Vodafone Idea: అపరిమిత డేటాతో వొడాఫోన్ ఐడియా కొత్త వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్స్
వార్షిక రీఛార్జ్ ప్లాన్ కింద మిగిలిన రోజుకు అందించే 2జీబీ రోజువారీ డేటాకు ఈ అన్‌లిమిటెడ్ డేటా అదనమని కంపెనీ వివరించింది.
దిశ, బిజినెస్ బ్యూరో: ఆర్థిక కష్టాల్లో ఉన్న ప్రైవేట్ రంగ టెలికాం కంపెనీ వొడాఫోన్ ఐడియా యూజర్లను ఆకర్షించేందుకు సరికొత్త రీఛార్జ్ ప్లాన్‌లను తీసుకొచ్చింది. ముఖ్యంగా పరిశ్రమలో పెరిగిన పోటీకి అనుగుణంగా వినియోగదారుల కోసం అర్ధరాత్రి నుంచి మధ్యాహ్నం వరకు అపరిమిత డేటాను కంపెనీ అందించనుంది. ఈ మేరకు శుక్రవారం రూ. 3,599, రూ. 3,699, రూ. 3,799 ధరలతో ప్రీ-పెయిడ్ ప్లాన్‌లను విడుదల చేసింది. ఈ ప్లాన్‌లను ఎంచుకున్న కస్టమర్లు ఏడాది పాటు ప్రతిరోజు అర్ధరాత్రి 12 గంటల నుంచి మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు అపరిమిత డేటాను అధిక వేగంతో వినియోగించవచ్చు. వార్షిక రీఛార్జ్ ప్లాన్ కింద మిగిలిన రోజుకు అందించే 2జీబీ రోజువారీ డేటాకు ఈ అన్‌లిమిటెడ్ డేటా అదనమని కంపెనీ వివరించింది. అంతేకాకుండా 'వీఐ సూపర్‌హీరో ' ప్యాక్‌లు వారంలో వాడకుండా వదిలేసిన డేటాను వీకెండ్‌లో ఉపయోగించుకునే వీలుంటుందని కంపెనీ స్పష్టం చేసింది. కొత్త రీఛార్జ్ ప్లాన్‌లు, వీఐ సూపర్‌హీరో ప్రీపెయిడ్ ప్యాక్‌లు ప్రస్తుతం మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, పంజాబ్, హర్యానాలలో అందుబాటులో ఉన్నాయి. రూ. 3,699 రీఛార్జ్ ప్లాన్‌లో ఏడాది పాటు డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ కూడా లభిస్తుంది. రూ. 3,799 ప్లాన్ ఎంచుకున్న వారికి అమెజాన్ ప్రైమ్ లైట్ వార్షిక సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుందని కంపెనీ పేర్కొంది.