'ఏఐ' అణుబాంబుతో సమానం: వారెన్ బఫెట్!

ఇటీవల ప్రపంచ టెక్ రంగంలో ఎక్కువగా వినిపిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ) గురించి పలువురు దిగ్గజాలు కీలక హెచ్చరికలు చేస్తున్నారు.

Update: 2023-05-07 15:46 GMT

న్యూయార్క్: ఇటీవల ప్రపంచ టెక్ రంగంలో ఎక్కువగా వినిపిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ) గురించి పలువురు దిగ్గజాలు కీలక హెచ్చరికలు చేస్తున్నారు. గతవారం గూగుల్‌లో పనిచేసిన, గాడ్‌ఫాదర్ ఆఫ్ ఏఐగా పేరు గడించిన జెఫరీ హింటన్ ఏఐ వల్ల మొత్తం ప్రపంచానికి తీవ్ర నష్టం ఏర్పడుతుందని, మనిషి మనుగడకే ప్రమాదం ఎదురయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. తాజాగా ప్రపంచ దిగ్గజ పెట్టుబడిదారుడు వారెన్ బఫెట్ కూడా ఏఐ విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. బఫెట్‌కు చెందిన బర్క్‌షైర్ హాత్‌వే వార్షిక సమావేశంలో మాట్లాడిన ఆయన, తన స్నేహితుడు బిల్‌గేట్స్ చాట్‌జీపీటీని పరిచయం చేశారు.

దాని పనితీరు ఆశ్చర్యంతో పాటు ఆందోళనకు గురిచేసింది. ఏఐ ఒక అణుబాంబు లాంటిదని అభివర్ణించారు. 'అన్ని పనులు ఒక్కరే చేయడం ఆందోళన కలిగించేదిగా ఉంది. దానివల్ల మనుషులు కొత్తగా కనిపెట్టేందుకు ఏదీ ఉండదు. కొత్తగా ఏదైనా చేస్తే ఎలాంటి ప్రమాదం ఉంటుందో రెండో ప్రపంచ యుద్ధం సమయంలో అణుబాంబు ద్వారా అనుభవించాం. మనం ఏది చేసినా 200 ఏళ్ల తర్వాత కూడా ప్రపంచానికి మేలు కలిగించాలి. ఏఐ ప్రపంచ తీరుని మార్చవచ్చని, అయితే మనిషి ప్రవర్తనను, ఆలోచనను ఎప్పటికీ పొందలేదని' వారెన్ బఫెట్ వివరించారు. గతంలో టెస్లా అధినేత ఎలన్ మస్క్ సైతం ఏఐ వల్ల మనుషులకు ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News