మాట వినకుంటే షూట్ ఎట్ సైట్ : సీఎం కేసీఆర్
దిశ, న్యూస్ బ్యూరో: కరోనా కట్టడిపై మరింత కఠినంగా వ్యవహరించ తప్పదని ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించారు. ప్రభుత్వం చెప్పేదాన్ని ప్రజలు పెడచెవిన పెడితే తూటాలకు పని చెప్పాల్సి వస్తుందని, అవసరమైతే ఆర్మీని రంగంలోకి దింపి కనిపిస్తే కాల్చివేత నిర్ణయం తీసుకోక తప్పదని హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లో సాయంత్రం ఆరు గంటల తర్వాత దుకాణాలు మూతపడాల్సిందేనని, రోడ్లపై ఒక్కరు కూడా కనిపించడానికి వీల్లేదని అన్నారు. లాక్‌డౌన్ నుంచి కర్ఫ్యూ దిశగా వెళ్తున్నామన్నారు. క్వారంటైన్ కేంద్రాల్లో ఉన్నవారు రోడ్లమీదకు వస్తున్నందున […]
దిశ, న్యూస్ బ్యూరో:
కరోనా కట్టడిపై మరింత కఠినంగా వ్యవహరించ తప్పదని ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించారు. ప్రభుత్వం చెప్పేదాన్ని ప్రజలు పెడచెవిన పెడితే తూటాలకు పని చెప్పాల్సి వస్తుందని, అవసరమైతే ఆర్మీని రంగంలోకి దింపి కనిపిస్తే కాల్చివేత నిర్ణయం తీసుకోక తప్పదని హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లో సాయంత్రం ఆరు గంటల తర్వాత దుకాణాలు మూతపడాల్సిందేనని, రోడ్లపై ఒక్కరు కూడా కనిపించడానికి వీల్లేదని అన్నారు. లాక్‌డౌన్ నుంచి కర్ఫ్యూ దిశగా వెళ్తున్నామన్నారు. క్వారంటైన్ కేంద్రాల్లో ఉన్నవారు రోడ్లమీదకు వస్తున్నందున వారి పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకోవాల్సిందిగా కలెక్టర్లను ఆదేశించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు లాక్ డౌన్ అమలవుతున్నా రాత్రిపూట మాత్రం కర్ఫ్యూ విధిస్తున్నామన్నారు. రోడ్ల మీద విధుల్లో పోలీసులు, వైద్య సిబ్బంది లాంటివారే కనిపిస్తున్నారు తప్ప ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు మాత్రం కనిపించడంలేదని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆపత్కాల సమయంలో ఆదుకుంటారన్న ఉద్దేశంతో ఓట్లు వేసి ఎమ్మెల్యే దగ్గరి నుంచి పంచాయతీ వార్డు మెంబరు వరకు ప్రజలు ఎన్నుకున్నారని, ఇలాంటి సమయంలో వారు రోడ్లమీదకు రావడం ఒక సామాజిక బాధ్యత అని, వెంటనే రంగంలోకి దిగాలన్నారు.
ప్రజా ప్రతినిధులేమైపోయారు?
కలరా, ప్లేగు లాంటి మహమ్మారిలనే తరిమికొట్టిన మనకు కరోనా ఒక లెక్కే కాదని, కానీ ప్రజల సంపూర్ణ సహకారం, ప్రజా ప్రతినిధుల సామాజిక బాధ్యత కలిసినప్పుడే ఇది సాధ్యమవుతుందన్నారు. ప్రజా ప్రతినిధులు గత రెండు వారాలుగా ఏమైపోయారో అర్థం కావడంలేదని సీఎం విస్మయం వ్యక్తం చేశారు. ఆపద సమయాల్లో ప్రజలకు చేరువకావాల్సిన ప్రజా ప్రతినిధులు కంటికి కూడా కనిపించకపోవడం ఆవేదన కలిగిస్తోందని అన్నారు. వైద్యారోగ్య, వ్యవసాయ, పట్టణాభివృద్ధి మంత్రులు మినహా మిగిలిన మంత్రులంతా వారివారి జిల్లాల్లో పర్యటించాలని, ఎమ్మెల్యేలు వారివారి నియోజకవర్గాల్లో, సర్పంచ్‌లు పంచాయతీల్లో తిరిగి ప్రజల మధ్యనే ఉండాలని అన్నారు. సింగిల్ విండో, ఎంపీటీసీ, జెడ్పీటీసీ… ఇలా వివిధ స్థాయిల్లో ప్రజా ప్రతినిధులుగా ఉన్నవారు ప్రజల మధ్యనే ఉండాలని స్పష్టం చేశారు. పోలీసు, రెవెన్యూ సిబ్బందితో సమన్వయం చేసుకోవాలన్నారు. మంత్రులు ఎట్టిపరిస్థితుల్లో హైదరాబాద్‌లో ఉండొద్దన్నారు. జీహెచ్ఎంసీలో ఉన్న 150 మంది కార్పొరేటర్లు రోడ్లమీదకు వచ్చి ప్రజల బాగోగులను తెలుసుకుని, వారి అవసరాలను తీర్చాలన్నారు.
