అభ్యర్థుల లెక్కలు..అంతుచిక్కని ప్రజానాడి

దిశ ప్రతినిధి, మేడ్చల్: టెన్షన్.. టెన్షన్.. టెన్షన్.. ఈ పదం విన్నా టెన్షన్ పుడుతుంది గ్రేటర్ బరిలో దిగిన అభ్యర్థులకు.. ఎన్నికల్లో గెలుస్తామా..? ఓడుతామా..? అనే టెన్షన్ అభ్యర్థులను వెంటాడుతోంది. ఇన్ని రోజుల శ్రమకు ఫలితం దక్కుతుందా.. లేదా.. అని ప్రధాన పార్టీల అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. తామే గెలుస్తామనే ధీమాను వ్యక్తం చేస్తున్నా.. లోపల మాత్రం తెలియని భయం వెంటాడుతోంది. పోలింగ్ 50శాతం కూడా దాటకపోవడంతో అభ్యర్థులకు మరింత గుబులుపట్టుకుంది. తక్కువ ఓటింగ్ ఎవరికి లాభమనే […]

Update: 2020-12-02 23:00 GMT

దిశ ప్రతినిధి, మేడ్చల్: టెన్షన్.. టెన్షన్.. టెన్షన్.. ఈ పదం విన్నా టెన్షన్ పుడుతుంది గ్రేటర్ బరిలో దిగిన అభ్యర్థులకు.. ఎన్నికల్లో గెలుస్తామా..? ఓడుతామా..? అనే టెన్షన్ అభ్యర్థులను వెంటాడుతోంది. ఇన్ని రోజుల శ్రమకు ఫలితం దక్కుతుందా.. లేదా.. అని ప్రధాన పార్టీల అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. తామే గెలుస్తామనే ధీమాను వ్యక్తం చేస్తున్నా.. లోపల మాత్రం తెలియని భయం వెంటాడుతోంది. పోలింగ్ 50శాతం కూడా దాటకపోవడంతో అభ్యర్థులకు మరింత గుబులుపట్టుకుంది. తక్కువ ఓటింగ్ ఎవరికి లాభమనే దానిపై అభ్యర్థుల్లో ఆత్మావలోకనం మొదలైంది. ఏ పోలింగ్ బూత్ లో ఎన్ని ఓట్లుపడ్డాయి… వాటిలో మన పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయి అనే లెక్కలు వేసుకుంటున్నారు.

అంతుచిక్కని ఓటరు నాడీ..

రాజకీయ పార్టీల నేతల పరిస్థితి కొంచెం భయం.. కొంచెం ధీమా.. అన్న చందంగా మారింది. పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా.. లోపల మాత్రం ఆందోళన నిద్ర పట్టనివ్వట్లేదు. ఎవరిని అడిగినా మీకు మా ఓటు అని ఉత్సాహంగా చెప్పారని అభ్యర్థులు చెబుతున్నారు. దీనికి తోడు పోలింగ్ తక్కువ శాతం నమోదవడంతో ఓటరు నాడీ అంతు చిక్కడం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గ్రేటర్ కార్పొరేషన్ పై జెండా ఎగుర వేయాలని ప్రధాన పార్టీలు శర్వశక్తులు ఒడ్డాయి. అధికార టీఆర్ఎస్ తోపాటు బీజేపీ శక్త వంచన లేకుండా చమటోడ్చాయి. గత ఎన్నికల్లో 99సీట్లు కైవసం చేసుకున్న టీఆర్ఎస్, తాజా ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం సాధించి, మంచి ఫామ్ లోకి వచ్చిన కమలదళం బల్దియా ఎన్నికల ప్రచారానికి జాతీయ నాయకులను రంగంలోకి దించింది. టీఆర్ఎస్, బీజేపీతోపాటు కాంగ్రెస్ సైతం ఈ ఎన్నికల్లో హోరాహోరీగా తలపడింది. టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని విస్తృతంగా ప్రచారం చేశారు. శివారు ప్రాంతాల్లోని పలు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్, బీజేపీలకు హస్తం పార్టీ గట్టి పోటీని ఇచ్చిందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. మంగళవారం ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినా.. అభ్యర్థుల ముఖాల్లో మాత్రం ఆందోళన కన్పిస్తోంది. బూతుల వారీగా ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయనే కూడికలు తీసి వేతల్లో మునిగిపోయారు.

తక్కువ పోలింగ్ తో టెన్షన్..

హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో ఓటింగ్ నమోదు కాకపోవడం చర్చకు దారి తీసింది. గ్రేటర్ లో 74లక్షల ఓట్లలో 35లక్షల ఓట్లు పోలై 45.97శాతంగా నమోదైంది. గత జీహెచ్ఎంసీ ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం స్వల్పంగా పెరిగింది. మొదట ఎన్నికల పోలింగ్ మందకొడిగానే సాగింది. సాయంత్రం 5గంటల వరకు 36.73శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. పోలింగ్ ముగుస్తున్న సమయంలో ఓటింగ్ ఎక్కువగా జరగడం అనుమానాలకు తావిస్తోంది. చివరి గంటలో ఏ కేంద్రంలో అనుకున్న స్థాయిలో ఓటర్లు లేకపోయినా.. కేంద్రాల వద్ద బారులుదీరి కన్పించకపోయినా.. ఏకంగా 12శాతం పోలింగ్ పెరగడమేమిటని నెటీజన్లు చర్చించుకుంటున్నారు. ఈ చివరి గంటలో జరిగిన మిస్టరీ ఎవరి కొంప ముంచుతుందోనన్న సందేహాలు అభ్యర్థుల్లో వ్యక్తమవుతున్నాయి.

ఎవరి ధీమా వారిదే..

ప్రధాన పార్టీల అభ్యర్థులు మాత్రం మేమంటే మేము గెలుస్తామనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే క్షేత్రస్థాయిలో పరిస్థితుల ఆధారంగా తమ విజయం ఖాయమని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది. నాంపల్లిలోని ఆ పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద నాయకులు, కార్యకర్తలు పటాకులు కాల్చి సంబురాలు జరుపుకున్నారు. రూ.10వేల వరద సాయం అందని ప్రజలు పెద్ద సంఖ్యలో పోలింగ్‌ బూత్‌లకు వచ్చారని చెబుతున్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌, ఆరేళ్లలో ప్రభుత్వం ఏం చేయలేదన్న వ్యతిరేకత ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తోందని, ఇవే తమ గెలుపునకు బాటలు వేస్తాయని కమలం నేతలు అంటున్నారు.

ఊహించిన దాని కంటే తమకు ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం పోలింగ్‌ రోజున కనపడిందని కాంగ్రెస్‌ నేతలూ చెబుతున్నారు. తమ గెలుపు జాబితాలో లేని డివిజన్లలో కూడా పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తున్నారని పేర్కొంటున్నారు. పాతబస్తీలో తమ పట్టు ఏ మాత్రం తగ్గదని, పోలింగ్‌ తక్కువగా నమోదైనా గతం కంటే సీట్లు మాత్రం పెరుగుతాయని మజ్లిస్‌ నాయకులు చెబుతున్నారు. అధికార పార్టీ నాయకులూ గత ఎన్నికల్లో మాదిరిగానే విజయ యాత్ర కొనసాగుతుందనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం ఫలితాలు వెలువడనుండడంతో ఏ పార్టీ విజయఢంకా మోగిస్తుందో వేచి చూడాలి మరీ..

Tags:    

Similar News