కేంద్రం.. కానిచ్చేసింది..
– రాష్ట్రాల విజ్ఞప్తులపై మాత్రం స్పందన కరువు దిశ, న్యూస్ బ్యూరో: రాష్ట్రాలు ఎంత అడిగినా అప్పుల పరిమితి పెంచడానికి అనుమతివ్వని కేంద్ర ప్రభుత్వం తాను మాత్రం ముందు అనుకున్నదాని కన్నా రూ.4.2 లక్షల కోట్లు ఎక్కువ అప్పు తీసుకోవడానికి నిర్ణయించుకుంది. నిజానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను కేంద్రం ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కేవలం రూ.7.8 లక్షల కోట్లే ద్రవ్యలోటు అని అంచనా వేసి ఆ మేరకు అప్పులు తీసుకుంటామని వెల్లడించింది. అయితే, అనంతరం పరిస్థితులు మారి […]
– రాష్ట్రాల విజ్ఞప్తులపై మాత్రం స్పందన కరువు
దిశ, న్యూస్ బ్యూరో: రాష్ట్రాలు ఎంత అడిగినా అప్పుల పరిమితి పెంచడానికి అనుమతివ్వని కేంద్ర ప్రభుత్వం తాను మాత్రం ముందు అనుకున్నదాని కన్నా రూ.4.2 లక్షల కోట్లు ఎక్కువ అప్పు తీసుకోవడానికి నిర్ణయించుకుంది. నిజానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను కేంద్రం ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కేవలం రూ.7.8 లక్షల కోట్లే ద్రవ్యలోటు అని అంచనా వేసి ఆ మేరకు అప్పులు తీసుకుంటామని వెల్లడించింది. అయితే, అనంతరం పరిస్థితులు మారి దేశవ్యాప్తం లాక్‌డౌన్ అమలులోకి వచ్చింది. సుమారు రెండు నెలల నుంచి పూర్తిస్థాయిలో కొన్ని రోజులు, సడలింపులతో మరి కొన్ని రోజులు లాక్ డౌన్ కొనసాగుతుండటంతో దేశ ఆర్థిక వ్యవస్థ ఎక్కడికక్కడ స్తంభించిపోయిన విషయం తెలిసిందే. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయం పడిపోయి తమ తమ ఉద్యోగులకు అవి జీతాలివ్వలేని పరిస్థితి ఏర్పడింది. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్యానికి, సంక్షేమానికి క్షేత్రస్థాయిలో డబ్బు ఖర్చు పెట్టడానికి సరైన వనరులు లేక ఇబ్బందులు పడుతున్నది రాష్ట్ర ప్రభుత్వాలేనని స్పష్టంగా తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలే కరోనాను ప్రత్యక్షంగా ఎదుర్కోవాల్సి వస్తుండటం దీనికి కారణంగా చెప్పొచ్చు. తమకు సహాయం చేయాలని లేదంటే ఎఫ్‌ఆర్‌బీఎం చట్టంలో ఉన్న పరిమితికి మించి అప్పులు తీసుకునే వెసులు బాటు ఇవ్వాలని రాష్ట్రాలు ఎంత వేడుకున్నా వినని కేంద్రం తాను మాత్రం మరో రూ.4.2 లక్షల కోట్లు అప్పులు బాండ్లు అమ్మి తీసుకోవడానికి ఆర్బీఐతో సంప్రదించి నిర్ణయించుకోవడమే కాకుండా ద్రవ్యలోటును 6 శాతం దాకా పెంచుకునేందుకు సిద్ధపడింది. దీంతో ఈ ఏడాది కేంద్రం తీసుకునే మొత్తం అప్పులు ఏకంగా రూ.12 లక్షల కోట్లకు చేరనున్నాయి.
