జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్
దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల్లో చావు దెబ్బ కొట్టిన కాషాయం పార్టీపై కారు పార్టీ గుర్రుగా ఉంది.. అదును కోసం ఎదురు చూస్తూ ఎలాగైనా తమ సత్తా ఏందో చూపించాలనుకుంటోంది.. బీజేపీతో అమీతుమీ తేల్చుకోవాలని రెఢీ అవుతోంది.. లేకపోతే భవిష్యత్‌లో రాష్ట్రంలోనే కాదు.. జనాల్లోనూ పలుచనవక తప్పదని భావిస్తోంది.. దీనికోసం కేసీఆర్ సర్ మళ్లీ ‘ఫెడరల్ ఫ్రంట్’నే లేవనెత్తారు.. అంతేకాదు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇప్పుడు రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతు తెలపడమే కాదు.. స్వయంగా ఢిల్లీ వెళ్లి […]
దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల్లో చావు దెబ్బ కొట్టిన కాషాయం పార్టీపై కారు పార్టీ గుర్రుగా ఉంది.. అదును కోసం ఎదురు చూస్తూ ఎలాగైనా తమ సత్తా ఏందో చూపించాలనుకుంటోంది.. బీజేపీతో అమీతుమీ తేల్చుకోవాలని రెఢీ అవుతోంది.. లేకపోతే భవిష్యత్‌లో రాష్ట్రంలోనే కాదు.. జనాల్లోనూ పలుచనవక తప్పదని భావిస్తోంది.. దీనికోసం కేసీఆర్ సర్ మళ్లీ ‘ఫెడరల్ ఫ్రంట్’నే లేవనెత్తారు.. అంతేకాదు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇప్పుడు రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతు తెలపడమే కాదు.. స్వయంగా ఢిల్లీ వెళ్లి దీక్ష చేస్తానంటున్నట్లు సమాచారం. ముందుండి నడిపిస్తూ మొదట వామపక్ష నేతలతో.. తర్వాత జాతీయ నేతలతో సంప్రదింపులు జరిపేందుకు సిద్ధంగా ఉన్నారు. రేపు జరిగే భారత్ బంద్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించడమే కాకుండా.. టీఆర్ఎస్ ప్రత్యక్షంగా ఈ బంద్‌లో పాల్గొననుంది. చూడాలి మరి రాష్ట్ర, జాతీయ స్థాయిలో ‘కమలం వర్సెస్ గులాబీ’ ఫైట్ ఎలా ఉంటుందో..! గులాబీ అధిపతి కాషాయ పార్టీని ఎలా ఎదుర్కొంటారో..!!
దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీతో రాజకీయంగా అమీతుమీ తేల్చుకోడానికే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిద్ధమయ్యారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలతోనే జాతీయ స్థాయి రాజకీయాల్లోకి ప్రవేశించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం హాట్ టాపిక్‌గా ఉన్న రైతాంగ అంశాలను, సమస్యలతోనే బీజేపీయేతర పార్టీలను ఏకం చేయాలనుకుంటున్నారు. ఒక్కతాటి మీదకు తేవాలనుకుంటున్నారు. నగరంలోని మగ్దూం భవన్ నుంచే ఆ యాక్టివిటీని మొదలుపెట్టనున్నారు. త్వరలో సీపీఐ రాష్ట్రస్థాయి నేతలతో భేటీ అయ్యి, ఆ తర్వాత సీపీఎం, ఇతర వామపక్ష పార్టీల నేతలతో సంప్రదింపులు జరపనున్నారు. అనంతరం జాతీయ స్థాయి నేతలతో చర్చించనున్నారు. దేశవ్యాప్తంగా బలమైన బీజేపీయేతర కూటమి ఏర్పాటుకు కేసీఆర్ నాయకత్వం వహించనున్నారు. 2018 ఎన్నికల సందర్భంగా ప్రస్తావించిన పెడరల్ ఫ్రంట్ ఎక్కడికిపోయిందని విమర్శలు వస్తున్న సమయంలో మరోసారి అలాంటి ఆరోపణలకు ఆస్కారం ఇవ్వకుండా ఈసారి రాజకీయంగా చావోరేవో తేల్చుకోవాలనే భావిస్తున్నట్లు టీఆర్ఎస్ వర్గాల ద్వారా తెలిసింది. దేశానికి అన్నం పెట్టే రైతుకు అన్యాయం జరిగితే సహించే ప్రసక్తే లేదన్న సందేశంతో రైతుల పక్షానే నిలబడాలనుకుంటున్నారు. రైతు సంఘాలు డిసెంబరు 8వ తేదీన (మంగళవారం) పిలుపునిచ్చిన ‘భారత్ బంద్’కు సంపూర్ణ మద్దతు ప్రకటించడమే కాకుండా టీఆర్ఎస్ ప్రత్యక్షంగా ఈ బంద్‌లో పాల్గొననుంది. తెలంగాణలో సంపూరణ బంద్ నిర్వహించి కేంద్రానికి గట్టి సందేశాన్నే ఇవ్వాలనుకుంటోంది. ఎలాగూ కేంద్రం నుంచి అదనంగా ఎలాంటి నిధులూ రావడంలేదు కాబట్టి పోరాడడమే ఉత్తమమనే అభిప్రాయానికి కేసీఆర్ వచ్చినట్లు తెలిసింది.
పైచేయి కోసం టీఆర్ఎస్, బీజేపీ ఎత్తుకు పై ఎత్తులు..
