టెలికాం కంపెనీలపై పన్నుల భారం తగ్గించాలని కోరిన వొడా-ఐడియా సీఈఓ!
దేశీయ టెలికాం రంగంపై ఉన్న భారీ సుంకాలను ప్రభుత్వం తగ్గించాలని వొడాఫోన్ ఐడియా సీఈఓ అక్షయ ముంద్రా అన్నారు.Latest Telugu News
న్యూఢిల్లీ: దేశీయ టెలికాం రంగంపై ఉన్న భారీ సుంకాలను ప్రభుత్వం తగ్గించాలని వొడాఫోన్ ఐడియా సీఈఓ అక్షయ ముంద్రా అన్నారు. టెలికాం కంపెనీలు కొత్త టెక్నాలజీకి మారుతున్న తరుణంలో నగదు సమీకరణ, 5జీ నెట్‌వర్క్‌లో పెట్టుబడుల కోసం మూలధన నిధులను సమకూర్చుకునే అవకాశాలకు వీలుగా ఈ చర్యలను తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం టెలికాం కంపెనీలు స్పెక్ట్రమ్ ధరతో సహా ప్రభుత్వానికి చెల్లించాల్సిన మొత్తం లెవీలు మొత్తం పరిశ్రమ ఆదాయంలో 58 శాతంగా ఉన్నాయి.
అంటే, టెలికాం కంపెనీలు సంపాదించే ప్రతి రూ. 100లో రూ. 58లు ప్రభుత్వానికి చెల్లిస్తున్నాయి. టెక్నాలజీ మారుతున్న సమయంలో పరిశ్రమ త్వరగా భారీ మూలధన పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉందని, ఈ రంగంపై భారాన్ని వేగంగా తగ్గించాలని ఆయన అన్నారు. ఆరవ ఇండియా మొబైల్ కాంగ్రెస్ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, అత్యంత తక్కువగా టారిఫ్‌లను కలిగిన భారత్‌లో ప్రపంచంలో మరెక్కడా లేనంతగా లెవీలు ఉన్నాయి. వస్తు, సేవల జీఎస్టీ 18 శాతం, 12 శాతం లైసెన్స్, ఫీజులు, స్పెక్ట్రమ్ వినియోగ ఛార్జీలు ఉన్నాయి. ఈ 30 శాతం బహిరంగంగా ఉన్నవే. ఒకవేళ స్పెక్ట్రమ్ ధరను కలుపుకుని, దాన్ని యాన్యూటీ విలువగా మార్చి ఆదాయంలో లెక్కిస్తే అదనంగా 28 శాతం భారం టెలికాం కంపెనీలపై పడుతోందని ఆయన వివరించారు.
ప్రభుత్వం పన్నుల భారాన్ని తగ్గిస్తే అదనపు నిధుల ద్వారా పెట్టుబడులకు అవకాశం ఉంటుందన్నారు. ఇదే కార్యక్రమంలో మాట్లాడిన భారతీ ఎయిర్‌టెల్ ఎగ్జిక్యూటివ్, ఎయిర్‌టెల్ కొద్ది రోజుల్లో 5జీ టారిఫ్‌లపై నిర్ణయం తీసుకుంటుందన్నారు. గతవారం కంపెనీ ఎనిమిది నగరాల్లో 5జీ సేవలను ప్రారంభించింది. ఈ ఏడాదిలోనే వేగంగా 5జీ సేవల కోసం మూలధన వ్యయ ప్రణాళికను ముందుకు తీసుకెళ్తుందని, 2024 నాటికి దేశవ్యాప్తంగా కవరేజీ అందించేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు.