‘హుజూరాబాద్’పై సీఈసీ ఫోకస్.. సెగ్మెంట్ ప్రొఫైల్‌పై ఆరా!

హుజూరాబాద్​ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతున్నదనే సంకేతాలను ఇచ్చింది. కరీంనగర్​జిల్లా ముఖచిత్రం, సెగ్మెంట్​ప్రొఫైల్, సమస్యాత్మక ప్రాంతాల వివరాలను పంపాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. సెగ్మెంట్‌లోని కరోనా వ్యాప్తిపైనా ఆరా తీసింది. ఇందుకు సంబంధించిన నివేదకను సీఈవో శశాంక గోయల్​సీఈసీకి పంపారు. దిశ, తెలంగాణ బ్యూరో: హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికను పురస్కరించుకొని తాజా పరిస్థితులపై కేంద్ర ఎన్నికల కమిషన్ ఆరా తీసింది. జిల్లాలో కరోనా పరిస్థితుల వివరాలను కోరింది.. నియోజకవర్గ ప్రొఫైల్‌తో పాటు జిల్లాకు […]

Update: 2021-07-28 20:40 GMT

హుజూరాబాద్​ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతున్నదనే సంకేతాలను ఇచ్చింది. కరీంనగర్​జిల్లా ముఖచిత్రం, సెగ్మెంట్​ప్రొఫైల్, సమస్యాత్మక ప్రాంతాల వివరాలను పంపాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. సెగ్మెంట్‌లోని కరోనా వ్యాప్తిపైనా ఆరా తీసింది. ఇందుకు సంబంధించిన నివేదకను సీఈవో శశాంక గోయల్​సీఈసీకి పంపారు.

దిశ, తెలంగాణ బ్యూరో: హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికను పురస్కరించుకొని తాజా పరిస్థితులపై కేంద్ర ఎన్నికల కమిషన్ ఆరా తీసింది. జిల్లాలో కరోనా పరిస్థితుల వివరాలను కోరింది.. నియోజకవర్గ ప్రొఫైల్‌తో పాటు జిల్లాకు సంబంధించిన కొన్ని వివరాలను కూడా పంపాల్సిందిగా సీఈఓ (రాష్ట్ర ఎన్నికల అధికారి)ని ఆ లేఖలో కోరింది. గత (2018 అసెంబ్లీ) ఎన్నికల్లో ఎన్ని పోలింగ్ కేంద్రాలున్నాయి, ప్రస్తుత ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా చోటుచేసుకున్న మార్పులు, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, పోలీసుల బలగాల వినియోగం, ఎన్నికల విధుల్లో పాల్గొనాల్సిన ప్రభుత్వ బలగాలు, ప్రభుత్వ సిబ్బంది తదితర వివరాలను కూడా కమిషన్ కోరింది. దీర్ఘకాలంగా ఆ నియోజకవర్గంలో ఒకే పోస్టులో కొనసాగుతున్న వారెంతమంది.. అన్న అనేక అంశాలపై ఆరా తీసింది. ఆయా వివరాలన్నింటిపైనా సమగ్రమైన నివేదికను రాష్ట్ర సీఈఓ శశాంక్ గోయల్ 10 రోజుల క్రితమే కేంద్ర ఎన్నికల కమిషన్‌కు పంపారు.

ఎమ్మెల్సీ ఎన్నికల సన్నద్ధతపైనా..

రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల నిర్వహణపైనా కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టి పెట్టింది. ఇంతకాలం కరోనా తీవ్రత దృష్ట్యా కొన్నాళ్ల పాటు వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్న కమిషన్ ప్రస్తుత పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయన్న అభిప్రాయంతో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి మరో లేఖ రాసింది. ఎన్నికల నిర్వహణకు ఉన్న సన్నద్ధతపైన వివరాలను కోరింది. దేశవ్యాప్తంగా కరోనా తగ్గుముఖం పట్టి క్రమంగా సాధారణ పరిస్థితి నెలకొంటున్నందున ఈ ఆరు స్థానాలకు ఎన్నికలు నిర్వహించడంలో ఉన్న సాధ్యాసాధ్యాలు, రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయం ఏ విధంగా ఉన్నదో తెలపాలని సీఈఓను ఆ లేఖలో కోరింది.

