చలివాగు ప్రాజెక్టు నిండింది.. పంట పొలాలకు సాగునీరు ఇవ్వరా..?

దిశ, పరకాల: చెరువు నిండా నీరు ఉన్నా కాలువలు పారకపోవడంతో శాయంపేట మండలం జోగంపల్లి గ్రామంలోని చలి‌వాగు ప్రాజెక్టు ఆయకట్టు రైతుల పంటలు ఎండి లబోదిబోమంటున్నారు. చలి వాగు ప్రాజెక్టు ద్వారా మూడు మండలాల్లోని సుమారు 15 గ్రామాలకు, 3600 ఎకరాలకు, అనధికారికంగా 2 వేల ఎకరాలకు నీరు అందుతోంది. హనుమకొండ జిల్లాలోనే అతి పెద్ద చెరువుగా పేరున్న చలివాగు ప్రాజెక్టు అధికారుల నిర్లక్ష్యం మూలంగా కాలువలు పూడిపోయాయి. కాలువల నిండా నాచు పేరుకుపోవడంతో పాటు తూములు […]

Update: 2021-11-03 07:13 GMT

దిశ, పరకాల: చెరువు నిండా నీరు ఉన్నా కాలువలు పారకపోవడంతో శాయంపేట మండలం జోగంపల్లి గ్రామంలోని చలి‌వాగు ప్రాజెక్టు ఆయకట్టు రైతుల పంటలు ఎండి లబోదిబోమంటున్నారు. చలి వాగు ప్రాజెక్టు ద్వారా మూడు మండలాల్లోని సుమారు 15 గ్రామాలకు, 3600 ఎకరాలకు, అనధికారికంగా 2 వేల ఎకరాలకు నీరు అందుతోంది. హనుమకొండ జిల్లాలోనే అతి పెద్ద చెరువుగా పేరున్న చలివాగు ప్రాజెక్టు అధికారుల నిర్లక్ష్యం మూలంగా కాలువలు పూడిపోయాయి. కాలువల నిండా నాచు పేరుకుపోవడంతో పాటు తూములు దెబ్బతిన్నాయి. దీంతో ఆయకట్టు పొలాలకు సాగునీరు అందడం ఇబ్బందిగా మారింది. పంటలపై పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి వచ్చే విధంగా కనిపించడం లేదని ఆ ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికైనా దేవాదుల అధికారులు స్పందించి కాలువలోని నాచు తొలగించి, తూములు సరిచేసి సెటర్లు వేయించాలంటున్నారు. లేనట్లయితే చివరి ఆయకట్టు వరకు నీరు అందక వందల ఎకరాల్లో పంట పొలాలు దెబ్బతినే అవకాశం ఉందని పలువురు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యేల దృష్టికి ఎన్నిసార్లు తీసుకుపోయినా స్పందించడం లేదంటూ ఆయకట్టు రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా స్థానిక ప్రజా ప్రతినిధులు చొరవ తీసుకొని దేవాదుల ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి సాగునీరు అందే విధంగా ఏర్పాట్లు చేయాలంటూ పలువురు ఆయకట్టు రైతులు కోరుతున్నారు. ఇక ఇదే విషయమై దేవాదుల ప్రాజెక్టు ఏఈని వివరణ కోరగా.. కాలువలు, తూములు సరిగ్గా లేని మాట వాస్తవమేనని, అందుకు సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపామని తెలిపారు. అనుమతులు రాగానే పనులు ప్రారంభిస్తామని తెలియజేశారు.

Tags:    

Similar News