తోకముడిచిన ‘డ్రాగన్’.. వెనక్కి మళ్లిన చైనా బలగాలు
న్యూఢిల్లీ: సరిహద్దులో ‘డ్రాగన్’ తోకముడిచింది. కవ్వింపులను కట్టిపెట్టి యథాస్థానానికి ప్రయాణం కట్టింది. గాల్వాన్ లోయ పెట్రోల్ పాయింట్ 14 నుంచి సుమారు కిలోమీటరు మేరకు చైనా ట్రూపులు వెనక్కి మళ్లడంతో సుమారు 60రోజుల తర్వాత లడాఖ్‌లో ఏర్పడ్డ సరిహద్దు వివాదంలో తొలిసారిగా శాంతి సూచనలు కనిపించాయి. జూన్ 15న హింసాత్మక ఘటన చోటుచేసుకున్న గాల్వాన్ లోయలోని పెట్రోల్ పాయింట్(పీపీ) 14 నుంచి ఇరుదేశాల సైనికులు వెనక్కి మళ్లారు. సమస్యాత్మక ప్రాంతంలో వేసిన టెంట్లు, తాత్కాలిక నిర్మాణాలను చైనా […]
న్యూఢిల్లీ: సరిహద్దులో ‘డ్రాగన్’ తోకముడిచింది. కవ్వింపులను కట్టిపెట్టి యథాస్థానానికి ప్రయాణం కట్టింది. గాల్వాన్ లోయ పెట్రోల్ పాయింట్ 14 నుంచి సుమారు కిలోమీటరు మేరకు చైనా ట్రూపులు వెనక్కి మళ్లడంతో సుమారు 60రోజుల తర్వాత లడాఖ్‌లో ఏర్పడ్డ సరిహద్దు వివాదంలో తొలిసారిగా శాంతి సూచనలు కనిపించాయి. జూన్ 15న హింసాత్మక ఘటన చోటుచేసుకున్న గాల్వాన్ లోయలోని పెట్రోల్ పాయింట్(పీపీ) 14 నుంచి ఇరుదేశాల సైనికులు వెనక్కి మళ్లారు. సమస్యాత్మక ప్రాంతంలో వేసిన టెంట్లు, తాత్కాలిక నిర్మాణాలను చైనా ట్రూపులు కూల్చేసి అక్కడి నుంచి సుమారు కిలోమీటరు దూరం వెనక్కి వెళ్లినట్టు తెలిసింది. చైనా బలగాల ఉపసంహరణను గమనించిన తర్వాత భారత ట్రూపులు వెనక్కి వస్తున్నట్టు సమాచారం. ఇరుదేశాల సైనికుల మధ్య ఘర్షణలను నివారించేలా రెండు వైపులా బఫర్ జోన్‌లను ఏర్పాటు చేసుకున్నాయి. ఇరువైపుల నుంచి సమానదూరంలో ఈ బఫర్ జోన్లున్నాయి. గాల్వాన్‌తోపాటు హాట్‌స్ప్రింగ్స్ సెక్టార్‌లోని పీపీ 15, పీపీ 17ఏ లోనూ చైనా ట్రూపులు వెనక్కి వెళ్లడానికి సిద్ధమవుతున్నట్టు తెలిసింది. వాళ్లను తరలించడానికి కొన్ని వాహనాలు ఇంకా వస్తున్నట్టు తెలుస్తున్నదని ఓ సీనియర్ ప్రభుత్వాధికారి పేర్కొన్నారు. చైనా ట్రూపులతో ఎదురుబడ్డ సైనికుల చెంతకు కొన్ని ఆర్మీ బృందాలు వెళ్లాయని, అక్కడి పరిస్థితులపై త్వరలో సమగ్ర నివేదిక వస్తుందని వివరించారు. అయితే, గాల్వాన్‌లో మటుకు సైనిక బలగాల ఉపసంహరణ కొంతమేరకు జరిగిందని వెల్లడించారు. జూన్ 15న పీపీ 14 దగ్గర హింసాత్మక ఘటనలో కల్నల్ సహా 20 మంది భారత జవాన్లు వీరమరణం పొందగా, చైనా వైపునా కమాండర్ సహా పలువురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వద్ద వాతావరణం తీవ్రరూపం దాల్చింది. మే 5, 6వ తేదీల నుంచే ఘర్షణలు సాగుతున్నప్పటికీ జూన్ 15నాటి హింసాత్మక ఘటనతో ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి.
మిలిటరీ చర్చలకు అనుగుణంగానే!
సరిహద్దులో ఉద్రిక్తతలు సద్దుమణిగించడానికి ఇరుదేశాలు మిలిటరీ, దౌత్యమార్గాల్లో చర్చలు సాగించాయి. గతనెల 30న కార్ప్స్ కమాండర్ స్థాయి మూడో రౌండ్ చర్చలు 10గంటలకు పైనే సాగాయి. ఈ చర్చల్లో సమస్యాత్మక ప్రాంతం నుంచి బలగాల ఉపసంహరణకు అనుసరించాల్సిన విధానాలపై ప్రధానంగా దృష్టిపెట్టారు. సమస్యాత్మక ప్రాంతాల్లో తాత్కాలిక నిర్మాణాల కూల్చివేత, ఆర్మీ బలగాల ఉపసంహరణ, ఉపసంహరణ పరిశీలన(వెరిఫై) స్టెప్ బై స్టెప్ ప్రక్రియ ఈ నెల 5వ తేదీలోపు ముగించాలని ఈ చర్చల్లోనే ఇరుదేశాలు అంగీకరించాయి. ఈ అంగీకారానికి అనుగుణంగానే చైనా పీఎల్ఏ ఉపసంహరణను చేపట్టినట్టు తెలుస్తోంది. అయితే, అనుకున్నంత వేగంగా ఈ ప్రక్రియ సాగలేదని, గాల్వాన్ నది కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నదని, ఇది కూడా ఒక కారణం కావచ్చునని ఆ అధికారి వివరించారు. చైనా ట్రూపుల్లో కదలికలు ఈ నెల 5వ తేదీ సాయంత్రం నుంచే కనిపించాయని ఓ రిపోర్టు వెల్లడించింది. కాగా, ఈ టైమ్‌లైన్‌ను 10రోజులుగా పెట్టుకుని పురోగతిని సమీక్షించాలని కేంద్ర హోం శాఖకు చెందిన ఒక అధికారి తెలిపారు. ఏదేమైనా ప్రాధాన్యమైన గాల్వాన్ ఏరియాలో మాత్రం సానుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయని వివరించారు.
రంగంలోకి అజిత్ దోవల్:
చైనా ట్రూపులు వెనక్కివెళ్లడానికి ముందు జాతీయ భద్రత సలహాదారు(ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్, చైనా విదేశాంగ మంత్రి, స్టేట్ కౌన్సిల్ వాంగ్ యీలు ఆదివారం కనీసం రెండు గంటలు వీడియో కాల్ మాట్లాడారు. సరిహద్దులో ఉద్రిక్తతలు సద్దుమణిగేలా వేగంగా చర్యలు తీసుకోవాలని, ఎల్ఏసీలో శాంతియుత వాతావరణం నెలకొనేలా వ్యవహరించాలని ఇరువురు అంగీకరించారు. దేశాధినేతల మధ్య కుదిరిన ఏకాభిప్రాయానికి అనుగుణంగా నడుచుకోవడానికి, విభేదాలు వివాదాలు కాకుండా జాగ్రత్తపడటానికి ఇరుదేశాల ప్రత్యేక ప్రతినిధులు అంగీకరించినట్టు కేంద్రం వెల్లడించింది. ఎల్ఏసీ యథాతథ స్థితిని గౌరవించాలని, ఏకపక్షంగా ఎటువంటి మార్పులను చేయరాదన్న షరతులపై ఏకాభిప్రాయనికి వచ్చారని తెలిపింది. సరిహద్దు నుంచి ఇరుపక్షాల సైన్యం త్వరితగతిన వెనక్కి వెళ్లి శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పేందుకు దోహదపడాలనీ భావించినట్టు వివరించింది. సరిహద్దు గుండా బలగాల ఉపసంహరణ ప్రక్రియను వేగవంతంగా చేపట్టేందుకూ సంసిద్ధతను వ్యక్తం చేసినట్టు కేంద్ర సర్కారు ఓ ప్రకటనలో పేర్కొంది. చైనా కూడా ఈ ఫోన్ కాల్ గురించిన ప్రకటన విడుదల చేసింది. అయితే, అందులో యథాతథ స్థితిని కాపాడే అంశాన్ని ప్రస్తావించకపోవడం గమనార్హం.
బలగాలను ఉపసంహరిస్తున్నాం: చైనా ధ్రువీకరణ
ఎల్ఏసీ నుంచి ఇరు దేశాల ట్రూపులు ఉపసంహరించడాన్ని చైనా ధ్రువీకరించింది. సరిహద్దులో ఉద్రిక్తతలు తగ్గించడానికి బలగాల ఉపసంహరణలో పురోగతి సాధించినట్టు చైనా విదేశాంగశాఖ తెలిపింది. చైనా బలగాలు వెనక్కి మళ్లాయని వెల్లడించింది. జూన్ 30న ఇరుదేశాల మిలిటరీ అధికారులు చర్చలు జరిపారు. గతరెండు చర్చల్లో కుదిరిన అంగీకారాన్ని అమలు చేస్తున్నట్టు విదేశాంగశాఖ ప్రతినిధి జావో లిజియన్ అన్నారు. భారత్ కూడా ఈ ఒప్పందాన్ని అమలు చేస్తుందని భావిస్తున్నట్టు తెలిపారు. సరిహద్దులో ఉద్రిక్తతలు పూర్తిగా సమసిపోయేవరకూ ఇరుదేశాలు మిలిటరీ, దౌత్య మార్గాల్లో చర్చలు కొనసాగించాలని అభిప్రాయపడ్డారు.