ఐఐటీల్లో కొత్త ఆన్‌లైన్‌ పీజీలు..

Update: 2023-10-01 10:47 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఐఐటీల్లో ఈ-మాస్టర్స్‌ కార్యక్రమం ద్వారా ఆన్‌లైన్‌ పీజీ కోర్సులు అందిస్తున్నారు. తాజాగా ఐఐటీ కాన్పూర్‌ ఒకేసారి నాలుగు పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రాములను ప్రవేశపెట్టింది. ‘క్లైమెట్‌ ఫైనాన్స్‌ - సస్టైనబిలిటీ, రెన్యుబుల్‌ ఎనర్జీ అండ్‌ ఈ-మొబిలిటీ, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ - మెషీన్‌ లెర్నింగ్‌, బిజినెస్‌ లీడర్‌షిప్‌ ఇన్‌ డిజిటల్‌ ఏజ్‌’ అనే కోర్సులను నూతనంగా మొదలుపెట్టబోతోంది.

ఈ కోర్సులను విద్యార్థులు ఏడాది నుంచి మూడేళ్ల కాలంలోపు ఎప్పుడైనా పూర్తి చేయవచ్చు. వారాంతాల్లో లైవ్‌ ఇంటరాక్టివ్‌ తరగతులు నిర్వహిస్తారు. ముఖ్యంగా గ్రాడ్యుయేషన్‌ తర్వాత ఉద్యోగాలు చేస్తూ చదువుకోవాలనుకునే యువతను దృష్టిలో వీటిని తయారుచేశారు. పరిశ్రమల అవసరాలకు తగినట్టు నడిచే ఈ కోర్సుల్లో 60 క్రెడిట్లు, 12 మాడ్యూల్స్‌ ఉంటాయి. ఐఐటీ కాన్పూర్‌ అధ్యాపకులు, పరిశోధకులు ఈ కోర్సుల్లో చేరిన విద్యార్థులకు మార్గదర్శనం చేస్తారు.

ఐఐటీ గాంధీనగర్‌లో.. ‘ఎనర్జీ పాలసీ అండ్‌ రెగ్యులేషన్‌’ అంశంపై ఐఐటీ గాంధీ నగర్‌ రెండేళ్ల ఆన్‌లైన్‌ పీజీ కోర్సును ప్రవేశపెట్టింది. ప్రస్తుతం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఎనర్జీ సెక్టార్‌లో ఆవిష్కరణలను ప్రోత్సహించేలా ఈ కోర్సు ఉండబోతోంది. ఇంజినీరింగ్‌, లా, ఎకనమిక్స్‌, కామర్స్‌, మేనేజ్‌మెంట్‌, ఫైనాన్స్‌ సబ్జెక్టులు చదివే విద్యార్థులెవరైనా దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. కోర్సులో చేరే వారికి సౌకర్యవంతంగా ఉండేలా సులభమైన పనివేళల్లో పూర్తి చేసే అవకాశం కల్పిస్తున్నారు. పూర్తి చేసిన అభ్యర్థులకు పూర్వ విద్యార్థిగా గుర్తింపుతోపాటు ప్లేస్‌మెంట్‌ సహాయం సైతం లభిస్తుంది. వీటిలో చేరేందుకు గేట్‌ స్కోరుతో పనిలేదు. వచ్చే జనవరి నుంచి తరగతులు మొదలవుతాయి. అక్టోబరు 31వ తేదీ వరకూ దరఖాస్తులకు సమయం ఉంది.


Similar News