కేంద్ర చట్టాలకు కేసీఆర్ జై..!
కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ పరోక్ష మద్దతు తెలిపారు. ఇకపైన గ్రామాలలో కొనుగోలు కేంద్రాలు ఉండవని ప్రకటించారు. మార్కెట్ యార్డులలోనే అమ్మకాలు, కొనుగోళ్లు జరుగుతాయన్నారు. పంటకు ఎక్కడ ఎక్కువ ధర వస్తే అక్కడే అమ్ముకోవచ్చని రైతులకు సూచించారు. వానాకాలం సీజన్లో అమలు చేసిన నియంత్రిత సాగు విధానానికి స్వస్తి చెప్పారు. యాసంగి నుంచి ఇష్టమైన పంట వేసుకోవచ్చన్నారు. రైతు వేదికలు, రైతుబంధు సమన్వయ సమితులు తగిన సూచనలు, సలహాలు ఇస్తాయన్నారు. వ్యవసాయం మీద […]
కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ పరోక్ష మద్దతు తెలిపారు. ఇకపైన గ్రామాలలో కొనుగోలు కేంద్రాలు ఉండవని ప్రకటించారు. మార్కెట్ యార్డులలోనే అమ్మకాలు, కొనుగోళ్లు జరుగుతాయన్నారు. పంటకు ఎక్కడ ఎక్కువ ధర వస్తే అక్కడే అమ్ముకోవచ్చని రైతులకు సూచించారు. వానాకాలం సీజన్లో అమలు చేసిన నియంత్రిత సాగు విధానానికి స్వస్తి చెప్పారు. యాసంగి నుంచి ఇష్టమైన పంట వేసుకోవచ్చన్నారు. రైతు వేదికలు, రైతుబంధు సమన్వయ సమితులు తగిన సూచనలు, సలహాలు ఇస్తాయన్నారు. వ్యవసాయం మీద ప్రగతిభవన్లో ఆదివారం సీఎం సమీక్ష నిర్వహించారు.
దిశ, తెలంగాణ బ్యూరో: “కరోనా నేపథ్యంలో రైతులు నష్టపోవద్దనే మానవతా దృక్పథంతో ప్రభుత్వం గ్రామాలలోనే సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేసి పంటలను కొనుగోలు చేసింది. ప్రతిసారి అలాగే చేయడం సాధ్యం కాదు. ప్రభుత్వం వ్యాపార సంస్థ కాదు. రైస్ మిల్లరో, దాల్ మిల్లరో కాదు. కొనుగోళ్లు, అమ్మకాలు ప్రభుత్వ బాధ్యత కాదు. వచ్చే ఏడాది నుండి కొనుగోలు కేంద్రాలు ఉండవు. కొత్త అగ్రి చట్టాలు కూడా రైతులు తమ పంటలను ఎక్కడైనా అమ్ముకోవచ్చని చెబుతున్నాయి. కాబట్టి ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు” అని ముఖ్యమంత్రి పేరిట ఓ ప్రకటన విడుదల అయ్యింది. దాని ప్రకారం.. వ్యవసాయ మార్కెట్లలో అమ్మకాలు, కొనుగోళ్లు సక్రమంగా, పద్ధతి ప్రకారం నిర్వహించాలని సీఎం సూచించారు. రైతులంతా ఒకేసారి తమ పంటను మార్కెట్కు తీసుకురాకుండా వంతుల ప్రకారం తీసుకురావాలని పేర్కొన్నారు. రైతుబంధు సమితులు, మార్కెట్ కమిటీలు, వ్యవసాయ విస్తరణాధికారులు సమన్వయంతో వ్యవహరించి ఏ గ్రామానికి చెందిన రైతులు ఎప్పుడు మార్కెట్కు సరుకులు తీసుకురావాలో నిర్ణయించాలని చెప్పారు. ఇందుకోసం రైతులకు టోకెన్లు ఇవ్వాలన్నారు. దీనిని పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు.
భారీ నష్టమైనా భరించాం
తెలంగాణ ఆవిర్భవించినప్పటి నుంచి వివిధ రకాల పంటల కొనుగోలుతో సుమారు 7,500 వేల కోట్ల నష్టం జరిగిందని ప్రభుత్వం అంచనా వేసింది. వరి, మక్కలు, జొన్నలు, కందులు, శనగలు, మినుములు, పొద్దుతిరుగుడు తదితర పంటలు కొనుగోలు చేసినందున ఈ నష్టం వచ్చిందని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. రైతుల నుంచి మద్దతు ధరకు కొనుగోలు చేసినప్పటికీ ఆ పంటలకు మార్కెట్లో డిమాండ్ లేకపోవడంతో తక్కువ ధరకు అమ్మాల్సి వచ్చిందని తెలిపారు. ఏటా ఇదే పరిస్థితి తలెత్తుతున్నదని చెప్పారు. ధాన్యం కొనుగోలుతోనే రూ.3,935 కోట్ల నష్టం వచ్చిందని పేర్కొన్నారు. మక్కలతో రూ.1547.59 కోట్లు, జొన్నలతో రూ.52.78 కోట్లు, కందులతో రూ.413.48 కోట్లు, ఎర్రజొన్నలతో రూ.52.47 కోట్లు, మినుములతో రూ.9.23 కోట్లు, శనగలతో రూ.108.07 కోట్లు, పొద్దుతిరుగుడుతో రూ.14.25 కోట్ల నష్టం వచ్చిందని అధికారులు వివరించారు. హమాలీ, నిర్వహణా ఖర్చులు వీటికి అవనమని ముఖ్యమంత్రి దృష్ఠికి తెచ్చారు.
