అదనపు కోటా సంగతేంటి?
దిశ, కరీంనగర్ సిటీ : కొవిడ్ సెకండ్ వేవ్ పంజాతో దేశంలోని పేద ప్రజలు అల్లాడుతున్నారు. వీరందరికీ రెండు నెలల పాటు ఉచితంగా రేషన్ ఇచ్చేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ అన్న యోజన పథకం కింద ఒక్కొక్కరికి 5 కిలోల బియ్యాన్ని మే, జూన్ నెలల్లో విడుదల చేస్తున్నట్లు ప్రధాన మంత్రి ప్రకటించారు. అయితే, జిల్లాలో మాత్రం ఉచిత బియ్యం విడుదల చేయలేదు. ఎప్పటిమాదిరిగా రాష్ట్ర ప్రభుత్వం అందించే రూపాయికి కిలో […]
దిశ, కరీంనగర్ సిటీ : కొవిడ్ సెకండ్ వేవ్ పంజాతో దేశంలోని పేద ప్రజలు అల్లాడుతున్నారు. వీరందరికీ రెండు నెలల పాటు ఉచితంగా రేషన్ ఇచ్చేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ అన్న యోజన పథకం కింద ఒక్కొక్కరికి 5 కిలోల బియ్యాన్ని మే, జూన్ నెలల్లో విడుదల చేస్తున్నట్లు ప్రధాన మంత్రి ప్రకటించారు. అయితే, జిల్లాలో మాత్రం ఉచిత బియ్యం విడుదల చేయలేదు. ఎప్పటిమాదిరిగా రాష్ట్ర ప్రభుత్వం అందించే రూపాయికి కిలో బియ్యం మాత్రమే లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నారు. ఇదేమిటని డీలర్లను అడిగితే అదనపు కోటా విడుదల చేయలేదని, ఎందుకు అని అధికారులనడిగితే సర్కారు నుంచి తమకు ఎటువంటి ఆదేశాలు రాలేదని స్పష్టం చేస్తుండగా, కేంద్ర ప్రభుత్వ నిర్ణయం రాష్ట్రంలో నిష్పలగా మారిందనే విమర్శలు భాజపా శ్రేణులనుంచి వస్తున్నాయి.
పోయినేడాది ఇదే సమయంలో కరోనా విలయతాండవం చేయగా దేశవ్యాప్తంగా లక్డౌన్ విధించిన విసయం తెలిసిందే. ఏప్రిల్ నుంచి 6 నెలల వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఉచిత బియ్యం పంపిణీ చేశాయి. ఈ ఏడాది కూడా రెండో దశలో కరోనా తీవ్రత అధికంగా ఉన్న నేపధ్యంలో మే, జూన్ మాసాల్లో ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన కింద ప్రతి పేద వాడికి 2 నెలల పాటు 5 కిలోల చొప్పున బియ్యం లేదా గోధుమలు సరఫరా చేస్తామని కేంద్రం ప్రకటించింది. అందుకనుగుణంగా అన్ని రాష్ట్రాల నుంచి ఇండెంట్ కోరగా, తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఇవ్వలేదు. ఈలోపు రాష్ట్రంలో నెలవారీ ఇచ్చే రేషన్ కూడా డీలర్లకు సరఫరా చేశారు. దీనిపై ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టగా, ముఖ్యమంత్రి కేసిఆర్ అసలు విషయం తెలుసుకుని, ఉచిత బియ్యం కూడా పంపిణీ చేయాలని ఆదేశించారు. అప్పటికే, బియ్యం పంపిణీ కూడా మొదలు కాగా డీలర్లు పెద్దగా పట్టించుకోలేదు.
అధికారులు ఏమి చేయలేకపోయారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 2,73,557 రేషన్ కార్డులు ఉండగా, ప్రతి నెలా 51,812 క్వింటాళ్ల 71 కిలోలు బియ్యం కోటా కేటాయిస్తున్నారు. ఇదే ఇండెంటు ప్రకారం మే నెలలో కూడా పంపిణీ చేశారు. ఉచితంగా 5 కిలోల బియ్యం ఇచ్చే విషయంలో తమకు ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు లిఖితపూర్వక ఉత్తర్వులు అందలేదని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు పేర్కొంటుండగా, ఉచిత బియ్యం పంపిణీపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. కార్డుదారులు మాత్రం ఇప్పటికి వేచిచూస్తూనే ఉన్నారు. కాగా, కనీసం వచ్చే నెలలోనైనా ఉచిత బియ్యం ఇస్తారా? లేక ఉసూరుమనిపిస్తారా? అనే సంశయం లబ్దిదారుల్లో నెలకొంది.