బీజేపీ గెలవద్దు.. ఆరు నూరైనా మనమే గెలవాలి

దిశ, తెలంగాణ బ్యూరో: నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించడంతో త్వరలో జరిగే ఆ నియోజకవర్గ ఉప ఎన్నికపై అన్ని పార్టీలూ ఇప్పటి నుంచే దృష్టిపెట్టాయి. అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టాలో కూడా పార్టీల నేతలు చర్చించుకుంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ఈ నియోజకవర్గం సిట్టింగ్ అయినందున ఆరు నూరైనా గెలవాలని, దుబ్బాక లాంటి పరిస్థితి తలెత్తరాదని భావిస్తున్నారు. అక్కడ టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకోవడం కోసం స్వయంగా రంగంలోకి దిగనున్నారు. ఆయన డైరెక్షన్‌లో కేటీఆర్ కార్యాచరణ […]

Update: 2020-12-06 22:31 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించడంతో త్వరలో జరిగే ఆ నియోజకవర్గ ఉప ఎన్నికపై అన్ని పార్టీలూ ఇప్పటి నుంచే దృష్టిపెట్టాయి. అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టాలో కూడా పార్టీల నేతలు చర్చించుకుంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ఈ నియోజకవర్గం సిట్టింగ్ అయినందున ఆరు నూరైనా గెలవాలని, దుబ్బాక లాంటి పరిస్థితి తలెత్తరాదని భావిస్తున్నారు. అక్కడ టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకోవడం కోసం స్వయంగా రంగంలోకి దిగనున్నారు. ఆయన డైరెక్షన్‌లో కేటీఆర్ కార్యాచరణ చేపట్టనున్నారు. హుజూర్‌నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో అన్నీ తానై వ్యవహరించినట్లుగానే ఇప్పుడు సాగర్ ఉప ఎన్నికలో సైతం ఆయనకే బాధ్యత అప్పజెప్పాలని కేసీఆర్ భావిస్తున్నారు.

ఈ నియోజకవర్గంలో కేసీఆర్ సైతం ఒకటి రెండు సార్లు పర్యటించి బహిరంగసభలు నిర్వహించే అవకాశంపైనా చర్చలు జరుగుతున్నాయి. దుబ్బాక ఫాలో అప్‌గా బీజేపీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా బలం పెంచుకున్నందున నాగార్జునసాగర్ విషయంలో అది పునరావృతం కాకూడదని, ఆ పార్టీకి అడ్డుకట్ట వేయాలని భావిస్తున్నారు. సిట్టింగ్ స్థానం కాబట్టి దాన్ని నిలబెట్టుకోవాలని, దీటైన అభ్యర్థిని నిలబెట్టే అవకాశం ఉంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇన్​చార్జిలను నిలబెట్టినా ఆశించిన ప్రయోజనం రాకపోవడంతో ఈసారి స్వయంగా కేసీఆరే ఇక్కడి ప్రచారంపై దృష్టి పెట్టినా హైదరాబాద్ నుంచే పర్యవేక్షించనున్నారు.

హాలియాకు డిగ్రీ కళాశాల మంజూరు

ఉపఎన్నికలో గెలవాలన్న పట్టుదలతో దీర్ఘకాలంగా పెండింగ్ అంశాలపై సీఎం దృష్టి పెట్టారు. హాలియా మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను మంజూరు చేశారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేయాల్సిందిగా అధికారులను ఆదివారం ఆదేశించారు. స్వయంగా ముఖ్యమంత్రే వెళ్లి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. జానారెడ్డి సుదీర్ఘకాలం పాటు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించినా, ఇప్పుడు టీఆర్ఎస్ ప్రాతినిధ్యం వహిస్తున్నా పెద్దగా అభివృద్ధికి నోచుకోలేదన్న అసంతృప్తి ప్రజల్లో ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఉప ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ రాకముందే అభివృద్ధి పనులు మంజూరై నిర్మాణం మొదలుకావాలని సీఎం లక్ష్యంగా పెట్టుకున్నారు.

మైనర్ ఎత్తిపోతల పథకాలకు నిధులు..

దామరచర్ల మండలం కేశవాపురం సమీపంలో మూసీ నదిపై కొండ్రపోలు దగ్గర మైనర్ ఎత్తిపోతల పథకానికి నిధుల మంజూరుకు సంబంధించి పరిపాలనా అనుమతులు ప్రభుత్వం జారీ చేసింది. సుమారు 5870 ఎకరాలకు సాగునీరు అందేలా రూ.75.93 కోట్లను విడుదల చేస్తున్నట్లు సాగునీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇదే నియోజకవర్గంలోని నెల్లికల్లు దగ్గర సుమారు 4175 ఎకరాలకు సాగునీరు అందించే విధంగా రూ. 72.16 కోట్లను విడుదల చేయనున్నట్లు మరో ఉత్తర్వులో పేర్కొన్నారు.

బీజేపీ ఆర్టీఐతో ప్రభుత్వంలో కదలిక..

నాగార్జున సాగర్ నియోజకవర్గంలో గెలుపొందాలని లక్ష్యంగా పెట్టుకున్న జిల్లా బీజేపీ నాయకులు ఈ నియోజకవర్గానికి తెలంగాణ ఏర్పడిన తర్వాత విడుదల చేసిన నిధులు, మంజూరైనవి, ఖర్చు చేసినవి లాంటి అనేక అంశాలతో సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశారు. అప్రమత్తమైన అధికారులు ఆయా శాఖల ఉన్నతాధికారులకు ఈ సమాచారాన్ని చేరవేశారు. చివరకు ఇది సీఎం కార్యాలయం వరకు వెళ్లి ఆగమేఘాల మీద ఒక్కో పెండింగ్ పనిని పూర్తిచేయడంపై దృష్టి పెట్టింది. అందులో భాగమే హాలియాలో డిగ్రీ కళాశాల, పలు మండలాల్లోని పొలాలకు సాగునీరు అందించే విధంగా ఎత్తిపోతల పథకాలు, కాల్వల నిర్మాణం లాంటివాటికి నిధులను మంజూరు చేయడం.

గెలుపుతో బీజేపీ దూకుడుకు అడ్డుకట్ట..

సీఎం సొంత జిల్లా అయిన సిద్దిపేటలోని దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ గెలవడం టీఆర్ఎస్‌ను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ దెబ్బ నుంచి కోలుకోకముందే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సైతం టీఆర్ఎస్ తన పాత ప్రతిష్టను కోల్పోవడంతో ఇక బ్రేక్ వేయక తప్పదని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో నాగార్జునసాగర్‌లో గెలుపొందాల్సిందేననే పట్టుదలతో ఉన్నారు. అందుకే ఇప్పటి నుంచే ఆ నియోజకవర్గంపై దృష్టి పెట్టి సిట్టింగ్ స్థానంలో గెలుపుకోసం ప్లాన్ రూపొందిస్తున్నారు. బీజేపీ దూకుడు జీహెచ్ఎంసీతోనే ఆగిపోవాలని, అది నాగార్జునసాగర్, ఆ తర్వాత ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లకు, ఎమ్మెల్సీ ఎన్నికలకు వ్యాపించకుండా చూడాలనుకుంటున్నారు. టీఆర్ఎస్ శ్రేణుల్లో నైతిక స్థైర్యం పెంచడంతో పాటు రాష్ట్రంలో బీజేపీ వ్యాప్తిని వీలైనంతగా తగ్గించేందుకు కేసీఆర్ వ్యూహరచన చేస్తున్నారు.

Tags:    

Similar News