ఇకపై రైతులకు పూర్తి స్వేచ్ఛ
వానాకాలం సీజన్లో నియంత్రిత సాగును ప్రయోగాత్మకంగా అమలు చేశారు. సన్న బియ్యం పండించిన రైతులకు సంతృప్తి లేకుండాపోయింది. ఇక నుంచి పంటల విషయంలో రైతులకే పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది రైతు ఏ పంట వేయాలో మార్గదర్శకాలు ఇవ్వకపోవడమే మంచిదని అనుకుంటోంది. నియంత్రిత సాగు విధానం అవసరం లేదు. రైతులు ఏ పంట వేయాలో వారే నిర్ణయం తీసుకోవాలి. ఎక్కడ అమ్ముకుంటే మంచి ధర వస్తుందో అక్కడే అమ్ముకోవాలి. రైతు వేదికల నిర్మాణం జరుగుతున్నది. రైతులు, వ్యవసాయ అధికారులు ఎప్పటికప్పుడు సమావేశం కావాలి. స్థానిక పరిస్థితులు, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా అక్కడే నిర్ణయాలు తీసుకోవాలి. మద్దతు ధర వచ్చేందుకు అనువైన వ్యూహం రూపొందించుకోవాలి అనే అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది.
వ్యవసాయ సిబ్బందిపై పనిభారం
“తెలంగాణలో వ్యవసాయం బాగా విస్తరిస్తున్నది. వ్యవసాయ శాఖ అనేక పనులు నిర్వహించాల్సి వస్తున్నది. అధికారులపై ఇతర బాధ్యతలు ఎన్నో ఉన్నాయి. రైతులకు ఏటా రెండుసార్లు పంటసాయం అందించే పనులను చూడాలి. రైతు బీమాను పకడ్బందీగా అమలు చేయాలి. సకాలంలో నాణ్యమైన, కల్తీలేని విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు అందేలా చూడాలి. కల్తీలను, నకిలీలను అరికట్టాలి. వ్యవసాయదారులకు ఆధునిక, సాంకేతిక విజ్ఞానాన్ని అందించాలి. వ్యవసాయ విస్తరణ పనులు చేయాలి.. ఇలా వ్యవసాయ శాఖ చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి అని సీఎం పేర్కొన్నారు.
అవన్నీ యథాతథంగా ఉంటాయి
రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్ యథావిధిగా కొనసాగుతాయని సీఎం స్పష్టం చేశారు. రైతుబంధు తొలుత ఎకరానికి సీజన్లో రూ. 4000 చొప్పున మాత్రమే ఇచ్చామని, ఆ తర్వాత దాన్ని రూ. 5,000 కు పెంచామని గుర్తుచేశారు. రైతు బీమా ప్రారంభించినపుడు రూ.630 కోట్ల కిస్తీ మాత్రమే చెల్లించాల్సి వచ్చేదని, చాలామంది రైతులు తమ కుటుంబ సభ్యులందరి పేర భూమిని రిజిస్టర్ చేయించడంతో సంఖ్య పెరిగి ప్రీమియం రెట్టింపైందన్నారు. ప్రభుత్వం ఈ పథకం కింద ఏడాదికి రూ.1,144 కోట్లు కట్టాల్సి వస్తున్నదన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం ఈ పథకాన్ని కొనసాగించాలనే నిర్ణయించుకుందన్నారు. ఉచిత విద్యుత్ కూడా కొనసాగుతుందని పేర్కొన్నారు.
మరిన్ని పరిశోధనలు జరగాలి
వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా మరిన్ని పరిశోధనలు జరగాలని సీఎం ఆకాంక్షించారు. కొత్త వంగడాలను సృష్టించాలన్నారు. రైతుబంధు సమితులు, రైతు వేదికల వినియోగం, సకాలంలో విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచడం, రైతులకు వ్యవసాయ సాగులో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం తదితర అంశాలపై విస్తృత చర్చ జరిగింది. సమావేశంలో మంత్రులు కేటీఆర్, నిరంజన్ రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు, జనార్దన్ రెడ్డి, వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ ప్రవీణ్ రావు, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి, ఏడీఏ విజయ్ కుమార్, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.