ఫైర్ నిబంధనలు ఉల్లంఘనలు.. కేసులు నమోదు
దిశ, క్రైమ్ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ మరింత విస్తరిస్తున్న నేపథ్యంలో ఫైర్ సేఫ్టీ నిబంధనలను ఉల్లంఘిస్తున్న ఆస్పత్రులపై డిజిస్టార్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ కొరడా ఝులిపిస్తోంది. నిబంధనలకు అనుగుణంగా ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు లేని ఆస్పత్రులపై జరిమానాలు విధిస్తూ కేసులు నమోదు చేస్తోంది. రాష్ట్రంలో కోవిడ్ ఆస్పత్రులలో ఫైర్ సేఫ్టీ నిబంధనలకు సంబంధించి వాస్తవ పరిస్థితులపై వైద్య శాఖ, ప్రభుత్వం ఇప్పటికే నివేదిక తెప్పించుకుంది. ఈ సందర్భంగా.. 15 మీటర్ల కంటే ఎత్తు కలిగిన […]
దిశ, క్రైమ్ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ మరింత విస్తరిస్తున్న నేపథ్యంలో ఫైర్ సేఫ్టీ నిబంధనలను ఉల్లంఘిస్తున్న ఆస్పత్రులపై డిజిస్టార్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ కొరడా ఝులిపిస్తోంది. నిబంధనలకు అనుగుణంగా ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు లేని ఆస్పత్రులపై జరిమానాలు విధిస్తూ కేసులు నమోదు చేస్తోంది. రాష్ట్రంలో కోవిడ్ ఆస్పత్రులలో ఫైర్ సేఫ్టీ నిబంధనలకు సంబంధించి వాస్తవ పరిస్థితులపై వైద్య శాఖ, ప్రభుత్వం ఇప్పటికే నివేదిక తెప్పించుకుంది. ఈ సందర్భంగా.. 15 మీటర్ల కంటే ఎత్తు కలిగిన భవనాలలో కొనసాగుతున్న ఆస్పత్రులపై ఫైర్ సేఫ్టీ విభాగం ప్రత్యేక తనిఖీలు చేపట్టింది.
ఆకస్మిక తనిఖీలు
కోవిడ్ మహమ్మారి సెకండ్ వేవ్‌లోనూ మరింత వేగంగా విస్తరిస్తున్న ఫలితంగా రోజురోజుకి వేలాదిగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. పాజిటివ్ కేసులను తగ్గించేందుకు ఈ నెల 20 నుంచి 30 వరకు (10 రోజులు) రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూను ప్రభుత్వం అమలు చేస్తోంది. అయినా.. పాజిటివ్ కేసులు ఏ మాత్రం తగ్గడం లేదు. ఈ పరిస్థితుల్లో ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. కరోనా బారిన పడ్డవారంతా ప్రాణభయంతో ఆస్పత్రులలో చేరుతున్నారు. ఆస్పత్రుల బెడ్లన్నీ ఫుల్ అయ్యాయి. దేశంలోని మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో ఇటీవల కోవిడ్ రోగులు చికిత్స పొందుతున్న ఆస్పత్రుల్లో అగ్ని ప్రమాదాల సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. రోగులు పదుల సంఖ్యలో మృత్యువాత పడ్డారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో కొనసాగుతున్న ఆస్పత్రులలో ఫైర్ సర్వీసెస్ డిపార్మెంట్ సర్ ప్రైజ్ విజిట్ (ఆకస్మిక తనిఖీ) లను చేపట్టింది. ఈ సందర్భంగా ఫైర్ డిపార్మెంట్ నిబంధనలకు అనుగుణంగా అగ్నిప్రమాద నివారణ చర్యలు చేపడుతున్నారా?.. లేదా? అనే విషయాలపై అధికారులు తనిఖీలు చేపడుతున్నారు.
23 ఆస్పత్రులకు నోటీసులు
రాష్ట్ర విపత్తుల నిర్వహణ, అగ్నిమాపక సేవల విభాగం 15 మీటర్ల ఎత్తుకు పైబడిన భవనాలకు మాత్రమే ఎన్ఓసీ క్లియరెన్స్ జారీ చేస్తోంది. ఈ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 15 మీటర్ల ఎత్తుకు పైబడిన 135 భవనాలలో కొనసాగుతున్న ఆస్పత్రులను విపత్తుల నిర్వహణ, అగ్నిమాపక సేవల విభాగం ఆకస్మిక తనిఖీలను చేపట్టింది. తనిఖీల సందర్భంగా నిబంధనలకు అనుగుణంగా ఉండాల్సిన మంటలను ఆర్పే అగ్ని మాపక యంత్రాలు, హోస్ రీల్, వెట్ రైసర్, యార్డ్ హైడ్రాంట్, ఆటోమేటిక్ స్ప్రింక్‌లర్స్, స్మోక్ డిటెక్టర్స్, మాన్యువల్ కాల్ పాయింట్, నీటి నిల్వ కోసం టెర్రస్‌పై సంప్ ఏర్పాటు, ఫైర్ పంప్స్, తదితర ఫైర్ సేఫ్టీ పాయింట్ లాంటి చెక్ పాయింట్‌లను చెక్ చేస్తున్నారు. వీటిలో 23 భవనాలలో కొనసాగుతున్న ఆస్పత్రులు ఫైర్ నిబంధనలు ఉల్లంఘనలకు పాల్పడినందుకు ఫైర్ సర్వీస్ అధికారులు నోటీసులు జారీ చేసి కేసులు నమోదు చేశారు. వీటిలో 18 భవనాలకు ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించనందుకు చట్టపరమైన చర్యలకు, మరో 5 భవనాలకు సాధారణ నోటీసులు జారీ చేశారు. వీటిలో 4 ఆస్పత్రులకు కోర్టు జరిమానా విధించగా… మొత్తం 19 ఆస్పత్రులపై కేసులు నమోదై దర్యాప్తు కొనసాగుతోంది.
గాంధీ, టిమ్స్ వద్ద ఫైరింజన్లు – పాపయ్య, ఆర్ఎఫ్ఓ- హైదరాబాద్
కరోనా ప్రత్యేక పరిస్థితుల్లో సికింద్రాబాద్ గాంధీ, గచ్చిబౌలి టిమ్స్ ఆస్పత్రుల్లో రోగుల తాకిడి పెరుగుతోంది. ఈ రెండు ఆస్పత్రుల అత్యవసరం నిమిత్తం ఫైరిజంన్లను అందుబాటులో ఉంచాం. రాష్ట్రంలోని కోవిడ్ ఆస్పత్రులు, క్వారంటైన్ కేంద్రాలను ఎప్పటికప్పుడు నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. ప్రతి ఆస్పత్రి మేనేజ్మెంట్ తప్పనిసరిగా విద్యుత్ సంబంధిత, అగ్ని ప్రమాదాలకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంజినీర్లతో తనిఖీలు చేయించి, వారి సలహాలు తీసుకోవాలి. సహాయ చర్యల కోసం స్థానిక ఫైర్ అధికారులకు సమాచారం ఇవ్వండి. ఏదైనా ప్రమాదం జరిగినా.. అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నా.. పొగలు కమ్ముకుంటున్నా సిబ్బంది 101 లేదా 99499 91101 నెంబరుకు కాల్ చేయాలి.