కొత్త మెడికల్ కాలేజీల క్లాసులు షెడ్లలోనే..

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో కొత్తగా ఉనికిలోకి వస్తాయనుకుంటున్న ఏడు మెడికల్ కాలేజీల నిర్మాణానికి గ్రహణం పట్టింది. ప్రభుత్వం నెలకొల్పాలనుకుంటున్న ఏడు కొత్త మెడికల్ కాలేజీల భవనాలను వెంటనే నిర్మించాలని రోడ్లు భవనాల శాఖకు ప్రభుత్వం బాధ్యతలను అప్పజెప్పింది. నవంబరులో ఎన్ఎంసీ (నేషనల్ మెడికల్ కమిషన్) ఇన్‌స్పెక్షన్ ఉన్న నేపథ్యంలో ఇప్పటికిప్పుడు ఆ భవనాలను నిర్మించడం సాధ్యం కాదని ఆ శాఖ ఇంజినీర్లు చేతులెత్తేశారు. ప్రభుత్వానికి కూడా ఇదే చెప్పారు. ఇప్పటివరకు మెడికల్ కాలేజీలను నిర్మించిన […]

Update: 2021-08-11 19:35 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో కొత్తగా ఉనికిలోకి వస్తాయనుకుంటున్న ఏడు మెడికల్ కాలేజీల నిర్మాణానికి గ్రహణం పట్టింది. ప్రభుత్వం నెలకొల్పాలనుకుంటున్న ఏడు కొత్త మెడికల్ కాలేజీల భవనాలను వెంటనే నిర్మించాలని రోడ్లు భవనాల శాఖకు ప్రభుత్వం బాధ్యతలను అప్పజెప్పింది. నవంబరులో ఎన్ఎంసీ (నేషనల్ మెడికల్ కమిషన్) ఇన్‌స్పెక్షన్ ఉన్న నేపథ్యంలో ఇప్పటికిప్పుడు ఆ భవనాలను నిర్మించడం సాధ్యం కాదని ఆ శాఖ ఇంజినీర్లు చేతులెత్తేశారు. ప్రభుత్వానికి కూడా ఇదే చెప్పారు. ఇప్పటివరకు మెడికల్ కాలేజీలను నిర్మించిన అనుభవం తమకు లేదని, పైగా రానున్న మూడు నెలల వ్యవధిలోనే ఏడు కాలేజీల భవనాలను, ఇతర నిర్మాణాలు పూర్తిచేయడం సాధ్యం కాదని ఇంజినీర్లు వివరించారు.

మరో ప్రత్యామ్నాయం లేని పరిస్థితుల్లో ప్రభుత్వం కూడా ఏమీ చేయలేక కొత్త కళాశాలలను ప్రస్తుతానికి తాత్కాలిక షెడ్లలోనే ఏర్పాటు చేసి కనీస సౌకర్యాలను సమకూర్చుకోవాలని వైద్యశాఖకు సూచించింది. అలాంటి టెంపరరీ షెడ్లను నిర్మించి ఇవ్వడానికి రోడ్లు భవనాల శాఖ ఇంజినీర్లు సంసిద్ధత వ్యక్తం చేశారు. ల్యాబొరేటరీలు, తరగతి గదులు, ప్రాక్టికల్ రూమ్‌లు, మెడికల్ పరికరాల స్టోరేజ్ లాంటి ఏర్పాట్లను మాత్రం టీఎస్ ఎంఎస్ఐడీసీ (తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెలవప్‌మెంట్ కార్పొరేషన్) ఆధ్వర్యంలోనే ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఆ ప్రకారం ఫస్టియర్ తరగతులను సంవత్సరం పాటు షెడ్లలోనే నిర్వహించుకోవాలంటూ వైద్యారోగ్యశాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. టీఎస్ ఎంఎస్ఐడీసీ అధికారులు కూడా లేబొరేటరీలు, ప్రాక్టికల్ రూమ్ తదితరాలను అనుకున్న సమయానికి పూర్తి చేయగలమో లేదోనని ఆందోళన చెందుతున్నారు.

ఒక్కో వైద్యకళాశాల శాశ్వత భవన నిర్మాణాల కోసం నిబంధనల ప్రకారం 20 ఎకరాలు అవసరం. జగిత్యాల, మంచిర్యాలలో మినహా మిగిలిన ఐదు చోట్ల ఒకేచోట 20 ఎకరాల భూమి లభ్యమైంది. కానీ ఆ రెండు చోట్ల మాత్రం అది సాధ్యం కాలేదు. దీంతో భూసేకరణపై ఎక్కువ దృష్టి పెట్టాల్సి వస్తున్నదని వైద్యశాఖ అధికారులు ప్రభుత్వానికి వివరించారు. ఒకవేళ ఎన్‌ఎంసీ పర్మిషన్ ఇచ్చినట్లయితే 2022–23 విద్యా సంవత్సరంలో కొత్త కాలేజీల్లో అడ్మిషన్లు ప్రారంభమవుతాయి.