ఆపద సమయంలో రోడ్ల మీదకు వచ్చేవారు ముందుగా డయల్ 100కు ఫోన్ చేస్తే మధ్యలో ఇబ్బందులు ఉండవన్నారు. వైద్య అవసరాల కోసం లేదా కుటుంబ సభ్యులు మృతి చెందితే మరో ఊరికి వెళ్ళడానికి పోలీసులకు తగిన సమాచారం ఇస్తే సహకారం లభిస్తుందన్నారు. అత్యవసర సేవల్లో ఉన్నవారి పట్ల పోలీసులు బాధ్యతగా వ్యవహరించి రోడ్లమీద ఆటంకాలు లేకుండా చూడాలని, మీడియా పట్లు దురుసుగా ప్రవర్తించవద్దని డీజీపీకి ముఖ్యమంత్రి సూచించారు. రెండు రోజులుగా అమలవుతున్న ‘లాక్ డౌన్’ పరిస్థితిపై అన్ని జిల్లాల ఎస్పీలు, కలెక్టర్లతో ముఖ్యమంత్రి ప్రగతి భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. కరోనా తాజా పరిస్థితిపై ఉన్నతస్థాయి కమిటీతోనూ నేరుగా సమీక్ష జరిపారు. అనంతరం మీడియా సమావేశంలో పై అంశాలను వివరించారు.
సరిహద్దుల్లో వాహనాలకు చివరి అవకాశం
రాష్ట్రంలో జనతా కర్ఫ్యూ తర్వాత ప్రకటించిన లాక్ డౌన్ నిర్ణయం సమయానికే చాలా వాహనాలు ఇతర రాష్ట్రాల నుంచి సరిహద్దులోని చెక్‌పోస్టుల దగ్గరకు చేరుకున్నాయని, అందులో నిత్యావసర వస్తువులు కూడా చాలా ఉన్నాయని, వాటి విషయంలో టోల్ టాక్స్‌ను రద్దు చేసి రాకపోకలకు ఒక అవకాశం కల్పిస్తున్నట్లు సీఎం తెలిపారు. రవాణా పోలీసు శాఖలు సమన్వయంతో దీన్ని పర్యవేక్షిస్తాయన్నారు. గ్రామాల్లో రైతులు వారి పంటలను అమ్ముకోడానికి సమీపంలో ఉన్న పట్టణాల వరకూ రావద్దని, ఎక్కడికక్కడే విక్రయించుకునేలా ఐకేపీ, మార్కెటింగ్ కమిటీలకు ఆదేశాలు ఇచ్చామని స్పష్టం చేశారు. రైతుల పంటలను వందశాతం ప్రభుత్వమే కనీస మద్దతు ధరకు కొంటుందని, ఆ డబ్బును వారి బ్యాంకు ఖాతాల్లోనే జమచేస్తుందన్నారు. రైతులకు ఆందోళన వద్దన్నారు. రైతు సమన్వయ సమితి సభ్యులుగా ఉన్నవారు యాక్టివ్ కావాలని సూచించారు.
గ్రామాల మధ్య కంచె మంచి పరిణామం
కరోనాపై సంపూర్ణ అవగాహనతో రైతులు వారివారి గ్రామాల్లో సరిహద్దుల దగ్గర ముళ్ళ కంచెలు, చెట్లు, రాళ్ళు అడ్డం పెడుతున్నారని, ఇది ఆహ్వానించదగిన పరిణామమన్నారు. లాక్ డౌన్ అంటేనే ఎక్కడివారు అక్కడ ఉండిపోవాలని, గ్రామాలు మంచి పని చేస్తున్నాయని, అన్ని గ్రామాలూ ఇలానే ఆలోచించాలన్నారు. గ్రామాల్లో వ్యవసాయ పనులు యధావిధిగా చేసుకోవచ్చని, అయితే మనుషుల మధ్య నాలుగు అడుగుల దూరం, గుంపులు గుంపులుగా వెళ్ళకుండా ఉండడం లాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పనులు కూడా యధావిధిగా జరగవచ్చని, అయితే జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని అన్నారు.
