జిల్లా, మండల పరిషత్‌లకు నిధులు : కేసీఆర్
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రస్తుతం గ్రామ పంచాయతీలకు ఇస్తున్నట్లుగానే ఇకపైన జిల్లా, మండల పరిషత్‌లకు సైతం ప్రభుత్వం నిధులను మంజూరు చేస్తుందని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. రానున్న బడ్జెట్లోనే స్పష్టమైన కేటాయింపులు చేస్తామన్నారు. స్థానిక సంస్థలను బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ వివిధ శాఖల అధికారులతో సోమవారం చర్చించిన సందర్భంగా పై ప్రకటన చేశారు. గ్రామీణాభివృద్ధిలో వీటి పాత్ర క్రియాశీలం చేస్తామని, నిధులతో పాటు నిర్దిష్టమైన విధులను కూడా అప్పగిస్తామన్నారు. […]
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రస్తుతం గ్రామ పంచాయతీలకు ఇస్తున్నట్లుగానే ఇకపైన జిల్లా, మండల పరిషత్‌లకు సైతం ప్రభుత్వం నిధులను మంజూరు చేస్తుందని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. రానున్న బడ్జెట్లోనే స్పష్టమైన కేటాయింపులు చేస్తామన్నారు. స్థానిక సంస్థలను బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ వివిధ శాఖల అధికారులతో సోమవారం చర్చించిన సందర్భంగా పై ప్రకటన చేశారు. గ్రామీణాభివృద్ధిలో వీటి పాత్ర క్రియాశీలం చేస్తామని, నిధులతో పాటు నిర్దిష్టమైన విధులను కూడా అప్పగిస్తామన్నారు. జిల్లా, మండల పరిషత్‌లకు ఎలాంటి బాధ్యతలు అప్పగించాలో సంబంధిత అధికారులు సూచనలు చేస్తారని, వాటిపై జిల్లా పరిషత్ చైర్పర్సన్లతో తానే స్వయంగా చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు.
మండల, జిల్లా స్థాయి అధికారుల అనుమతుల అవసరం లేకుండానే, గ్రామ పంచాయతీలు వాటికి కేటాయించిన నిధులను సంపూర్ణంగా వినియోగించుకునే అధికారం కొత్త చట్టం ద్వారా లభించిందని, దీన్ని సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీలకు ఆర్థిక సంఘమే నిధులను నేరుగా మంజూరు చేస్తున్నదని, గ్రామ పంచాయతీలకు నెలకు రూ. 308 కోట్లు, మున్సిపాలిటీలకు నెలకు రూ. 148 కోట్ల చొప్పున విడుదల చేస్తున్నదని, దీంతో నిధుల కొరత లేదన్నారు. ఈ కారణంగానే పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు సంతృప్తికరంగా అమలవుతున్నాయన్నారు. గ్రామాల్లో ట్రాక్టర్లు, డంపు యార్డులు, నర్సరీలు, వైకుంఠధామాలు సమకూరాయన్నారు.ఇకపై ఇదే తరహాలో జిల్లా పరిషత్, మండల పరిషత్‌లకు కూడా ప్రత్యేకంగా ఆర్థిక సంఘం నిధులు విడుదలవుతాయని వివరించారు. గ్రామ పంచాయతీలు వాటి నిధులను, గ్రామ అవసరాలను తీర్చుకోడానికి సంపూర్ణంగా వినియోగించుకునే హక్కు ఉన్నదని, ఎవరి జోక్యమూ అవసరం లేదని, ఈ విషయంలో అధికారులు మరోసారి స్పష్టత ఇవ్వాలని సీఎం నొక్కిచెప్పారు.
ఈ సమావేశంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, కమిషనర్ రఘునందన్ రావు, డిప్యూటీ కమిషనర్ రామారావు, సీఎం కార్యదర్శి స్మితా సభర్వాల్, ప్రభుత్వ విప్‌లు గువ్వల బాలరాజు, బాల్క సుమన్, ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, దుర్గం చిన్నయ్య, దివాకర్ రావు, శంకర్ నాయక్, హర్షవర్థన్ రెడ్డి, ఆదిలాబాద్ మాజీ జడ్పీ చైర్ పర్సన్ సత్యనారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.