కేసీఆర్ కేబినెట్.. ఒకరు ఔట్..? ఇద్దరు ఇన్..?

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దళిత వర్గాల మద్దతు లక్ష్యంగా అధికార పార్టీ నిర్ణయాలు తీసుకుంటోంది. ఇదే సమయంలో కేబినెట్​లో మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దళితుల అభివృద్ధి కోసం పలు పథకాలు ప్రవేశపెట్టుతున్నట్లు చెప్పుతున్న కేసీఆర్​.. ఆ సామాజికవర్గానికి చెందిన ఒక నేతకు కీలక పదవిని అప్పగించాలనుకుంటున్నారు. రైతుబంధు తరహాలోనే దళితబంధుకు ఒక బాధ్యుడిని నియమించడంతో పాటు మరో గౌరవప్రదమైన బాధ్యతను కూడా దళితులకు అప్పగించనున్నారు. ఒకేసారి […]

Update: 2021-08-10 23:35 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దళిత వర్గాల మద్దతు లక్ష్యంగా అధికార పార్టీ నిర్ణయాలు తీసుకుంటోంది. ఇదే సమయంలో కేబినెట్​లో మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దళితుల అభివృద్ధి కోసం పలు పథకాలు ప్రవేశపెట్టుతున్నట్లు చెప్పుతున్న కేసీఆర్​.. ఆ సామాజికవర్గానికి చెందిన ఒక నేతకు కీలక పదవిని అప్పగించాలనుకుంటున్నారు. రైతుబంధు తరహాలోనే దళితబంధుకు ఒక బాధ్యుడిని నియమించడంతో పాటు మరో గౌరవప్రదమైన బాధ్యతను కూడా దళితులకు అప్పగించనున్నారు. ఒకేసారి ఇద్దరు దళిత నేతలకు కేబినెట్​లో అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది. దీనిలో కేటీఆర్​ కోటరీకే ప్రాధాన్యత ఇస్తున్నారు.

ఒకరు ఔట్​

రాష్ట్ర మంత్రివర్గం నుంచి ఒక మంత్రికి ఉద్వాసన పలుకునున్నట్లు ప్రగతిభవన్​ నుంచే ప్రచారం జరుగుతోంది. గతంలో మంత్రి కేటీఆర్​ ఒత్తిడితో మంత్రివర్గంలోకి తీసుకున్న ఆయన్ను బయటకు పంపి, అదే జిల్లా నుంచి ఓ దళిత వర్గానికి చెందిన ఎమ్మెల్యేను మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్లు చెప్పుకుంటున్నారు. టీఆర్​ఎస్​ పార్టీ చాలా వీక్​గా ఉందని భావించే ఆ జిల్లా నుంచి ఒకే ఒక్క ఎమ్మెల్యేగా ఉన్న ఆయనకు మంత్రి పదవి ఇచ్చినా అక్కడా పార్టీకి ఫాయిదా లేదని గులాబీ బాస్​ భావిస్తున్నారు. ఆ జిల్లాకు చెందిన ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు టీఆర్​ఎస్​లో చేరడంతో కొంత బలం పెరిగింది. అయినప్పటికీ పార్టీ స్పీడ్​ అందుకోవడం లేదనే అభిప్రాయాలున్నాయి. ఇదే సమయంలో ఓ మాజీ మంత్రితో తరుచూ గొడవలతో పార్టీ శ్రేణుల్లో నిరుత్సాహం నెలకొంటోంది. దీంతో సదరు మంత్రికి ఉద్వాసన పలికి.. అదే జిల్లాకు చెందిన ఓ దళిత ఎమ్మెల్యేను కేబినెట్​లోకి తీసుకునేందుకు సిద్ధమైనట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ మార్పుతో రెండు విధాలుగా కలిసి వస్తుందని, దళితవర్గానికి ఇంకో మంత్రి పదవి ఇచ్చినట్లు ఉంటుందని భావిస్తున్నారు.

