అమెరికాను వణికిస్తున్న చైనా విత్తనాలు.. వాటిలో ఏముంది?
ప్రపంచదేశాల మీద చైనా కొత్త రకం యుద్ధ విధానాలను అమలుచేస్తోందని ఎప్పట్నుంచో కథనాలు వెలువడుతున్నాయి. ఆ క్రమంలోనే కరోనా వైరస్‌ను చైనా జీవాయుధంగా ప్రవేశపెట్టిందని అనుమానాలు కూడా రేకెత్తాయి. ఇప్పుడు చైనా ఒక రకం యుద్ధవిధానాన్ని కూడా అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ, చైనా నుంచి పార్సిల్‌లో వస్తున్న కొన్ని విత్తనాలు మాత్రం ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికాను విపరీతంగా వణికిస్తున్నాయి. ఈ విత్తనాల పార్సిళ్లు అమెరికాలోని అన్ని రాష్ట్రాలకు వెళ్తున్నాయి. ఒకరకంగా […]
ప్రపంచదేశాల మీద చైనా కొత్త రకం యుద్ధ విధానాలను అమలుచేస్తోందని ఎప్పట్నుంచో కథనాలు వెలువడుతున్నాయి. ఆ క్రమంలోనే కరోనా వైరస్‌ను చైనా జీవాయుధంగా ప్రవేశపెట్టిందని అనుమానాలు కూడా రేకెత్తాయి. ఇప్పుడు చైనా ఒక రకం యుద్ధవిధానాన్ని కూడా అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ, చైనా నుంచి పార్సిల్‌లో వస్తున్న కొన్ని విత్తనాలు మాత్రం ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికాను విపరీతంగా వణికిస్తున్నాయి. ఈ విత్తనాల పార్సిళ్లు అమెరికాలోని అన్ని రాష్ట్రాలకు వెళ్తున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే అమెరికా పోస్టల్ శాఖ ఆఫీసుల్లో ఈ విత్తనాల ప్యాకెట్లే ఉన్నాయి. అయితే ఇవేవీ అమెరికన్లు ఆర్డర్ చేసిన విత్తనాలు కావు. అన్నీ సర్‌ప్రైజ్ పార్సిల్ పేరుతో వస్తున్న విత్తనాలు. వీటి మీద చైనా లేబుల్ ఉండటంతో అక్కడి నుంచే వస్తున్నాయని అమెరికా అధికారులు తేల్చేశారు. అంతేకాకుండా ఈ విత్తనాలను నాటవద్దని హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు.
ఇంతకీ ఈ విత్తనాల్లో ఏముంది?
విత్తనాలను చూసి ఇంతలా బెంబేలెత్తాల్సిన అవసరం ఏముందని కొందరు అనుకోవచ్చు. కానీ ఆ విత్తనాల ప్యాకెట్లు, అవి వస్తున్న తీరు, వాటి మీద రాసి ఉన్న లేబుల్, ప్రస్తుత ప్రాపంచిక పరిణామాల్లో చైనా పాత్రను లోతుగా విశ్లేషిస్తే ఒకింత భయం కలగడంలో ఆశ్చర్యం లేదు. అయితే ప్యాకెట్లు అందుకున్న వారు చెబుతున్న దాని ప్రకారం ఈ విత్తనాలు చూడటానికి సోరకాయ గింజల్లా ఉన్నాయట. అలాగే కొంతమందికి తోటకూర గింజలు, గుమ్మడి కాయ గింజల మాదిరిగా ఉన్న పార్సిళ్లు కూడా వచ్చాయని అధికారులు చెబుతున్నారు. మొదట ఈ విత్తనాల్లో వైరస్ ఉంటుందేమోననే అమెరికన్లు అనుమానించారు. అయితే దీని గురించి బొటానిస్ట్‌లు రంగంలోకి దిగి, కొన్ని ప్రయోగాలు చేసి ఆ విత్తనాలు నాటొద్దని హెచ్చరికలు చేశారు.
ఆ ప్రయోగాల్లో ఏం తేలింది?
విత్తనం నాటితే గానీ అందులో ఏముందో తెలియదు. కానీ నాటకుండానే ప్రమాదం కలుగుతుందని చెప్పేంతలా ఇందులో ఏముందని అందరికీ ప్రశ్నలు తలెత్తాయి. అందుకు సమాధానంగా ఆ విత్తనాలు ఇన్వేసివ్ స్పీసెస్ (దాడి చేసే జాతి మొక్కలు) అయ్యుండవచ్చని అవి నాటితే పిచ్చి మొక్కలు పెరిగి, స్థానికంగా ఉన్న మొక్కలను నాశనం చేసే అవకాశం ఉంటుందని బొటానిస్ట్ ఆలిసన్ పారెల్ వివరించారు. దాడి చేసే జాతి మొక్కలు వేగంగా అభివృద్ధి చెంది, స్థానికంగా పెరిగే మంచి మొక్కలకు హాని కలిగించి, పర్యావరణ సమతుల్యతను దారుణంగా దెబ్బతీస్తాయని పారెల్ తెలిపారు. గతంలో కూడా పర్పుల్ లూస్‌స్ట్రూఫ్, జపనీస్ హనీసకిల్, జపనీస్ బార్బెర్రీ, నార్వే మేపుల్, ఇంగ్లిష్ ఐవీ వంటి మొక్కల కారణంగా అమెరికన్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆ దాడి చేసే జాతి మొక్కలను తొలగించడానికి వందల మంది సిబ్బంది రంగంలోకి దిగారంటేనే వాటి ప్రభావాన్ని అర్థం చేసుకోవచ్చు.
నిజంగా చైనానే పంపిందా?
ఈ సర్‌ప్రైజ్ ప్యాకెట్‌లు ఇంటికి వస్తున్న తీరును గమనిస్తే, ఒకింత అనుమానం కలగకుండా మానదు. మీరు చెవిరింగులు గెలుచుకున్నారు, మీకు లాటరీ తగిలింది అంటూ కాల్ వచ్చి తర్వాత ఈ పార్సిళ్లు ఇళ్లకు వస్తున్నాయి. పైన లేబుల్ మీద చైనా అడ్రస్‌తో పాటు మాండరిన్ భాషలో ఏవో రాతలు ఉంటున్నాయి. పైన రాతలున్నా లోపల మాత్రం విత్తనాలే ఉంటున్నాయి. ఇలా అనుమానాస్పదంగా పార్సిళ్లు రావడం ఈ అనుమానాలకు ప్రధాన కారణం. అయితే ఈ విషయం గురించి చైనాను విచారిస్తే, అవి నకిలీ లేబుళ్లని, కావాలని ఎవరో తప్పుడు పుకార్లు పుట్టిస్తున్నారని ఎప్పటిలాగే తోసిపుచ్చుతోంది. నిజమెంతనే సంగతి పక్కనబెడితే, ఇలా విత్తనాలను యుద్ధాలకు వాడటమనేది నిజంగా చైనా వాళ్లు వాడగల తర్కమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.