ఈ ఆర్థిక సంవత్సర మొదటి నెల ఏప్రిల్ మొత్తం లాక్‌డౌన్ పూర్తిస్థాయిలో అమలవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న జీఎస్టీ కలెక్షన్లు ఈ నెలలో 70 శాతానికి పైగా పడిపోయాయి. దీంతో ఒకపక్క కరోనాతో జరిగిన నష్టం నుంచి ఉపశమన ప్యాకేజీ, రాష్ట్రాల ఆరోగ్య శాఖలకు కరోనా ప్రత్యేక సహాయం, జీఎస్టీ పరిహారం, కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు రావాల్సిన వాటా తదితర చెల్లింపుల కోసం కేంద్రం ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచే ఆర్బీఐ వేదికగా బాండ్లు అమ్మి ద్రవ్యలోటు అప్పులు తీసుకోవడం ప్రారంభించింది. ఇలా తీసుకున్న అప్పుల నుంచే రాష్ట్రాలకు రూ.15వేల కోట్ల కరోనా ప్రత్యేక సహాయంతో పాటు దేశంలోని వివిధ రంగాల ప్రజలకు లక్ష డెబ్భై వేల కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించింది. లాక్‌డౌన్ సడలింపులు ఇచ్చినా దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటం, పూర్తిస్థాయి ఆర్థిక వ్యవస్థ ఇప్పట్లో అందుబాటులోకి వచ్చే పరిస్థితి లేకపోవడంతో కేంద్రం ద్రవ్యలోటు కింద తీసుకునే అప్పుల పరిమాణం పెంచుకోక తప్పలేదని తెలుస్తోంది. ముఖ్యంగా ముంబై, చెన్నై, హైదరాబాద్, అహ్మదాబాద్ లాంటి దేశ ఆర్థిక వ్యవస్థకు తద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఖజానాకు దన్నుగా ఉండే మెట్రో నగరాలు ఇప్పటికీ కరోనా కేసుల విషయంలో రెడ్‌జోన్‌లో ఉండటంతో ఆర్థిక వ్యవస్థకు ఎంతో కొంత ఉద్దీపన లేదా రాష్ట్ర ప్రభుత్వాలకు టైముకు పన్నుల వాటా, జీఎస్టీ పరిహారం సొమ్ములు చెల్లించవచ్చనే ఉద్దేశంతో ఆర్బీఐ సహకారంతో రూ.4.2 లక్షల కోట్లు అధికంగా ఓపెన్ మార్కెట్ నుంచి తీసుకోవడానికి డిసైడైనట్టు నిపుణులు విశ్లేషిస్తున్నారు. కొత్తగా తీసుకోనున్న అప్పులను ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమ, ద్వితీయార్థాలలో 65, 35 శాతాల చొప్పున కేంద్రం సేకరించనుంది. ఈ నెల 11 నుంచి సెప్టెంబర్ 30 వరకు ప్రతి వారం రూ.30వేల కోట్లు ఓపెన్ మార్కెట్ నుంచి బాండ్లు విక్రయించనుందని తెలుస్తోంది.
రాష్ట్రం ఎన్నిసార్లు అడిగినా స్పందించని కేంద్రం..
సాధారణ పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వానికి సొంతగానే రూ.12 వేల కోట్లు రావాల్సి ఉంటే ఏప్రిల్ నెలలో లాక్‌డౌన్‌తో కేవలం రూ.600 కోట్లే వచ్చాయని(కేంద్రం ఇచ్చినవి కాకుండా) సీఎం కేసీఆర్ చెప్పిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలే ఇచ్చే పరిస్థితే లేకుండా పోయిందని ఆయన విలేకరుల సమావేశాల్లో వాపోయారు. అయితే, తాము ఎన్నిసార్లు అడిగి ఎంత చెప్పి చూసినా కేంద్రం ప్రత్యేక సహాయం చేసే విషయంలో కనికరించడం లేదనీ, కనీసం ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలో చేసే అప్పులను పరిమితి పెంచి తీసుకోవడానికి అనుమతిచ్చేటట్లు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. హెలికాప్టర్ మనీ, క్వాంటిటేవ్ ఈజింగ్ పద్ధతులను కూడా ఆయన కేంద్రానికి సూచించారు. ఒక్క తెలంగాణ ఒక్క రాష్ట్రమే కాకుండా దేశంలోని ఇతర రాష్ట్రాలు కూడా కేంద్రం వైపు సాయం కోసం చూస్తున్న ప్రస్తుత తరుణంలో తన వరకు మాత్రం పరిష్కారం వెతుక్కొని రాష్ట్ర ప్రభుత్వాలకు ఎలాంటి ప్యాకేజీ ఇవ్వకుండా వ్యవహరించడం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని పలువురు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుత గడ్డు పరిస్థితుల్లో ఆర్బీఐ నుంచి అప్పుల రూపంలో తీసుకునే సొమ్మును జాగ్రత్తగా వాడకపోతే దేశం కనీసం 5 ఏళ్ల దాకా కోలుకోదనీ, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎలాంటి సహాయం చేసినా సంక్షేమం పేరిట వృథా చేసే అవకాశముందని మోడీ ప్రభుత్వం అంచనా వేస్తున్నట్టు పలువురు ఆర్థిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి పెంచి రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా బహిరంగ మార్కెట్ నుంచి ఎక్కువ అప్పులు తీసుకునే ఉపశమనం కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ఇవ్వనుందన్న వాదన మరోవైపు వినిపిస్తున్నది.