పొలిటికల్ హాట్ టాపిక్.. సీఎం స్టాలిన్‌తో కేసీఆర్ భేటీ అందుకోసమేనా..?
దిశ, తెలంగాణ బ్యూరో : టీఆర్ఎస్ మళ్ళీ కాంగ్రెస్‌కు దగ్గరవుతున్నదా? యూపీఏలో చేరనున్నదా? బీజేపీకి వ్యతిరేక పార్టీలతో జత కట్టనున్నదా? మమతా బెనర్జీ ఫ్రంట్‌వైపు చూస్తున్నదా? కమలం పార్టీకి వ్యతిరేకంగా పావులు కదపనున్నదా? ఇలాంటి అనేక సందేహాల నడుమ ఇప్పుడు స్టాలిన్‌తో కేసీఆర్ భేటీ కావడం సరికొత్త చర్చకు దారితీసింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుతున్నట్లు సంకేతాలను పంపిన టీఆర్ఎస్ ఇప్పుడు స్టాలిన్ ద్వారా తన వంతు ప్రయత్నాలను మొదలుపెట్టిందనే ఊహాగానాలకు అవుననే సమాధానమే వస్తున్నది. తమిళనాడు […]
దిశ, తెలంగాణ బ్యూరో : టీఆర్ఎస్ మళ్ళీ కాంగ్రెస్‌కు దగ్గరవుతున్నదా? యూపీఏలో చేరనున్నదా? బీజేపీకి వ్యతిరేక పార్టీలతో జత కట్టనున్నదా? మమతా బెనర్జీ ఫ్రంట్‌వైపు చూస్తున్నదా? కమలం పార్టీకి వ్యతిరేకంగా పావులు కదపనున్నదా? ఇలాంటి అనేక సందేహాల నడుమ ఇప్పుడు స్టాలిన్‌తో కేసీఆర్ భేటీ కావడం సరికొత్త చర్చకు దారితీసింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుతున్నట్లు సంకేతాలను పంపిన టీఆర్ఎస్ ఇప్పుడు స్టాలిన్ ద్వారా తన వంతు ప్రయత్నాలను మొదలుపెట్టిందనే ఊహాగానాలకు అవుననే సమాధానమే వస్తున్నది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా డీఎంకేకు మద్దతు, సహకారం ఇచ్చిన టీఆర్ఎస్ ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నపార్టీలకు దగ్గర కావడం మరింత బలాన్ని చేకూరుస్తున్నది. శ్రీరంగం ఆలయానికి కుటుంబ సమేతంగా వెళ్ళిన ముఖ్యమంత్రి కేసీఆర్.. తమిళనాడు సీఎం స్టాలిన్‌తో మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు భేటీ కానున్నారు. గతంలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చర్చల్లో భాగంగా కరుణానిధితో భేటీ అయ్యారు. ఆ తర్వాత తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలప్పుడు స్టాలిన్‌ను కలిశారు. మళ్లీ ఇప్పుడు ముఖ్యమంత్రుల స్థాయిలో తొలిసారి భేటీ అవుతున్నారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలన్నీ ఒక కూటమిగా ఏర్పడడానికి రాజకీయ చర్చలు జరుగుతున్న సమయంలో వీరిద్దరి భేటీ ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది. స్టాలిన్ మాత్రం ఈ భేటీ తర్వాత రాజకీయపరంగా ఎలాంటి స్టేట్‌మెంట్స్ ఇవ్వడానికి సుముఖంగా లేరని డీఎంకే వర్గాలు పేర్కొన్నాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ప్రాంతీయ పార్టీలను కూడగట్టి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు కేసీఆర్ మూడేళ్ల క్రితం ఒక ప్రయత్నం చేశారు. అది విఫల ప్రయోగంగానే మిగిలిపోయింది. ఇప్పుడు మళ్లీ అలాంటి ప్రయత్నానికి మమతా బెనర్జీ శ్రీకారం చుట్టారు.
ఇప్పటికే కొన్ని పార్టీల నేతలతో ఆమె భేటీ అయ్యారు. ప్రత్యక్షంగా అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ నేతృత్వంలోని కూటముల్లో భాగస్వామి కాకుండా స్వతంత్రంగా ఉన్న టీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్‌తో అడుగులు వేయడానికి సిద్ధపడుతున్నట్లు చర్చలు జరుగుతున్నాయి. తెలంగాణ ఏర్పాటుకు ముందు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదనే విమర్శలు వెల్లువెత్తిన సమయంలో స్టాలిన్ సహకారాన్ని కోరుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం యూపీఏ కూటమిలో డీఎంకే భాగస్వామిగా ఉన్నందున ఈ దిశగా కేసీఆర్ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు వార్తలు వెలువడుతున్నాయి.
