GDP: భారత వృద్ధి రేటును 7 శాతానికి పెంచిన ప్రపంచ బ్యాంక్

ప్రపంచ బ్యాంకు భారత వృద్ధి రేటు అంచనాలను సవరించింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ వృద్ధి 7 శాతంగా నమోదు కావచ్చని మంగళవారం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది.

Update: 2024-09-03 08:48 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రపంచ బ్యాంకు భారత వృద్ధి రేటు అంచనాలను సవరించింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ వృద్ధి 7 శాతంగా నమోదు కావచ్చని మంగళవారం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. గతంలో దీనిని 6.6 శాతంగా అంచనా వేయగా, ఇటీవల ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌లో ఆర్థిక రంగం పుంజుకోవడం, తగ్గుతున్న ద్రవ్యోల్బణం, పట్టణ నిరుద్యోగం క్రమంగా మెరుగుపడటం, వ్యవసాయ రంగం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఆశించిన స్థాయిలో సానుకూలంగా ఉండటంతో ప్రపంచ బ్యాంకు భారత జీడీపీ వృద్ధి పట్ల తన అంచనాలను సవరించింది.

మెరుగైన శ్రామిక మార్కెట్, పటిష్టమైన సేవా వాణిజ్యం నేపథ్యంలో భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా మిగిలిపోయిందని ఎఫ్‌వై23, 24లో 8.2 శాతంగా వృద్ధి చెందిందని ప్రపంచ బ్యాంకు నివేదిక పేర్కొంది. పబ్లిక్ రంగ విభాగాల్లో పెట్టుబడులు పెరగడం, గృహ రియల్ ఎస్టేట్ పెట్టుబడుల వల్ల వృద్ధి పెరిగింది. సేవల పరంగా 9.9 శాతం వృద్ధి చెందిన ఉత్పాదక రంగం జీడీపీకి మద్దతునిచ్చింది. మరో సానుకూల అంశం ఏమిటంటే ఎక్కువ మంది మహిళలు ఉద్యోగాల్లో చేరడం.. ఎఫ్‌వై25 ప్రారంభంలో మహిళా పట్టణ నిరుద్యోగం 8.5 శాతానికి పడిపోయింది. మరోవైపు, మొత్తం పట్టణ యువత నిరుద్యోగం 17 శాతంగా ఉంది.

రుణ జీడీపీ నిష్పత్తి ఎఫ్‌వై24లో 83.9 శాతం నుండి ఎఫ్‌వై27 నాటికి 82 శాతానికి తగ్గుతుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. ముఖ్యంగా కరెంట్ ఖాతా లోటు జీడీపీలో దాదాపు 1.6 శాతంగా ఉంటుందని అంచనా. కరోనా మహమ్మారికి ముందు ఉన్న స్థాయిలతో పోల్చితే ప్రపంచ వృద్ధి తగ్గినప్పటికీ, బహుళ భౌగోళిక-రాజకీయ సవాళ్ల మధ్య భారత్ బలంగా నిలబడింది. ఇటీవల ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు అంచనాల కంటే తక్కువగా 6.7 శాతం నమోదవ్వగా, పూర్తి ఏడాది కాలానికి భారత వృద్ధి రేటు అంచనాలను జేపీ మోర్గాన్, గోల్డ్‌మాన్ శాక్స్ వంటి సంస్థలు 6.5 శాతంగా ఉండొచ్చని పేర్కొనగా, ప్రపంచబ్యాంక్‌ మాత్రం 7 శాతం నమోదు కావొచ్చని అంచనా వేయడం గమనార్హం.


Similar News