సీఎస్‌కు సీఈఓ లేఖ

ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని తెలుసుకోడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి వచ్చిన లేఖను జతచేసి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సీఈఓ శశాంక్ గోయల్ లేఖ రాశారు. ముఖ్యమంత్రితో సంప్రదింపుల అనంతరం ప్రధాన కార్యదర్శి ఇచ్చే నివేదిక ఆధారంగా రాష్ట్ర సీఈఓ ఒక అంచనాకు వచ్చి కేంద్ర ఎన్నికల కమిషన్‌కు సమాచారం ఇవ్వనున్నారు. దానికి అనుగుణంగా ఎన్నికల ఏర్పాట్లతో పాటు షెడ్యూలుపైనా కమిషన్ స్పష్టతకు రానున్నది.

రాష్ట్ర అభిప్రాయంపై ఆసక్తి

శాసనమండలిలో ఆరుగురు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల పదవీకాలం జూన్ 3తో ముగిసింది. ఇందులో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు వైస్ చైర్మన్ నేతి విద్యాసాగర్, బోడకుంటి వెంకటేశ్వర్లు, కడియం శ్రీహరి, మహమ్మద్ ఫరీదుద్దీన్, ఆకుల లలిత ఉన్నారు. ఇక గవర్నర్ కోటాలో ఒక నామినేటెడ్ ఎమ్మెల్సీ స్థానం కూడా ఖాళీగానే ఉన్నది. 45 రోజులకు పైగా మండలిలో ఆరు స్థానాలు ఖాళీగానే ఉన్నాయి. తాజా పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, కేంద్రానికి ఎలాంటి అభిప్రాయాన్ని పంపుతుందనేది ఆసక్తికరంగా మారింది.

సీఈఓ నివేదికలోని అంశాలివే..

రాష్ట్ర సీఈఓ నివేదిక ప్రకారం ఈ నెల 19వ తేదీ నాటికి హుజూరాబాద్ నియోజకవర్గంలో 2,42,420 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో సాధారణ ఓటర్లు 2,29,787 మంది. సుమారు 825 మంది పోలీసులు అవసరమని గుర్తించారు. 82 ప్రాంతాల్లో 305 పోలింగ్ కేంద్రాలకు సగటున 610 బ్యాలట్, కంట్రోల్, వీవీప్యాట్ మిషన్లు అవసరమని అంచనా వేశారు. వెయ్యి మంది పంచాయతీ కార్యదర్శులు, 500 మంది వైశ్య కమ్యూనిటీకి చెందినవారు పోటీ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నందున అదే జరిగితే ఈవీఎంలతో పాటు వీవీప్యాట్‌ల సంఖ్య కూడా భారీ స్థాయిలోనే పెరిగే అవకాశముంది.

కేంద్ర ఎన్నికల కమిషన్‌కు పంపిన వివరాల్లో కొన్ని…

పోలింగ్ కేంద్రాల సంఖ్య : 305
సమస్యాత్మకమైనవి : 131
అత్యంత సమస్యాత్మకమైనవి : 24
అవసరమైన బ్యాలట్ యూనిట్‌లు : 610
ప్రస్తుతం అందుబాటులో ఉన్నవి : 158
అవసరమైన కంట్రోల్ యూనిట్‌లు : 610
అందుబాటులో ఉన్నవి : 788
అవసరమైన వీవీప్యాట్‌లు : 610
అందుబాటులో ఉన్నవి : 179
కావాల్సిన పోలీసు బలగాలు : 825 మంది
పోలింగ్ సిబ్బంది : 1,440 మంది (15% రిజర్వు కలుపుకొని)

Tags:    

Similar News