పోడు రణం.. ఆఫీసర్ల కాళ్లు మొక్కినా వినలేదు.. చివరకు..!

దిశ, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం బొల్లెపల్లి గ్రామంలో దళితులపై ఫారెస్ట్ అధికారులు దుశ్చర్యకు పాల్పడ్డారు. అనాదిగా సాగు చేసుకుంటున్న పోడు భూములు ఫారెస్ట్ పరిధిలోనివే అని మొక్కలు నాటేందుకు సిద్ధపడ్డారు. వివరాల్లోకి వెళితే గూడూరు మండలం బొల్లెపల్లి గ్రామ శివారులో 120 ఎకరాల భూమిని గత కొన్నేండ్లుగా, వంశపారంపర్యంగా దళితులు, గిరిజనులు సాగు చేసుకుంటున్నారు. ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటేందుకు అటవీశాఖకు టార్గెట్ కేటాయించారు. దీంతో […]

Update: 2021-07-26 10:49 GMT

దిశ, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం బొల్లెపల్లి గ్రామంలో దళితులపై ఫారెస్ట్ అధికారులు దుశ్చర్యకు పాల్పడ్డారు. అనాదిగా సాగు చేసుకుంటున్న పోడు భూములు ఫారెస్ట్ పరిధిలోనివే అని మొక్కలు నాటేందుకు సిద్ధపడ్డారు. వివరాల్లోకి వెళితే గూడూరు మండలం బొల్లెపల్లి గ్రామ శివారులో 120 ఎకరాల భూమిని గత కొన్నేండ్లుగా, వంశపారంపర్యంగా దళితులు, గిరిజనులు సాగు చేసుకుంటున్నారు. ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటేందుకు అటవీశాఖకు టార్గెట్ కేటాయించారు. దీంతో ఫారెస్ట్ అధికారులు పోడు రైతుల సాగు భూములను స్వాధీనం చేసుకునేందుకు గత కొద్దిరోజుల నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆ భూముల చుట్టూ ట్రెంచ్ పనులు సైతం చేశారు. రైతులు పట్టుదలతో ఫారెస్ట్ అధికారులపై తిరుగుబాటు చేశారు.

ఈ క్రమంలో రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే శంకర్ నాయక్‌లు గూడూరు మండలంలో జరిగిన పలు ప్రభుత్వ కార్యక్రమాల్లో పోడు రైతుల జోలికి వెళ్లొద్దు అని ఫారెస్ట్ అధికారులకు వార్నింగ్‌ ఇచ్చారు. ఈ సంఘటనతో రైతులు.. తమ జోలికి వచ్చేవారు లేరని ఊపిరిపీల్చుకున్నారు. అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యే చెప్పిన కొన్ని రోజులు గడవకముందే మరోసారి ఫారెస్ట్ అధికారులు రైతుల భూముల్లోకి వెళ్లి చదును చేసి, మొక్కలు నాటారు. మా భూములు స్వాధీనం చేసుకోవద్దని ఫారెస్ట్ అధికారుల కాళ్ళ పై పడి ప్రాధేయపడ్డ కనికరం చూపలేదు.

ఈ క్రమంలోనే 80 ఎకరాలకు పైగా భూమిని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. మిగిలిన భూమిలో రేపు మొక్కలు నాటనున్నట్లు ఫారెస్ట్ అధికారులు ప్రకటించారు. ఒక్కసారిగా దళిత రైతులు ఫారెస్ట్, పోలీసులపై తిరుగుబాటు చర్యలకు పూనుకోగా ఎట్టకేలకు అధికారులు వెనుదిరిగారు. మహబూబాబాద్ జిల్లాలో పోడు రణం రోజురోజుకు ఉగ్రరూపం దాల్చుతుంది. అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఆదేశించినా ఫారెస్ట్ అధికారులు దాడులు ఆపకపోవడం పట్ల దళిత, గిరిజన రైతులు ప్రభుత్వ తీరు పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News