట్ బోర్డులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఫిర్యాదు చేయాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సంప్రదించకుండానే ఉమ్మడి ప్రాజెక్టు అయిన శ్రీశైలం నీటి విషయంలో నిర్ణయం తీసుకోవడం, అపెక్స్ కమిటీ ఆమోదం లేకుండా కొత్త ప్రాజెక్టు నిర్మాణం తలపెట్టడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేసిన తప్పిదాలుగా సీఎం పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టును అడ్డుకోవడానికి రాజీలేని ధోరణి అవలంభిస్తామని స్పష్టం చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి రోజుకు మూడు టీఎంసీల చొప్పున నీటిని లిఫ్టు చేసే విధంగా కొత్త ఎత్తిపోతల పథకం చేపట్టడానికి నిర్ణయించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, దీనికి సంబంధించి జీవో కూడా విడుదల చేసిందని, ఇది మంచి పరిణామం కాదన్నారు.
“గతంలో ఉన్న వివాదాలను, విబేధాలను పక్కన పెట్టి రెండు రాష్ట్రాల రైతుల ప్రయోజనాలు కాపాడడమే లక్ష్యంగా నదీ జలాలను వినియోగించుకుందామని తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు స్నేహహస్తం అందించింది. బేసిన్లు, బేషజాలు లేకుండా నీటిని వాడుకుందామని నేనే చొరవ చూపించాను. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కనీసం తెలంగాణ ప్రభుత్వాన్ని సంప్రదించకుండా శ్రీశైలంలో నీటిని లిఫ్టు చేయడానికి ఏకపక్షంగా కొత్త పథకం ప్రకటించడం అత్యంత బాధాకరం. పరస్పర సహకారంతో నీటిని వాడుకుందామనే స్ఫూర్తికి ఇది విఘాతం కలిగించింది. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగితే రాజీపడే ప్రసక్తే లేదు. ఏపీ తలపెట్టిన కొత్త ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుని తీరడమే లక్ష్యంగా న్యాయపోరాటం చేస్తాం’’ అని సిఎం కేసీఆర్ ప్రకటించారు.
కృష్ణా నదిలో రాష్ట్రాల వాటాను తేల్చే విషయంలో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌లో చాలా జాప్యం జరుగుతున్నందున, సత్వర న్యాయం కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. గోదావరి నది నికర జలాల్లో తెలంగాణ రాష్ట్రానికి ఉన్న 950 టీఎంసీల నీటిని వాడుకోవడానికి వీలుగా ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతున్నదని, తెలంగాణకు ఇంకా నీటి అవసరం ఉందని, తాగు, పారిశ్రామిక అవసరాలకు, విద్యుత్ ప్లాంట్లకు నీరు కావాలని వ్యాఖ్యానించారు. అందువల్ల గోదావరి మిగులు జలాల్లో తెలంగాణకు 600 టీఎంసీలను కేటాయించాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని కూడా అధికారులను ఆదేశించారు. రోజుకు రెండు టీఎంసీల నీటిని లిఫ్టు చేయడానికి ఉద్దేశించిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని సత్వరం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.