కంటి మీద కునుకేది.. అర్థరాత్రి కెనరా బ్యాంకు తాళాలు బద్దలు

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం మంగల్ పహాడ్ గ్రామంలో గల కెనరా బ్యాంక్‌కు కన్నం వేసే ప్రయత్నం జరిగింది. గురువారం అర్ధరాత్రి దాటాక గుర్తు తెలియని వ్యక్తి బ్యాంక్ సొత్తును దోచుకెళ్లేందుకు విఫలయత్నం చేశాడు. కెనరా బ్యాంక్‌లో ఉన్న సీసీ ఫుటేజ్ ఆధారంగా ఒకే ఒక్క వ్యక్తి బ్యాంక్‌తో పాటు ఎటీఎం మెషీన్‌లోనూ డబ్బులను దోచుకెళ్లేందుకు ప్రణాళికను రచించినట్టు తెలుస్తోంది. అర్ధరాత్రి 12.30గంటలకు ఓ రాడ్‌తో బ్యాంక్‌లోకి ప్రవేశించినట్లు పోలీసులు ప్రాధమికంగా గుర్తించి […]

Update: 2021-08-27 07:49 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం మంగల్ పహాడ్ గ్రామంలో గల కెనరా బ్యాంక్‌కు కన్నం వేసే ప్రయత్నం జరిగింది. గురువారం అర్ధరాత్రి దాటాక గుర్తు తెలియని వ్యక్తి బ్యాంక్ సొత్తును దోచుకెళ్లేందుకు విఫలయత్నం చేశాడు. కెనరా బ్యాంక్‌లో ఉన్న సీసీ ఫుటేజ్ ఆధారంగా ఒకే ఒక్క వ్యక్తి బ్యాంక్‌తో పాటు ఎటీఎం మెషీన్‌లోనూ డబ్బులను దోచుకెళ్లేందుకు ప్రణాళికను రచించినట్టు తెలుస్తోంది. అర్ధరాత్రి 12.30గంటలకు ఓ రాడ్‌తో బ్యాంక్‌లోకి ప్రవేశించినట్లు పోలీసులు ప్రాధమికంగా గుర్తించి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన బోధన్ రూరల్ సీఐ రవీంద్రనాయక్, ఎడపల్లి ఎస్సై ఎల్లాగౌడ్‌లు క్లూస్ టీమ్ సహాయంతో బ్యాంక్ ఆవరణాన్ని నిశితంగా పరిశీలించి పలు చోట్ల వేలి ముద్రలను సేకరించారు.

ఇనుపరాడ్డు సహాయంతో బ్యాంక్ మెయిన్ గేట్ తాళాలు పగులగొట్టి బ్యాంకు లోపలకు ప్రవేశించిన వ్యక్తి బ్యాంక్ ఏటీఎం మెషీన్‌ను ధ్వంసం చేసాడు. ఏటీఎం మెషీన్‌లో నగదు లేనట్లు గుర్తించిన దుండగుడు, బ్యాంక్ స్ట్రాంగ్ రూమ్ గేట్‌కు ఉన్న తాళాన్ని ధ్వంసం చేసేందుకు యత్నించాడు. సుమారు 2 గంటల పాటు బ్యాంక్‌లో ఉన్న డబ్బులను దోచుకెళ్లేందుకు ప్రయత్నించిన దుండగుడు తన ప్రయత్నం విరమించుకొని వెనుదిరిగినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ సందర్భంగా బోధన్ రూరల్ సీఐ రవీంద్ర నాయక్ మాట్లాడుతూ.. బ్యాంక్‌లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా ఒకే ఒక్క వ్యక్తి బ్యాంక్ చోరీకి విఫలయత్నం చేసినట్లు గుర్తించామన్నారు.

బ్యాంక్ నుండి నగదు అపహరణకు గురికాలేదని సమాచారం. బ్యాంక్ ఘటనపై క్లూస్ టీం సహాయంతో పాటు సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేపడుతామని సీఐ తెలిపారు. ఇటీవల జానకంపేట్ గ్రామ శివారు ప్రాంతంలో గల లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో చోరీకి విఫలయత్నంతో పాటు, ఠాణకలాన్ మహాలక్ష్మి ఆలయం, బోధన్-నిజామాబాద్ ప్రధాన రహదారి పక్కనే గల బాపునగర్ సాయిబాబా ఆలయంలో దొంగలు ఏకంగా హుండీని ఎత్తుకెళ్లిన ఘటన మరువకముందే మరోసారి కెనరా బ్యాంక్ ఘటన దొంగతనానికి ప్రయత్నం జరగడంపై జిల్లా ప్రజలు మండిపడుతున్నారు. పోలీసులు అర్ధరాత్రి పెట్రోలింగ్‌ను మరింత పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Tags:    

Similar News