‘రాజకీయం’ చేస్తున్న ఉద్యోగ సంఘాల నేతలు

దిశ ప్రతినిధి, నల్లగొండ: ఇటీవల కాలంలో కొంతమంది ఉద్యోగ సంఘాల నేతలు రాజకీయ నేతలను మించిపోతున్నారు. ప్రభుత్వ పెద్దల మెప్పును పొందేందుకో.. మరేదైనా కారణమో గానీ.. రాజకీయ నేతలను మించి ప్రభుత్వ భజనను చేస్తుండడం గమనార్హం. ఏండ్ల తరబడి నుంచి ఇవ్వాల్సిన పీఆర్సీని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. దీంతో కొంతమంది ఉద్యోగ సంఘాల నేతలు.. ఇన్నేండ్లు ఎందుకివ్వలేదనేది పక్కకు నెట్టి.. ప్రభుత్వ తీరును అహో ఓహో అంటూ ఆకాశానికి ఎత్తుతున్నారు. ఈ సంగతి ఏలా ఉన్నా.. […]

Update: 2021-04-07 06:19 GMT

దిశ ప్రతినిధి, నల్లగొండ: ఇటీవల కాలంలో కొంతమంది ఉద్యోగ సంఘాల నేతలు రాజకీయ నేతలను మించిపోతున్నారు. ప్రభుత్వ పెద్దల మెప్పును పొందేందుకో.. మరేదైనా కారణమో గానీ.. రాజకీయ నేతలను మించి ప్రభుత్వ భజనను చేస్తుండడం గమనార్హం. ఏండ్ల తరబడి నుంచి ఇవ్వాల్సిన పీఆర్సీని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. దీంతో కొంతమంది ఉద్యోగ సంఘాల నేతలు.. ఇన్నేండ్లు ఎందుకివ్వలేదనేది పక్కకు నెట్టి.. ప్రభుత్వ తీరును అహో ఓహో అంటూ ఆకాశానికి ఎత్తుతున్నారు. ఈ సంగతి ఏలా ఉన్నా.. ప్రస్తుతం టీఎన్‌జీఓ ఉద్యోగ సంఘాల నేత చేసిన ఓ పని.. ఇప్పుడు తీవ్ర విమర్శల పాలవుతోంది.

నాగార్జునసాగర్ ఉపఎన్నిక నేపథ్యంలో రాజకీయ నేతలంతా నియోజకవర్గంలో తిష్ట వేసి జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో టీఎన్‌జీఓ సంఘం నేతృత్వంలో టీఎన్‌జీఓస్ యూనియన్ కృతజ్ఞత బస్సు యాత్ర పేరుతో విజయవిహార్‌లో భారీగా ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఉద్యోగ సంఘాల నేతలు పీఆర్సీ అమలుపై హర్షం వ్యక్తం చేస్తూ నృత్యాలు చేసి కోలాహలం సృష్టించారు. అయితే అదే విజయవిహార్‌లో అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రముఖ నేతలంతా బస చేస్తుండడం గమనార్హం.

ప్రచారం కోసం వచ్చి వారం పది రోజులుగా ఇక్కడే ఉంటున్నారు. ఈ సమయంలో టీఎన్‌జీఓ ఉద్యోగ సంఘం నేతలు.. ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఉద్యోగ సంఘాల నేతలు.. రాజకీయ నేతలను మించి ఇక్కడ ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం ఏంటని పలువురు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఇదిలావుంటే.. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో ఉద్యోగ సంఘాల నేతలు భారీ సమావేశాన్ని నిర్వహించి.. చాలామంది మాస్కులు ధరించకపోవడంపై బాధ్యతగా ఉండాల్సిన ఉద్యోగులే.. ఇలా వ్యవహరించడం ఏంటని విమర్శలు ఎదుర్కొంటున్నారు.

Tags:    

Similar News