నేడు రాష్ట్ర కేబినెట్ భేటీ

దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో గురువారం మధ్యాహ్నం కేబినెట్ సమావేశం జరగనున్నది. నాలుగు అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరగనున్నట్లు సచివాలయ వర్గాల సమాచారం. ఇకపైన వరిధాన్యాన్ని 60 లక్షల టన్నులకు మించి కొనలేమంటూ ఇటీవల ఎఫ్‌సీఐ చెప్పడంతో ప్రత్యామ్నాయాలపై ఈ సమావేశంలో చర్చ జరగనున్నట్లు తెలిసింది. దళితబంధు పథకానికి చట్టబద్ధత కల్పించడం, ఆ అంశంపై అసెంబ్లీ సమావేశాల్లో విస్తృతంగా చర్చించడం, ఉభయ సభల్లో చర్చల ద్వారా ఏకాభిప్రాయాన్నిసాధించడం తదితర అంశాలపై […]

Update: 2021-09-15 20:40 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో గురువారం మధ్యాహ్నం కేబినెట్ సమావేశం జరగనున్నది. నాలుగు అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరగనున్నట్లు సచివాలయ వర్గాల సమాచారం. ఇకపైన వరిధాన్యాన్ని 60 లక్షల టన్నులకు మించి కొనలేమంటూ ఇటీవల ఎఫ్‌సీఐ చెప్పడంతో ప్రత్యామ్నాయాలపై ఈ సమావేశంలో చర్చ జరగనున్నట్లు తెలిసింది. దళితబంధు పథకానికి చట్టబద్ధత కల్పించడం, ఆ అంశంపై అసెంబ్లీ సమావేశాల్లో విస్తృతంగా చర్చించడం, ఉభయ సభల్లో చర్చల ద్వారా ఏకాభిప్రాయాన్నిసాధించడం తదితర అంశాలపై కూడా కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.

ముఖ్యమంత్రి కేసీఆర్ గతేడాది డిసెంబరులో ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత 50 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటన చేశారు. దాదాపు పది నెలలు పూర్తయినా ఇప్పటికీ నోటిఫికేషన్లు వెలువడలేదు. జూలై, ఆగస్టు మాసాల్లో జరిగిన కేబినెట్ భేటీల్లో దీనిపై విస్తృతంగా చర్చ జరిగినా ఉద్యోగుల విభజన, ఖాళీలపై స్పష్టత లేకపోవడంతో మంత్రి హరీశ్‌రావు అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటైంది. పలుమార్లు చర్చించిన ఈ కమిటీ ఇటీవలే ముఖ్యమంత్రికి నివేదిక సమర్పించింది. దీనిపై చర్చించి ఖాళీల సంఖ్యను విశ్లేషించి నోటిఫికేషన్లపై మంత్రివర్గ ఆమోదాన్ని తీసుకునే అవకాశం ఉంది.

రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు మార్చి 26వ తేదీతో ముగిసినందున ఆరు నెలల వ్యవధిలో మళ్ళీ అసెంబ్లీ సెషన్ నిర్వహించాల్సి ఉన్నది. ఈ నెల 25వ తేదీకల్లా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నందున నిర్వహణపైనా, చర్చించాల్సిన అంశాలపైనా మంత్రివర్గ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక దళితబంధును హుజూరాబాద్ నియోజకవర్గంలో పూర్తిస్థాయిలో అమలుచేయాలని గత మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలియజేయడంతో ఇప్పుడు మరో నాలుగు మండలాల్లోనూ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. రెండు మూడు వారాల్లోనే నిధులను కూడా విడుదల చేయనున్నట్లు సీఎం తెలిపారు. దీనిపై మంత్రివర్గంలో చర్చించి నాలుగు మండలాల్లో అమలు, నిధుల కేటాయింపు తదితరాలపై కూడా ఆమోదం తీసుకునే అవకాశం ఉంది. ఇక విద్యుత్ అంశంపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఉన్న వివాదం, పాత బకాయిలపై హైకోర్టులో దాఖలైన పిటిషన్, కృష్ణా జలాల విషయంపైనా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉందని సమాచారం.

Tags:    

Similar News