డిప్యూటీ సీఎంగా యూత్​ లీడర్​

మొదటి టర్ములో ఉప ముఖ్యమంత్రిగా దళిత ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి వ్యవహరించారు. కానీ రెండో టర్ములో మాత్రం డిప్యూటీ సీఎం బాధ్యతలు ఎవ్వరికీ అప్పగించలేదు. ప్రస్తుతం దళితుల ఉద్ధరణ అంశానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నందున డిప్యూటీ సీఎంగా ఒక దళిత నేతను నియమించే అవకాశాలున్నట్లు టీఆర్ఎస్ వర్గాల సమాచారం. గత వారం రోజుల నుంచి దీనిపై సమాలోచనలు చేస్తున్నట్లు పార్టీ నేతలు చెప్పుతున్నారు. దీనిపై సమయానుకూలంగా నిర్ణయం తీసుకుని ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. అయితే సీఎం కేసీఆర్​కు.. మంత్రి కేటీఆర్​కూ సన్నిహితంగా ఉండే విద్యార్థి లీడర్​, ఎమ్మెల్యేకు ఉప ముఖ్యమంత్రి పదవి దక్కే అవకాశాలున్నాయని టాక్.

అసెంబ్లీ ఎన్నికకు ముందే నిర్ణయం

హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక ముందు అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సీఎం కేసీఆర్ ఈ దిశగా కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్‌ను బర్తరఫ్ చేసిన తర్వాత ఆ స్థానాన్ని ఖాళీగానే ఉంచారు. ఇప్పుడు ఆ స్థానంలో ఒకరికి అవకాశం ఉన్నది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ స్థానంలో దళితులకే అవకాశం కల్పించి కీలక బాధ్యతలు అప్పజెప్పడంపైనే సీఎం ఫోకస్ పెట్టినట్లు తెలిసింది. మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన తర్వాత అధికార టీఆర్ఎస్ పార్టీకి, ముఖ్యమంత్రి తీసుకున్న ‘దళితబంధు‘ పథకానికి మద్దతు పలుకుతున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో దండోరా వేసి దళితబంధును ప్రచారం చేస్తానని కూడా ఇటీవల ప్రకటించారు. ఇంకా టీఆర్ఎస్‌లో చేరకపోయినప్పటికీ ఆ పార్టీకి మద్దతు ఇస్తున్నందున త్వరలో లాంఛన ప్రక్రియను పూర్తిచేసి దళిత బంధు బాధ్యతలను ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ఆయన మాత్రం తనతో అలాంటి చర్చలు జరగలేదని, ఆ విషయం తన గమనంలో కూడా లేదని క్లారిటీ ఇచ్చారు. ముఖ్యమంత్రి మనసులో ఏముందో తనకు తెలియదని బదులిచ్చారు.

ఎమ్మెల్సీలోనూ దళిత మహిళ..?

రాష్ట్రంలోని దళిత వర్గానికి చెందిన మహిళకు శాసనమండలి ఎమ్మెల్సీ కోటాలో అవకాశం కల్పించాలని టీఆర్​ఎస్​ అధినేత నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కొంతమంది పేర్లను ప్రస్తావించి పార్టీ ప్రతినిధుల నుంచి అభిప్రాయం తీసుకున్నట్లు పార్టీ నేతలు చెప్పుతున్నారు. అయితే ఎవరికి అవకాశం వస్తుందో ఇంకా స్పష్టంగా చెప్పడం లేదు.

విపక్షాలకూ బ్రేక్​

ప్రస్తుతం రాష్ట్రంలో దళిత బంధును ప్రకటించినా దానిపై విమర్శలే ఎక్కువ వస్తున్నాయి. దళిత ముఖ్యమంత్రి, మూడెకరాల భూమి, సబ్​ప్లాన్​ వంటి వాటిలో కేసీఆర్​ విఫలం కావడంతో ఆరోపణలు చేస్తున్నారు. ఇలాంటి ఆరోపణలకు చెక్​ పెట్టేందుకే కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో అటు ప్రతిపక్షాల విమర్శలకు చెక్​ పెట్టడమే కాకుండా.. ఇంకా అనుమానంగా చూస్తున్న దళిత వర్గాల మద్దతు కూడగట్టవచ్చనే అభిప్రాయంతో గులాబీ బాస్​ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దళిత వర్గానికి ఉప ముఖ్యమంత్రి, మంత్రి అవకాశం వస్తే ఈ వర్గాలు గంపగుత్తగా అధికార పార్టీకి జైకొట్టే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. మరోవైపు మాజీ ఐపీఎస్​ అధికారి ఆర్​ఎస్​ ప్రవీణ్​ కుమార్​ చేస్తున్న విమర్శలకు కూడా ఈ మార్పులతో బ్రేక్​ వేయవచ్చని భావిస్తున్నారు.

Tags:    

Similar News