వివాదాలకు కేరాఫ్‌గా బాసర ట్రిపుల్ ఐటీ
దిశ, ఆదిలాబాద్: సరస్వతి అమ్మవారి పుణ్యక్షేత్రం బాసరలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జి అండ్ టెక్నాలజీ అనుబంధ ట్రిపుల్ ఐటి మరోసారి వివాదాలకు వేదిక అవుతున్నది. గతంలో వివిధ కారణాలతో విద్యార్థుల ఆత్మహత్యలు, పోలీసు కేసులు, అక్రమ నియామకాలు వంటి ఆరోపణలతో బాసర ట్రిపుల్ ఐటి కీర్తి మసక బారింది. తాజాగా అసిస్టెంట్ రిజిస్ట్రార్ పదవి నియామకం పట్ల ఉద్యోగ, విద్యార్థి సంఘాల నుంచి వ్యతిరేకత వస్తున్నది. ఈ పదవి పాలనా విభాగంలో పని చేసే […]
దిశ, ఆదిలాబాద్: సరస్వతి అమ్మవారి పుణ్యక్షేత్రం బాసరలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జి అండ్ టెక్నాలజీ అనుబంధ ట్రిపుల్ ఐటి మరోసారి వివాదాలకు వేదిక అవుతున్నది. గతంలో వివిధ కారణాలతో విద్యార్థుల ఆత్మహత్యలు, పోలీసు కేసులు, అక్రమ నియామకాలు వంటి ఆరోపణలతో బాసర
ట్రిపుల్ ఐటి కీర్తి మసక బారింది. తాజాగా అసిస్టెంట్ రిజిస్ట్రార్ పదవి నియామకం పట్ల ఉద్యోగ, విద్యార్థి సంఘాల నుంచి వ్యతిరేకత వస్తున్నది. ఈ పదవి పాలనా విభాగంలో పని చేసే సీనియర్ అధికారులకే ఇవ్వాలన్న నిబంధన ఉంది. కానీ, ఆ నిబంధనలేవీ పాటించకుండా యాజమాన్యం ఆంధ్ర ప్రాంతానికి
చెందిన వ్యక్తికి కట్టబెట్టింది. దీంతో ఉద్యోగ సంఘాలు ఆ నియామకాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకు సిద్ధమవుతున్నాయి.
ఆయన్ను తొలగించాలని వినతులు..
నీళ్లు, నిధులు, నియామకాలు అన్న త్రయ నినాదంతో సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో..మళ్లీ ఆంధ్ర వారికి పెత్తనం ఏమిటని ట్రిపుల్ ఐటి ఉద్యోగ, విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. యూనివర్సిటీ నిబంధనల ప్రకారం పాలనా విభాగంలో పని చేసే సీనియర్ అధికారుల్లో ఒకరు అసిస్టెంట్ రిజిస్ట్రార్ కావాలి. కానీ, అకడమిక్ విభాగంలో పని చేసే వ్యక్తికి బాధ్యతలు అప్పగించారు. దీన్ని ట్రిపుల్ ఐటిలో పనిచేస్తున్న ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నిరసన కార్యక్రమాలకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఆ పదవి నుంచి ఆయన్ను తొలగించాలని కోరుతూ ఆర్జీయూకేటీ వైస్ చాన్సలర్‌కు వినతి పత్రం పంపారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పార్లమెంటు సభ్యుడు సోయం బాబురావు, ఎమ్మెల్యే విఠల్ రెడ్డికి కూడా వినతి పత్రాలను పంపినట్లు ఉద్యోగ సంఘాల నేత విజయ్ కుమార్ తెలిపారు. అనుభవంతో పాటు అర్హతలు కలిగి ఉన్న తెలంగాణ సీనియర్ అధికారులు ఉండగా ఆంధ్ర వ్యక్తికి రిజిస్ట్రార్ పదవి ఇవ్వడం ఏంటని సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు.
ఆయనపై అనేక ఆరోపణలు..
తాజాగా అసిస్టెంట్ రిజిస్ట్రార్ పదవిని చేపట్టిన వ్యక్తిపై గతంలో అనేక ఆరోపణలు ఉన్నాయి. కొన్ని కాంట్రాక్టు ఉద్యోగాల్లో అర్హత లేని వారికి ఉద్యోగాలు కట్టబెట్టారన్న విమర్శలు ఉన్నాయి. ట్రిపుల్ ఐటి ప్రాంగణంలో ఉన్న వైస్ చాన్స్‌లర్ వ్యక్తిగత విశ్రాంతి భవనాన్ని ఈ అధికారి తన బంధుమిత్రుల కోసం, సొంత అవసరాలకు వాడుకున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.
తీరుమారని యాజమాన్యం..!
బాసర ట్రిపుల్ ఐటి యాజమాన్యం తీరు మారడం లేదు. నవ్విపోదురుగాక… నాకేంటి సిగ్గు..! అన్నట్లుగా యాజమాన్యం పరిస్థితి తయారైంది. గతంలో అనేక ఆరోపణలు వెల్లువెత్తగా యాజమాన్యం ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పింది. కానీ, ఆ తర్వాత అదే తంతును కొనసాగించడం యజమాన్యానికి ఆనవాయితీగా మారిందని పలువురు అంటున్నారు. మెస్ నిర్వహణ మొదలుకొని కాంట్రాక్టు ఉద్యోగాల నియామకాల్లో అక్రమాలు జరిగాయని గతంలో అనేక ఫిర్యాదులు వచ్చాయి. గతంలో ఉన్న యూనివర్సిటీ అధికారులు అవలంభించిన మెతక వైఖరి కారణంగానే
అవకతవకలు జరిగాయని ఉద్యోగ సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. తాజాగా ఈ బాధ్యతలను చూస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి రాహుల్ బొజ్జా ఆధ్వర్యంలో యూనివర్సిటీ కొన్ని కఠిన నిర్ణయాలను తీసుకుంటూ వస్తున్నది. కానీ, అసిస్టెంట్ రిజిస్ట్రార్ నియామకం విషయంలో ఉన్నతాధికారులు సైతం
తప్పుదోవ పట్టించారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యూనివర్సిటీ యంత్రాంగం మళ్లీ పాత పంథాలోనే నడుస్తున్నదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఆందోళన కొనసాగిస్తాం:
ట్రిపుల్ ఐటిలో కీలకమైన అసిస్టెంట్ రిజిస్ట్రార్ పదవిని అర్హత లేని ఆంధ్ర వ్యక్తికి కట్టబెట్టడమేంటీ?.. ఆయన్ను తొలగించే దాకా ఆందోళన చేపడతాం. ఇప్పటికే వైస్ చాన్స్‌లర్‌కు ఫిర్యాదు చేశాం. స్పందన లేకపోతే ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతాం.
– త్రిపుల్ ఐటి ఉద్యోగ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి