కేసులు పెరుగుతున్నాయ్… జాగ్రత్తగా ఉండండి : సీఎం

దిశ, న్యూస్ బ్యూరో: తగ్గుముఖం పడుతుందనుకున్న కరోనా వ్యాప్తి ప్రభుత్వ అంచనాలకు భిన్నంగా పెరుగుతోంది. గడచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 28 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఎవ్వరూ వెంటిలేటర్ మీద లేరు, ఆక్సిజన్ అవసరం రాలేదు, ఎవ్వరికీ సీరియస్ కండిషన్ లేదు అని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ ఆదివారం ఇద్దరు కరోనా పేషెంట్లు చనిపోయారు. దేశవ్యాప్తంగా పెరుగుతున్న తరహాలోనే తెలంగాణలోనూ కేసులు పెరుగుతుండడంపై ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ”దేశంలోనూ, రాష్ట్రంలోనూ కరోనా వైరస్ వ్యాప్తి […]

Update: 2020-04-12 20:12 GMT

దిశ, న్యూస్ బ్యూరో: తగ్గుముఖం పడుతుందనుకున్న కరోనా వ్యాప్తి ప్రభుత్వ అంచనాలకు భిన్నంగా పెరుగుతోంది. గడచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 28 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఎవ్వరూ వెంటిలేటర్ మీద లేరు, ఆక్సిజన్ అవసరం రాలేదు, ఎవ్వరికీ సీరియస్ కండిషన్ లేదు అని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ ఆదివారం ఇద్దరు కరోనా పేషెంట్లు చనిపోయారు. దేశవ్యాప్తంగా పెరుగుతున్న తరహాలోనే తెలంగాణలోనూ కేసులు పెరుగుతుండడంపై ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ”దేశంలోనూ, రాష్ట్రంలోనూ కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువ అవుతున్నది. ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలి. అధికార యంత్రాంగం మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. పక్కనే ఉన్న మహారాష్ట్రలో పరిస్థితి భయంకరంగా ఉంది. దేశవ్యాప్తంగా కూడా పాజిటివ్ కేసులు పెరిగాయి, మరణాలు కూడా పెరిగాయి. ఈ పరిస్థితి ఉన్నందునే లాక్‌డౌన్ పొడిగింపు నిర్ణయం తీసుకున్నాం. పరిస్థితి తీవ్రతను ప్రజలు అర్థం చేసుకోవాలి. వీలైనంత వరకు ఇళ్లకే పరిమితం కావాలి. బయటకు వెళ్లాల్సి వస్తే తప్పక సామాజిక దూరం పాటించాలి” అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. కరోనా వ్యాప్తి నివారణకు చేపడుతున్న చర్యలు, వైరస్ సోకినవారికి అందుతున్న చికిత్స, లాక్‌డౌన్ అమలవుతున్న తీరు, పేదలకు అందుతున్నసాయం, పంటల కొనుగోళ్ల ప్రక్రియ తదితర అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన అనంతరం విడుదల చేసిన ప్రకటనలో పై వ్యాఖ్యలు చేశారు.

‘‘ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, తెలంగాణలో పరిణామాలు గమనిస్తుంటే కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదని స్పష్టం అవుతున్నది. కరోనా వైరస్ వ్యాప్తి జరుగుతున్నదనే వాస్తవం గ్రహించి, ప్రజలు ఇంతకుముందు కంటే కూడా మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి లక్షణాలు కన్పించినా వెంటనే అధికారులు పరీక్షలు నిర్వహించాలి. పాజిటివ్ వచ్చినవారు ఎవరెవరిని కలిశారు, ఎక్కడెక్కడ తిరిగారు తదితర వివరాలు సేకరించి వారికి కూడా పరీక్షలు నిర్వహించాలి. అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద తనిఖీలు పెంచాలి. నియంత్రణ మరింత పకడ్బందీగా జరగాలి. మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్నవారిని గుర్తించి, పరీక్షలుచేసే పని ముమ్మరంగా జరుగుతున్నది. ఇంకా ఎవరైనా తెలిసో తెలియకో పరీక్షలు చేయించుకోకుంటే వారే స్వయంగా వచ్చి పరీక్షలు చేయించుకోవాలి. ప్రజల నిరంతర అప్రమత్తత, ఇళ్లకే పరిమితం కావడం ద్వారానే కరోనా వ్యాప్తి నివారణ సాధ్యం’’ అని ముఖ్యమంత్రి అన్నారు.

కొత్తగా 28 కేసులు, ఇద్దరి మృతి

గడచిన రెండు రోజులుగా నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్య తక్కువగా ఉండడంతో వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉందని ప్రభుత్వం ఒక అభిప్రాయానికి వచ్చింది. ఈ నెల 24వ తేదీకల్లా చికిత్స పొందుతున్నవారు కోలుకుంటారని, నెలాఖరుకల్లా డిశ్చార్జి అవుతారని, క్వారంటైన్‌లో ఉన్నవారు ఇళ్ళకు వెళ్ళిపోతారని ముఖ్యమంత్రి రెండు రోజుల క్రితం వ్యాఖ్యానించారు. కానీ ఆదివారం ఒకేసారి 28 కొత్త కేసులు నమోదు కావడం, ఇద్దరు మృతి చెందడంతో వైద్యారోగ్య శాఖ అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. ముఖ్యమంత్రి కూడా దీనిపై సుమారు ఆరు గంటల పాటు లోతుగా సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 531కు చేరుకుంది. ఆసుపత్రుల నుంచి 103 మంది డిశ్చార్జి కావడంతో యాక్టివ్ పాజిటివ్ కేసుల సంఖ్య 412గా ఉంది.

ఆదివారం కొత్తగా నమోదైన కేసులు : 28
ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం కేసులు : 531
మృతులు : 16 (ఆదివారం ఇద్దరితో కలిపి)
యాక్టివ్ కేసులు : 412

Tags: Telangana, corona, Covid19, spread, new positive cases, death, LockDown

Tags:    

Similar News