పాత కాలేజీల ప్రిన్సిపాల్‌కే నిర్వహణ బాధ్యతలు

కొత్త కాలేజీలకు ఎన్ఎంసీ పర్మిషన్ వచ్చేలా అన్ని ఏర్పాట్లూ చేయాలని పాత కాలేజీల ప్రిన్సిపాళ్లకు, వాటికి అనుబంధంగా ఉన్న బోధనాసుపత్రుల సూపరింటెంటెంట్లకు ప్రభుత్వం సూచించింది. ఎయిమ్స్ తరహాలో అన్ని వసతులు, మౌలిక సౌకర్యాలను, మ్యాన్ పవర్‌ను సమకూర్చుకోవాలని ఆదేశించింది. ప్రతీ వైద్య కళాశాలకు అనుబంధంగా ఖచ్చితంగా 300 పడకల ఆసుపత్రి అందుబాటులో ఉండాలనేది జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) నిబంధన. కానీ నూతనంగా నిర్మించబోయే సంగారెడ్డి, వనపర్తి, జగిత్యాల, మహబూబాబాద్‌, నాగర్‌కర్నూల్‌, కొత్తగూడెం, మంచిర్యాలల్లో మెడికల్ కాలేజీలకు అనుబంధంగా 300 పడకల ఆసుపత్రులు ప్రస్తుతానికి అందుబాటులో లేవు.

కేవలం సంగారెడ్డిలో మాత్రమే 400 పడకలతో కూడిన ప్రభుత్వ ఆసుపత్రి అందుబాటులో ఉంది. మిగిలిన వాటిలో నిబంధనలకు సరిపడా పడకలు లేవు. దీంతో ఆయా ప్రాంతాలకు సమీపంలోని ఏరియా ఆసుపత్రులను, మాతా శిశు సెంటర్లను అనుసంధానం చేయాలని వైద్యశాఖ భావిస్తున్నది. కానీ వాటిలో కూడా ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం సరిపడా పడకలు లేవు. దీంతో వీటిని 300 పడకల స్థాయికి పెంచడానికి సుమారు రూ.18 కోట్ల మేర ఖర్చవుతుందని వైద్యశాఖ అంచనా వేసి ప్రభుత్వానికి వివరించింది.

స్థానిక వ్యాధులపై ప్రత్యేక ఫోకస్

కొత్తగా ఏర్పాటు చేయబోతున్న మెడికల్ కాలేజీలను అధికారులు భిన్నమైన రీతిలో అందుబాటులోకి తేనున్నారు. ఏ ప్రాంతంలో ఏయే వ్యాధులతో ఎక్కువగా బాధపడుతున్నారో ఆ ఏరియాలో ఏర్పాటు చేసే మెడికల్ కాలేజీలో దానికి సంబంధించిన విభాగాన్ని పటిష్టం చేయనున్నారు. ఒక్కో కాలేజీలో 14 హెచ్ఓడీలను ఏర్పాటు చేస్తుండగా, వ్యాధులు తీవ్రత ఎక్కువగా ఉన్న విభాగానికి ఇద్దరు హెచ్ఓడీలను ఏర్పాటు చేయాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అధికారులు భావిస్తున్నారు.

కొత్తగా 1050 ఎంబీబీఎస్‌ సీట్లు

రాష్ట్రం నిర్ణయించినట్లుగా కొత్తగా 7 వైద్యకళాశాలలు ఏర్పాటైతే, ప్రస్తుతం ఉన్న తొమ్మిది కళాశాలల్లో ఉన్న 1640 ఎంబీబీఎస్‌ సీట్లకు తోడు అదనంగా 1050 అందుబాటులోకి వస్తాయి. ఒక్కో వైద్యకళాశాలలో ప్రస్తుతానికి 150 ఎంబీబీఎస్‌ సీట్ల చొప్పున నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఎన్‌ఎంసీ కొత్త వైద్యకళాశాలల దరఖాస్తులను వచ్చే నెల (సెప్టెంబరు) నుంచి స్వీకరించనున్నందున రాష్ట్రం తరఫున దరఖాస్తు ప్రక్రియ మొదలుకానున్నది.

ఒక్కో కళాశాలకు 97 పోస్టులు…

ఎన్‌ఎంసీ బృందం తనిఖీ సమయానికి ఒక్కో వైద్య కళాశాలలో 97 మంది ఉద్యోగులను భర్తీ చేయనున్నట్లు వైద్యశాఖ తెలిపింది. ఇందులో ఆరుగురు ప్రొఫెసర్లు, 17 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 31 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 17 మంది ట్యూటర్లు/డెమాన్‌స్ట్రేటర్లు, 26 మంది సీనియర్‌ రెసిడెంట్ల చొప్పున నియమించాల్సి ఉంటుందని పేర్కొన్నది. తొలి ఏడాది వైద్యవిద్యలో అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీకి సంబంధించిన బోధనా సిబ్బంది అవసరమని, వీరి నియామకం సవాలేనని, ప్రస్తుత ప్రభుత్వ వైద్య కళాశాలల్లోనూ ఈ విభాగాల్లో అధ్యాపకుల కొరత తీవ్రంగా ఉందని తెలిపింది. అందువల్లనే ఈ కళాశాలల్లో పనిచేయడానికి ముందుకు వచ్చే తాత్కాలిక/శాశ్వత వైద్యులకు 25 శాతం అదనపు ప్రోత్సాహక వేతనాన్ని అందజేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

Tags:    

Similar News