స్థానిక సంస్థల ఎన్నికలే అడ్డు!
త్వరలో తమిళనాడులో 21 మున్సిపల్ కార్పొరేషన్లకు, 152 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నందున కాంగ్రెస్, వామపక్షాలను దూరం చేసుకోవడానికి డీఎంకే సుముఖంగా లేదని, అందువల్ల యూపీఏ కూటమిని కాదని ప్రాంతీయ పార్టీలతో ఏర్పడే ప్రత్యామ్నాయ ఫ్రంట్ ఆలోచనలు లేవని డీఎంకే నాయకుడొకరు వ్యాఖ్యానించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సేలం, కోయంబత్తూరు జిల్లాల్లో డీఎంకే పెద్దగా సీట్లు సాధించనందున కార్పొరేషన్ ఎన్నికల్లో గెలవాలని పట్టుదలగా ఉన్నది. వామపక్షాలు, కాంగ్రెస్ మద్దతు లేకుండా విజయం సాధ్యం కాదన్న ఉద్దేశంతో ఇప్పటికిప్పుడు యూపీఏ కూటమికి వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయం తీసుకోడానికిగానీ, పొలిటికల్ స్టేట్‌మెంట్లు ఇవ్వడానికిగానీ స్టాలిన్ సిద్ధంగా లేరని ఆ పార్టీ నేతలే చెప్తున్నారు.
కాంగ్రెస్‌కు దగ్గరయ్యేందుకేనా?
స్టాలిన్‌తో కేసీఆర్ జరుపనున్న రాజకీయ చర్చలపై ఆసక్తి నెలకొన్నది. బీజేపీతో అమీతుమీ అంటున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ అండ కోసం పాకులాడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి డీఎంకే నమ్మకమైన మిత్రపక్షంగా ఉన్నందున స్టాలిన్ ద్వారా కేసీఆర్ తన ప్రయత్నాలను సఫలం చేసుకునే వ్యూహంలో భాగమే ఇప్పుడు వీరిద్దరి మధ్య మీటింగ్ అనే వార్తలూ వినిపిస్తున్నాయి. ఢిల్లీ స్థాయిలో కాంగ్రెస్ నేతృత్వంలో వివిధ విపక్ష పార్టీలు గతంలో ఎన్ని సమావేశాలు నిర్వహించినా అందులో పాల్గొనని టీఆర్ఎస్ తొలిసారి పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా హాజరైంది. కాంగ్రెస్‌కు దగ్గరవుతున్నట్లు సంకేతాలను పంపింది. ఇప్పుడు దానికి కొనసాగింపుగానే స్టాలిన్‌తో మీటింగ్ కోసం కేసీఆర్ చెన్నై వెళ్లారనే అనుమానం బలపడుతున్నది.
శ్రీరంగంలో ప్రత్యేక పూజలు..
కుటుంబ సమేతంగా శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయానికి చేరుకున్న కేసీఆర్ బృందానికి అర్చకులు వేద మంత్రోచ్చారణల నడుమ పూర్ణకుంభ స్వాగతం పలికారు. తిరుచ్చి జిల్లాకు చేరుకున్న ఆయనకు మంత్రి నెహ్రూ, కలెక్టర్ శివరాసు స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో కేసీఆర్ కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. రెండేళ్ల క్రితం ఈ ఆలయాన్ని దర్శించుకున్నానని, ఇప్పుడు రెండోసారి వచ్చానని, చాలా సంతోషంగా ఉందని కేసీఆర్ తెలిపారు. తమిళనాడు డీఎంకే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రావడం ఇదే తొలిసారి అని, ముఖ్యమంత్రి స్టాలిన్‌తో భేటీ కానున్నట్టు మీడియాకు తెలిపారు. కేసీఆర్ వెంట ఆయన సతీమణి శోభ, కుమారుడు కేటీఆర్, కోడలు శైలిమ, మనుమడు, మనుమరాలు, ఎంపీ సంతోష్, బంధువులు ఉన్నారు.