వైద్య, పోలీసు సిబ్బందిని పదిలంగా చూసుకోవాలి
కరోనా కట్టడిలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల అమలులో వైద్య, పోలీసు శాఖల సిబ్బంది శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారని అభినందించారు. వారి శక్తి నశించిపోయే పరిస్థితి వస్తే మొదటికే మోసం వస్తుందని, అందువల్ల వారికి తగిన విశ్రాంతి ఇస్తూ వారి సేవలను చాలా సంతృప్తికరంగా ఉపయోగించుకోవాల్సిన తరుణం ఇది అన్నారు. పాజిటివ్ కేసుల సంఖ్యను తగ్గించడంలో, కరోనా వ్యాప్తిని అరికట్టడంలో ప్రజలు స్వీయ నియంత్రణ పాటించి ఇళ్ళకే పరిమితం అయితే వైద్యులకు, పోలీసులకు ఆ మేరకు సాయం చేసినవారమవుతామని, ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలన్నారు. వైద్యులు మన అవసరానికి తగిన సంఖ్యలో దొరకరని, అందుబాటులో ఉన్నవారితోనే సరిపెట్టుకోవాల్సి ఉంటుంది కనుక ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలని కోరారు. పోలీసుల విషయంలోనూ అలానే ఆలోచించాలన్నారు.
క్వారంటైన్‌పై మరింత నిఘా
విదేశీ ప్రయాణం ముగించుకుని వచ్చినవారు క్వారంటైన్ కేంద్రాల్లో ఉండకుండా రోడ్లమీదకు రావడంపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి కేంద్రాల్లో ఉన్నవారిపై ప్రభుత్వ నిఘా కొనసాగుతోందని, ఎక్కడెక్కడ తిరుగుతున్నారో వివరాలు ఉన్నాయన్నారు. కరోనా ఒక్క దేశంతో మొదలై ఇప్పుడు 195 దేశాలకు పాకిందని, ఈ వ్యాధి సోకని దేశాలు చాలా తక్కువ అని అన్నారు. రాష్ట్రానికి ఇప్పటివరకు 19,313 మంది విదేశీ ప్రయాణం ముగించుకుని వచ్చినవారు ఉన్నారని, వీరందరి వివరాలు ప్రభుత్వం ధగ్గర ఉన్నాయన్నారు. నిర్మల్ ప్రాంతంలో క్వారంటైన్‌లో ఉండాల్సిన వ్యక్తి రోడ్డు మీదకు వచ్చి మూడు సార్లు తప్పించుకున్నాడని, ఇలాంటి పరిస్థితి రావద్దన్నారు. ప్రస్తుతం కరోనా లక్షణాలతో ‘అనుమానితులు’ 114 మంది ఉన్నారని, ఇందులో 88 మంది విదేశీ ప్రయాణం చేసి వచ్చినవారేనన్నారు. ఇందులో 35 మందికి లక్షణాలు బలంగా ఉన్నాయని, రిపోర్టులు వచ్చిన తర్వాత వారికి పాజిటివ్ ఉందో లేదో తెలిసిపోతుందన్నారు. ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారికి అమెరికా లాంటి దేశం కూడా ఆర్మీని రంగంలోకి దించాల్సి వచ్చిందని, మన తెలంగాణలో ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే ప్రజలు సహకరించాలన్నారు. మంచి పద్ధతిలో చెప్పి అర్థం చేయించాలనుకుంటున్నామని, వినకపోతే కఠినంగా వ్యవహరించక తప్పదన్నారు.
ప్రభుత్వానికి ఆదాయం పడిపోతున్నా, సంక్షేమ కార్యక్రమాలకు నిధులను సమకూర్చుకోడానికి ఇబ్బంది అవుతున్నా ప్రజల సంక్షేమం కోసం లాక్ డౌన్ నిర్ణయాన్ని తీసుకోక తప్పలేదని సీఎం వ్యాఖ్యానించారు. కరోనా మహమ్మారిని తరిమికొట్టడానికి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు ప్రజల నుంచి ఎంత ఎక్కువ సహకారం అందితే అంతటి విజయం సాధ్యమవుతుందన్నారు.
Tgas: Telangana, Curfew, Corona, Lockdown, Army, Shoot at sight, Police,