ఢిల్లీలో రెండు వారాలుగా నిరసనలు, ఆందోళనలు చేస్తున్న రైతు సంఘాల ప్రతినిధులతో రెండు దఫాలు చర్చలు జరిపిన కేంద్ర ప్రభుత్వం తుది విడత చర్చల కోసం సోమవారం సిద్ధమవుతోంది. మూడు చట్టాల్లో కొన్ని సవరణలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. అది ఇంకా స్పష్టం కాకముందే రైతుల సంఘాల ‘భారత్ బంద్’కు టీఆర్ఎస్ మద్దతు ఇవ్వడం ద్వారా రైతుల పక్షాన, బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నట్లు స్పష్టం చేసింది. కానీ కేసీఆర్ ప్లాన్‌ను ముందే పసిగట్టిన కేంద్ర ప్రభుత్వం ఆ విషయంలో ఆయనకు మైలేజ్ రాకుండా చట్టాలకు సవరణలు చేయాలనుకుంటోంది. రైతు సంఘాల ప్రతినిధుల చర్చల అనంతరం కేంద్రం చేసే ప్రకటనను బట్టి టీఆర్ఎస్ తన తదుపరి వ్యూహం గురించి ఆలోచించనుంది. కేంద్రం నిజంగానే సవరణలు చేసినట్లయితే టీఆర్ఎస్ కారణంగానే తలొగ్గిందని ప్రచారం చేసుకోడానికి ఉపయోగించు కోవాలనుకుంటోంది.
చంద్రబాబులా మారకూడదని జాతీయ స్థాయిలోకి..
ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం రాష్ట్రానికి మాత్రమే పరిమితం అవుతారని, అధికారం కోల్పోయిన తర్వాత ఎలాంటి గుర్తింపు లేకుండా పార్టీకి మాత్రమే పరిమితం అవుతారన్నది అన్ని ప్రాంతీయ పార్టీల్లో కనిపిస్తున్నదే. పొరుగున ఉన్న చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నా ఇప్పుడు అధికారం చేజారిపోయిన తర్వాత కేవలం ఏపీకి మాత్రమే పరిమితమయ్యారు. ఇకపైన కేసీఆర్ అలా ఉండిపోరాదన్న ఉద్దేశంతో అధికారంలో ఉన్నా లేకున్నా జాతీయస్థాయి రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటూ ప్రత్యేక గుర్తింపు పొందాలనుకుంటున్నట్లు తెలిసింది. కేంద్రంతో ఘర్షణ వైఖరి తీసుకున్నట్లయితే ఏదో ఒక రూపంలో కక్షసాధింపు చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.. కాబట్టి దానికి సిద్ధమయ్యే జాతీయం వైపు కేసీఆర్ దృష్టి పెట్టినట్లు తెలిసింది. రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలను ఒకవైపు అడ్డుకుంటూనే మరోవైపు వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ బలమైన కూటమిని ఏర్పాటు చేయడం ద్వారా ఎప్పటికీ జాతీయ స్థాయి నాయకుడిగా మిగిలిపోవచ్చన్నది కూడా కేసీఆర్ ఆలోచనగా కనిపిస్తోంది. ఒకవేళ దర్యాప్తు సంస్థలను కేంద్రం రంగంలోకి దించినా బీజేపీకి వ్యతిరేకంగా నిలబడినందుకే జరుగుతున్నాయంటూ చెప్పుకోడానికి ఒక ఆసరా దొరుకుతుంది.
అవసరమైతే ఢిల్లీలో రైతులతో కలిసి దీక్ష..
దాదాపు రెండు వారాలుగా ఢిల్లీలో రైతులు గడ్డకట్టే చలిలో సైతం ఆందోళనలు చేస్తూ ఉన్నారు. వామపక్ష పార్టీలు మాత్రమే కాక పలు ప్రాంతీయ పార్టీలు కూడా రైతులకు సంఘీభావం తెలుపుతూ కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగడుతున్నాయి. తుది విడత చర్చల్లో సైతం రైతులకు ఉపశమనం కలగకపోతే ఆందోళనలు ఎలాగూ కొనసాగుతాయన్న అంచనాకు వచ్చిన కేసీఆర్ అవసరమైతే ఢిల్లీ వెళ్లి రైతులను స్వయంగా కలిసి వారికి సంఘీభావంగా రైతు దీక్ష నిర్వహించడంపైనా పార్టీలో అంతర్గత చర్చలు జరుగుతున్నాయి. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ, సమాజ్‌వాదీ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, ఆర్జేడీ, శిరోమణి అకాలీదళ్, సీపీఐ, సీపీఎం లాంటి మొత్తం డజనుకు పైగా పార్టీలు రైతుల పక్షాన ఉంటూ కేంద్రంపై ధ్వజమెత్తుతున్నాయి. ఇన్ని పార్టీలు కేంద్రానికి వ్యతిరేకంగా ఉన్నందున టీఆర్ఎస్ కూడా వాటి సరసన చేరి కేవలం వ్యవసాయ రంగంపై మాత్రమే కాక విద్య, వైద్యం, సాగునీరు, మౌలిక సదుపాయాలు తదితర పలు కీలక అంశాలపై బీజేపీ వైఖరిని కేసీఆర్ ఎండగట్టాలనుకుంటున్నారు. వీటన్నింటిపై బీజేపీని వ్యతిరేకిస్తున్న పార్టీలను కూటమిగా ఏర్పాటుచేయడానికి కేసీఆరే చొరవ తీసుకోనున్నారు.