చీటింగ్ లో డాక్టరేట్… ?

దిశ, వరంగల్: ఆ యువకుడు చదువుతున్నది డిగ్రీ. కానీ, జనాలను మోసం చేయడంలో డాక్టరేట్ పొందాడు. తనకు పరిచయమైన ప్రతీ వ్యక్తిని తన మాయ మాటలతో నమ్మించి డబ్బులు కొట్టేస్తాడు.. ఆ తర్వాత కనిపిస్తే ఒట్టు. గతంలో మిషన్ కాకతీయ పథకానికి బ్రాండ్ అంబాసిడర్ గా చెప్పుకుని పలువురు ఇరిగేషన్ అధికారులను ముప్పు తిప్పలు పెట్టాడు. వారు అసలు నిజం గ్రహించి యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆట కట్టించారు. కానీ, అతడి ప్రవర్తనలో ఎలాంటి మార్పు […]

Update: 2020-05-03 09:10 GMT

దిశ, వరంగల్: ఆ యువకుడు చదువుతున్నది డిగ్రీ. కానీ, జనాలను మోసం చేయడంలో డాక్టరేట్ పొందాడు. తనకు పరిచయమైన ప్రతీ వ్యక్తిని తన మాయ మాటలతో నమ్మించి డబ్బులు కొట్టేస్తాడు.. ఆ తర్వాత కనిపిస్తే ఒట్టు. గతంలో మిషన్ కాకతీయ పథకానికి బ్రాండ్ అంబాసిడర్ గా చెప్పుకుని పలువురు ఇరిగేషన్ అధికారులను ముప్పు తిప్పలు పెట్టాడు. వారు అసలు నిజం గ్రహించి యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆట కట్టించారు. కానీ, అతడి ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాకపోగా తెలివిని పెట్టుబడిగా పెట్టి మోసాలు చేస్తూనే ఉన్నాడు. ఆ యువ మోసగాడి బారిన పడిన బాధితులు బయటకు చెప్పుకోలేక నానా అవస్థలు పడుతున్నారు.

మాయమాటలు చెప్పి..

జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం శ్రీమన్నారాయణ పురం గ్రామానికి చెందిన గంగరబోయిన అఖిల్ 2014 లో ఇంటర్ చదువుతున్న రోజుల్లోనే 24 గంటలు, 2015లో 48 గంటల పాటు ఉపన్యసించి తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించాడు. ఆ తర్వాత 2018లో 80 గంటల పాటు ఉపన్యసించి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు కైవసం చేసుకున్నాడు. ఏదైనా ఒక అంశంపై రోజుల పాటు అనర్గళంగా ఉపన్యసిస్తాడు. అతడి ప్రతిభను మెచ్చుకుంటూ చాలా మంది ప్రజా ప్రతినిధులు, ప్రొఫెసర్లు, ఉద్యోగ సంఘాల నాయకులు ప్రశంసించారు. అంతేగాకుండా మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్ సైతం అఖిల్ ప్రతిభను ప్రశంసించి తెలంగాణ కీర్తిని చాటావని కితాబునిచ్చారు. ఆ తర్వాత గానీ ఆ యువకుడి మోసాలు బయటకు రాలేదు. మంత్రులు, ప్రముఖులు మెచ్చుకున్న సందర్భంలో దిగిన ఫొటోలు, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ పత్రాలను పెట్టుబడిగా అమాయకులను మోసం చేయడం షురూ చేశాడు. ప్రముఖులతో అపాయింట్ మెంట్ ఇప్పిస్తానని, ఎలాంటి పనులైనా చేసి పెడతనంటూ లక్షల రూపాయలు గుంజినట్లు తెలుస్తోన్నది. హన్మకొండలోని మాస్టర్ జీ కళాశాలలో డిగ్రీ చదువుతున్న క్రమంలో ఏకంగా కళాశాల యాజమాన్యాన్నే బురిడీ కొట్టించినట్లు ప్రచారంలో ఉంది. అంతేగాకుండా సహచర విద్యార్థులకు సైతం మాయమాటలు చెప్పి పెద్ద మొత్తంలో డబ్బులు గుంజినట్లు సమాచారం.

మళ్లీ మోసాలకు..

చిన్నతనంలో ప్రతిభా పాటవాలతో అందరి మన్ననలు పొందిన అఖిల్ ఇంటర్ చదువుతున్న రోజుల నుంచే మోసాలు చేయడం ప్రారంభించాడు. 2016లో తన అనర్గళ ఉపన్యాసం గురించి విన్న అప్పటి భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు మిషన్ కాకతీయ ఫథకం ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు అఖిల్ సేవలను వినియోగించుకోవాలని నిశ్చయించినట్లు తెలిసింది. ఈ మేరకు అతడిని పిలిపించుకుని వివరాలు అడిగి తెలుసుకున్నాడని అప్పట్లో ప్రచారం జరిగింది. దీన్ని ఆసరాగా చేసుకున్న అఖిల్ అప్పటి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కురవి మండలం నారాయణపురంలోని మిషన్ కాకతీయ పనుల పరిశీలనకు వెళ్లడం కలకలం రేపింది. తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకానికి బ్రాండ్ అంబాసిడర్ గా నియమించిందని చెప్పుకుని అక్కడి నీటిపారుదల శాఖ అధికారులకు మూడు చెరువుల నీళ్లు తాగించాడు. పనుల్లో నాణ్యత లోపించిందని సస్పెండ్ చేయిస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో యువకుడి ప్రవర్తనను అనుమానించిన అధికారులు మంత్రి పేషీ అధికారులను ఆరా తీయగా అంతా బోగస్ అని తేలింది. వెంటనే తేరుకున్న అధికారులు నకిలీ బ్రాండ్ అంబాసిడర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన అప్పట్లో సంచలనం కలిగించింది. ఇది జరిగిన కొంత కాలం సైలెంట్ గా ఉన్న అఖిల్ ఇటీవల కాలంగా మళ్లీ మోసాలకు తెరతీసినట్లు తెలిసింది.

tags: Warangal, Cheating, Mission Bhagiratha, fake Brand Ambassador, Police, Case

Tags:    

Similar News